March 16, 2013

జన్మని ఇవ్వడం తల్లికి మరో జన్మ. ఆ తల్లిని, బిడ్డని చల్లగా దీవించేది ఆస్పత్రి..అందువల్లే ప్రతి ఆస్పత్రీ మరో అమ్మే. అమ్మ లేని ఇల్లు ఎలా గొల్లమంటుందో ఆస్పత్రి లేని ఊరూ ఉసూరుమంటుంది. స్వార్థం పెరిగిన సమాజం, సర్కారుల నిర్లక్ష్యంతో అమ్మా, ఆస్పత్రి రెండూ దిక్కులేనివవుతున్నాయి. తణుకు ఏరియా ఆస్పత్రిని చూసినప్పుడు నన్ను ఇదే భావం మెలిపెట్టింది.

కడుపు నొప్పి వచ్చినా, కాలునొప్పి వచ్చినా ధర్మాసుపత్రే కష్టజీవులకు దిక్కు. కార్పొరేట్ ఆస్పత్రుల వైపు కాళ్లు కాదు కదా..కళ్లు కూడా తిప్పిచూడలేని నిర్భాగ్యులు వీళ్లు. ఆరోగ్య బీమా నుంచి ఆరోగ్యశ్రీదాకా ఎన్ని కబుర్లు చెప్పినా కడకు ఈ పేదసాదలకు ఈ ధర్మాసుపత్రులే గతి. వినడానికి బాధనిపించినా ఇది నిజం. అది ఎంత నిజమో తణుకులో అడుగుపెట్టిన తరువాతే నాకూ తెలిసింది. సూదిమందు నుంచి జ్వరం బిళ్లల దాకా.. ఏదీ అడగడానికి లేదు. చీటీలు రాసి బయట తెచ్చకోమంటున్నారట. "ఇక్కడ కాదు.. నేనే ఫలానా సెంటర్‌లో క్లినిక్ పెట్టాను.. అక్కడకు రండి. తగ్గిస్తాను'' అని రోగులతో వైద్యుల బేరాలట! పేదోడి ప్రాణం ఎంత చౌక!

నిధి పడితే ఒక్కరికే.. ఉపాధి చూపితే పది మందికి! ఈ ఆలోచనతోనే నాడు నేను సంస్కరణలు తెచ్చాను. రూపాయిను తినడం కాదు.. సంపాదించడం ఎలాగో నేర్పించాను. నా ముందుచూపుతో రాష్ట్రానికి స్థిర ఆస్తులు సమకూరాయి. ఆదాయం పెరిగింది. కానీ ఏం లాభం? సమాజం మొత్తానికి చెందాల్సిన ఈ ఆస్తులు ఒకరిద్దరి చేతుల్లో బందీ అవుతున్నాయి. తణుకులో చివరకు గుడినీ, బడినీ వదిలిపెట్టలేదు. భూబకాసురులే అంతటా! వీళ్ల బొజ్జలు నింపడానికి ఏ ఆస్తీ, ఏ వనరులూ చాలడం లేదు. మంది సొమ్ముకు కక్కుర్తి పడేవారికి సమాధి కట్టేదెప్పుడో!


పేదోడి ప్రాణం ఎంత చౌక!

కావాలనే తుస్.. మనిపించారు!
బెయిల్, బ్లాక్‌మెయిల్ పార్టీల కోరికిదే
'పశ్చిమ' యాత్రలో బాబు చిరునవ్వులు


  ఏలూరు : "అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టారు. తుస్..మనిపించారు. బెయిల్, బ్లాక్‌మెయిల్ పార్టీల పని అది. సభలో సమాధానం చెప్పలేక చివరకు అవే చతికిలబడ్డాయి'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. వైసీపీ సభలో సెల్ఫ్‌గోల్ చేసుకున్నదని వ్యాఖ్యానించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం పైడిపర్రు వద్ద ఆయన పాదయాత్ర ప్రారంభించారు. తణుకు, అజ్జరం కాలనీల మీదుగా నడిచారు. కాకర పర్రు హైస్కూలులో రాత్రి బస చేశారు. అంతకుముందు.. తణుకు తదితర ప్రాంతాల్లో జరిగిన సభల్లో అవిశ్వాస తీర్మానం వీగిపోవడాన్ని చంద్రబాబు ప్రస్తావించారు.

"వీళ్లకి (వైఎస్సార్, టీఆర్ఎస్) రూల్ పొజిషన్ చదవటం రాదు. అందుకే కాంగ్రెస్ ఒకరోజులోనే అవిశ్వాసం తంతు పూర్తి చేసింది. తగుదునమ్మా అంటూ అవిశ్వాసం పెట్టిన పార్టీలు..ఎందుకు, ఎవరి కోసం పెట్టింది చెప్పలేకపోయాయి. బెయిల్, బ్లాక్‌మెయిల్, సూట్‌కేసులతో రాజకీయాలు నడపాలనుకుంటున్నాయి. ఈ పార్టీలను ప్రజలు క్షమించబోరు' అని హెచ్చరించారు.

వైఎస్ వేటగాడు అయితే జగన్ చిన్నవేటగాడు అని దుయ్యబట్టారు. స్వార్థం కోసం, అవినీతి పనులను కప్పిపెట్టుకునేందుకు ఆ పార్టీలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. "నాకు బెయిల్ అవసరం లేదు. కేసులు లేవు. పెట్టాలనుకున్నా పెట్టలేరు. నేను నిప్పు లాంటివాడిని' అని తణుకు ఫ్లై ఓవర్ సెంటర్‌లో జరిగిన సభలో అన్నారు. కుప్పంలో ప్రజాస్వామ్యం నాలుగు పాదాలపై నడుస్తుండగా, పులివెందులలో అరాచక రాజ్యం సాగుతోందని ధ్వజమెత్తారు.

"ఈ రెండు నియోజకవర్గాలను మీరే వెళ్లి పరిశీలించండి. అప్పుడు నేను చెప్పేది ఎంత నిజమో మీకే స్వయంగా తెలుస్తుంది. ర్రాష్టాన్ని దోచుకుతింటున్నారనే ఆవేదన తప్ప నాకు ఎవరి మీద కూడా కోపం లేదు'' అని పేర్కొన్నారు. అవిశ్వాసం సందర్భంగా సీఎంకిరణ్ తీరుపై ఆయన మండిపడ్డారు. "కిరికిరి కిరణ్‌కుమార్‌రెడ్డి క్రికెట్ ఆడతాడు. కానీ ఆయనొక ఎక్స్‌ట్రా ప్లేయర్. ఒళ్లంతా గర్వం. అంత గర్వం ఎందుకో? తన ఉద్యోగాన్ని, పదవిని కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నాడు? తన ఇద్దరి తమ్ముళ్లతో అవినీతిని విస్తరింపజేస్తున్నారు'' అని మండిపడ్డారు.

జగన్.. ఓ రౌడీ పత్రిక నడుపుతున్నాడని దుయ్యబట్టారు. మరోసారి ఉద్యోగుల కష్టాలను ప్రస్తావించారు. "నా హయాంలో పని ఒత్తిడితో ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. ప్రజల కోసమే అప్పట్లో నేనలా వ్యవహరించాను. ఇప్పుడు ఉద్యోగులు అన్ని వర్గాల మాదిరిగానే కష్టాల్లో ఉన్నారు. వారికి జీతాలు పెరగాలి. పిీఆర్‌సీలో వారికి సంతృప్తికరమైన జీతాలు ఫిక్స్ చేయాల్సిందే'' అని డిమాండ్ చేశారు. కాగా, పాదయాత్రకు ముందు తణుకు, ఉంగుటూరు నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమయ్యారు. అవిశ్వాస తీర్మానంపై తాను ముందు నుంచి చెబుతున్నదే జరిగిందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

జగన్‌ది రౌడీ పత్రిక: చంద్రబాబు నిప్పులు

హైదరాబాద్ : చంద్రబాబు నవ్వారు. మామూలుగా కాదు... పకపకా నవ్వారు. తన సహజ సిద్ధమైన గాంభీర్యాన్ని పక్కన పెట్టి చిరునవ్వులు నవ్వడం అలవాటు చేసుకున్న ఆయన... ఈసారి ఆపుకోలేనంతగా నవ్వారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లా పైడిపర్రు గ్రామంలో... తణుకు, ఉంగుటూరు నియోజకవర్గాల కార్యకర్తలతో జరిగిన సమీక్షలో సత్యనారాయణ అనే కార్యకర్త 'సీసా' బద్దలుకొట్టినట్లు మాట్లాడిన వైనమే ఆయనను అంతగా నవ్వించింది. వారి మధ్య సాగిన సంభాషణేంటో చదవండి.

సత్యనారాయణ అనే కార్యకర్తతో బాబు మాటా మంతీ...
చంద్రబాబు: మైకు ఆ తమ్ముడికి ఇవ్వండి. ఉత్సాహంగా ఉన్నాడు. ఏం తమ్ముడూ టిఫిన్ చేశావా?
కార్యకర్త: చేశాను సార్.
చంద్రబాబు: ఏం తిన్నావ్?
కార్యకర్త: ఇడ్లీలు తిన్నాను.
చంద్రబాబు: (కార్యకర్తలో ఏదో తేడా ఉన్నట్లు గమనించి...) ఇడ్లీలు తిన్నాక ఏం చేశావు?
కార్యకర్త: మందేశాను!
(అంతే..బాబు నవ్వు ఆపుకోలేకపోయారు. పగలబడి నవ్వారు)
చంద్రబాబు: తమ్ముడూ... మందు ఎక్కడ తాగావు. బెల్టు షాపులోనే కదా! వాటిని ఎత్తివేస్తే మందు మానేస్తావా!
కార్యకర్త: మీ మీద ఒట్టు సార్! బెల్టు షాపులు తీసేస్తే మందు మానేస్తా!
చంద్రబాబు: నామీదే ఒట్టేస్తున్నావా! (నవ్వుతూ) అధికారంలోకి రాగానే రెండో సంతకం ఆ ఫైలు మీదే పెడతాను.

మందు.. బాబు.. పకపకా!

అవిశ్వాసం పెట్టి తుస్సుమనిపించారు
అసెంబ్లీ సమావేశాలు నడిచే పరిస్థితి లేదు : చంద్రబాబు

ప.గో : ప్రధాన సమస్యలపై చర్చించకుండానే వైఎస్సార్ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి తుస్సుమనిపించాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. నాలుగేళ్లుగా ప్రజా సమస్యలకు పరిష్కారం దొరకడంలేదని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని చంద్రబాబు మండిపడ్డారు.

'వస్తున్నా..మీకోసం' పాదయాత్రను పశ్చిమగోధావరి జిల్లాలో నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు శనివారం నాడు తణుకు మండలం, పైడిపర్రులో టీడీపీ కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పీకర్ నాదెండ్ల మనోహర్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని బాబు విమర్శించారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రజా సమస్యలపై పెట్టాలని ఆయన అన్నారు.

స్వార్థ ప్రయోజనాల కోసం అవిశ్వాస తీర్మానం పెట్టి తుస్సుమనిపించారని చంద్రబాబు అన్నారు. బ్లాక్ మెయిల్ కోసం తెరాస, లాలూచీ కోసం వైయస్సార్ కాంగ్రెసు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయని ఆయన అన్నారు.

శాసనసభా సమావేశాలు నడిచే పరిస్థితి లేదని చంద్రబాబు నాయుడు అన్నారు. వాయిదా పడుతూ పోతుందని, ప్రభుత్వం దాన్నే కోరుకుంటోందని ఆయన అన్నారు. తనను ఇబ్బందుల్లో పెట్టాలని వైయస్ రాజశేఖర రెడ్డి చాలా ప్రయత్నించారని, ఏమీ చేయలేకపోయారని చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వం