August 25, 2013


రాష్ట్ర విభజనకు సంబంధించి ప్రభుత్వ కమిటీ వేస్తామని సోనియాగాంధీ పేర్కొనడంపై ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ హోదాలో కమిటీ వేస్తామని ఆమె చెబుతున్నారని ప్రశ్నించారు. ఆదివారం మధ్యాహ్నం గుంటూరులో నన్నపనేని విలేకరులతో మాట్లాడుతూ కమిటీ ప్రకటన ద్వారా సోనియా ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను అవమానపరిచారన్నారు. సోనియా కేవలం ఒక లోక్‌సభ సభ్యురాలన్న విషయం మరిచిపోవద్దన్నారు.

సోనియా, ఆమె తొట్టి గ్యాంగ్‌పై తమకు నమ్మకం లేదని, ఆ కమిటీని ఆమోదించే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని పదేపదే సోనియా చెబుతూ సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తున్నా కేంద్ర మంత్రులు ఇంకా ఏ ముఖం పెట్టుకొని పదవులు పట్టుకొని వేలాడుతున్నారని ప్రశ్నించారు. పదవులు పట్టుకొని వేలాడే కన్నా ఎందులోనైనా దూకి చావడం మంచిదని సీమాంధ్ర కేంద్ర మంత్రులపై నన్నపనేని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ప్రభుత్వ కమిటీ వేయడానికి సోనియా ఎవరు? : నన్నపనేని


ఉద్యమ ద్రోహులుగా ముద్రపడక ముందే పదవులకు రాజీనామా చేయండంటూ సీమాంధ్ర కేంద్ర మంత్రులకు టీడీపీ నేత కోడెల శివప్రసాద్ సూచించారు. వెంటనే సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తిరుపతిలో ఆదివారం ఆయన చిత్తూరు ఎంపీ డాక్టర్ ఎన్.శివప్రసాద్, చదలవాడ కృష్ణమూర్తి, తెలుగు యువత జిల్లా, నగర అధ్యక్షులు శ్రీధర్‌వర్మ, భాస్కర్‌యాదవ్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. తెలుగు జాతి విడిపోకూడదన్న భావనతో సీమాంధ్రలోని ప్రజలు ఉద్యమవాణి వినిపిస్తున్నారన్నారు.

కీలకమైన ఈ తరుణంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు సోనియాకు భయపడి ఢిల్లీలో కాలం గడపడం ఉద్యమ ద్రోహమేనని ఆరోపించారు. రాష్ట్రం రావణకాష్టంలా మారుతున్నా ప్రధానమంత్రి నోరు మెదపకపోవటం దారుణమన్నారు. చంద్రబాబు లేఖ ఇచ్చినందున రాష్ట్ర విభజన జరిగిందని సోనియా చెప్పటం మసిపూసి మారేడుకాయ చేయడమేనని ఆయన ధ్వమజెత్తారు. విభజన ఆషామాషీ వ్యవహారం కాదన్న విషయం గతంలో జరిగిన మూడు రాష్ట్రాల విభజనలు నేర్పిన గుణపాఠాన్ని కేంద్రంలోని కాంగ్రెస్ పెద్దలు గుర్తించుకుంటే మంచిందని కోడెల సలహా ఇచ్చారు. కేంద్రం నియమించే కమిటీల వల్ల ఒరిగేదేమీ ఉండదన్నారు. తమ సొంత రాష్ట్రాల్లో విభజనను వ్యతిరేకిస్తూ, అక్కడ నాయకులుగా చెలామణికాలేని చిదంబరం, ఆంటోని, అహ్మద్‌పటేల్, అజాద్‌లాంటి వారి మాటలకు సోనియా ప్రాధాన్యమివ్వడం సిగ్గుచేటన్నారు. రాహుల్‌గాంధీని ఇక్కడి నుంచి పోటీకి నిలిపి ప్రధానిని చేయాలన్న సోనియా అత్యాశే తెలంగాణ ఏర్పాటు ప్రకటనకు కారణమని ఆయన ఆరోపించారు.

తెలుగు ప్రజల్లో 75 శాతం మంది విభజనను వ్యతిరేకిస్తున్నారన్న విషయాన్ని కేంద్ర కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. పార్లమెంటులో ఐదుగురు టీడీపీ ఎంపీలం చేసిన సమైక్య ఆందోళనల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని వేస్తున్నట్లుగా ప్రకటన వెలువడిందని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ పేర్కొన్నారు. పార్లమెంటు సాగినంతకాలం తాము నిరసన చెబుతూనే ఉంటామన్నారు. ఈ నెలాఖరు నుంచి పార్లమెంటు ముందు నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నామన్నారు. హైదరాబాద్‌ను యూటీ చేయడమంటే రాష్ట్రం బ్యూటీ పోయినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు సూరా సుధాకర్‌రెడ్డి, దశరథనాయుడు, మధు, బాలకృష్ణ, రవినాయుడు పాల్గొన్నారు.

సీమాంధ్ర కేంద్ర మంత్రులు రాజీనామాలు చేయలి : కోడెల


రాష్ట్ర విభజన కాంగ్రెస్ పార్టీకి భస్మాసుర హస్తం కానుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాగంటి మురళీ మోహన్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన సమైక్యాంధ్రకు మద్దతుగా జరుగుతున్న దీక్షలకు సంఘీభావం తెలిపారు. కొడుకును ప్రధానిని చేయాలన్న రాజకీయ స్వార్థంతోనే సోనియాగాంధీ రాష్ట్రాన్ని విభజించేందుకు పూనుకున్నారని తూర్పారబట్టారు.

విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతంలో రాజకీయాలకు అతీతమైన ప్రజాఉద్యమం ఉద్భవించిందని అన్నారు. దాంతో పునరాలోచనలో పడ్డ ఢిల్లీ పెద్దలు ఏంచేయాలనే విషయమై తర్జనభర్జనలు పడుతున్నారన్నారు. సమైక్య ప్రకటన వచ్చేంతవరకు ఉద్యమం కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే రెండో స్థానానికి చేర్చిన చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కానున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభంజనం సృష్టిస్తుందని తెలిపారు.

విభజన కాంగ్రెస్‌కు భస్మాసుర హస్తం : మురళీ మోహన్

దొంగే దొంగ అన్న చందాన వ్యవహరిస్తున్న కాంగ్రెస్, వైసీపీలను తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు అన్నారు. దుష్టత్రయం... కాంగ్రెస్, వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించి, సర్వనాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్త చేశారు.

దుష్టత్రయం భ్రష్టు పట్టిస్తోంది: ముద్దు కృష్ణమ