March 16, 2013

ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వం

అవిశ్వాసం పెట్టి తుస్సుమనిపించారు
అసెంబ్లీ సమావేశాలు నడిచే పరిస్థితి లేదు : చంద్రబాబు

ప.గో : ప్రధాన సమస్యలపై చర్చించకుండానే వైఎస్సార్ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి తుస్సుమనిపించాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. నాలుగేళ్లుగా ప్రజా సమస్యలకు పరిష్కారం దొరకడంలేదని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని చంద్రబాబు మండిపడ్డారు.

'వస్తున్నా..మీకోసం' పాదయాత్రను పశ్చిమగోధావరి జిల్లాలో నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు శనివారం నాడు తణుకు మండలం, పైడిపర్రులో టీడీపీ కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పీకర్ నాదెండ్ల మనోహర్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని బాబు విమర్శించారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రజా సమస్యలపై పెట్టాలని ఆయన అన్నారు.

స్వార్థ ప్రయోజనాల కోసం అవిశ్వాస తీర్మానం పెట్టి తుస్సుమనిపించారని చంద్రబాబు అన్నారు. బ్లాక్ మెయిల్ కోసం తెరాస, లాలూచీ కోసం వైయస్సార్ కాంగ్రెసు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయని ఆయన అన్నారు.

శాసనసభా సమావేశాలు నడిచే పరిస్థితి లేదని చంద్రబాబు నాయుడు అన్నారు. వాయిదా పడుతూ పోతుందని, ప్రభుత్వం దాన్నే కోరుకుంటోందని ఆయన అన్నారు. తనను ఇబ్బందుల్లో పెట్టాలని వైయస్ రాజశేఖర రెడ్డి చాలా ప్రయత్నించారని, ఏమీ చేయలేకపోయారని చంద్రబాబు పేర్కొన్నారు.