August 25, 2013

సీమాంధ్ర కేంద్ర మంత్రులు రాజీనామాలు చేయలి : కోడెల


ఉద్యమ ద్రోహులుగా ముద్రపడక ముందే పదవులకు రాజీనామా చేయండంటూ సీమాంధ్ర కేంద్ర మంత్రులకు టీడీపీ నేత కోడెల శివప్రసాద్ సూచించారు. వెంటనే సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తిరుపతిలో ఆదివారం ఆయన చిత్తూరు ఎంపీ డాక్టర్ ఎన్.శివప్రసాద్, చదలవాడ కృష్ణమూర్తి, తెలుగు యువత జిల్లా, నగర అధ్యక్షులు శ్రీధర్‌వర్మ, భాస్కర్‌యాదవ్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. తెలుగు జాతి విడిపోకూడదన్న భావనతో సీమాంధ్రలోని ప్రజలు ఉద్యమవాణి వినిపిస్తున్నారన్నారు.

కీలకమైన ఈ తరుణంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు సోనియాకు భయపడి ఢిల్లీలో కాలం గడపడం ఉద్యమ ద్రోహమేనని ఆరోపించారు. రాష్ట్రం రావణకాష్టంలా మారుతున్నా ప్రధానమంత్రి నోరు మెదపకపోవటం దారుణమన్నారు. చంద్రబాబు లేఖ ఇచ్చినందున రాష్ట్ర విభజన జరిగిందని సోనియా చెప్పటం మసిపూసి మారేడుకాయ చేయడమేనని ఆయన ధ్వమజెత్తారు. విభజన ఆషామాషీ వ్యవహారం కాదన్న విషయం గతంలో జరిగిన మూడు రాష్ట్రాల విభజనలు నేర్పిన గుణపాఠాన్ని కేంద్రంలోని కాంగ్రెస్ పెద్దలు గుర్తించుకుంటే మంచిందని కోడెల సలహా ఇచ్చారు. కేంద్రం నియమించే కమిటీల వల్ల ఒరిగేదేమీ ఉండదన్నారు. తమ సొంత రాష్ట్రాల్లో విభజనను వ్యతిరేకిస్తూ, అక్కడ నాయకులుగా చెలామణికాలేని చిదంబరం, ఆంటోని, అహ్మద్‌పటేల్, అజాద్‌లాంటి వారి మాటలకు సోనియా ప్రాధాన్యమివ్వడం సిగ్గుచేటన్నారు. రాహుల్‌గాంధీని ఇక్కడి నుంచి పోటీకి నిలిపి ప్రధానిని చేయాలన్న సోనియా అత్యాశే తెలంగాణ ఏర్పాటు ప్రకటనకు కారణమని ఆయన ఆరోపించారు.

తెలుగు ప్రజల్లో 75 శాతం మంది విభజనను వ్యతిరేకిస్తున్నారన్న విషయాన్ని కేంద్ర కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. పార్లమెంటులో ఐదుగురు టీడీపీ ఎంపీలం చేసిన సమైక్య ఆందోళనల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని వేస్తున్నట్లుగా ప్రకటన వెలువడిందని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ పేర్కొన్నారు. పార్లమెంటు సాగినంతకాలం తాము నిరసన చెబుతూనే ఉంటామన్నారు. ఈ నెలాఖరు నుంచి పార్లమెంటు ముందు నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నామన్నారు. హైదరాబాద్‌ను యూటీ చేయడమంటే రాష్ట్రం బ్యూటీ పోయినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు సూరా సుధాకర్‌రెడ్డి, దశరథనాయుడు, మధు, బాలకృష్ణ, రవినాయుడు పాల్గొన్నారు.