March 16, 2013

జగన్‌ది రౌడీ పత్రిక: చంద్రబాబు నిప్పులు

కావాలనే తుస్.. మనిపించారు!
బెయిల్, బ్లాక్‌మెయిల్ పార్టీల కోరికిదే
'పశ్చిమ' యాత్రలో బాబు చిరునవ్వులు


  ఏలూరు : "అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టారు. తుస్..మనిపించారు. బెయిల్, బ్లాక్‌మెయిల్ పార్టీల పని అది. సభలో సమాధానం చెప్పలేక చివరకు అవే చతికిలబడ్డాయి'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. వైసీపీ సభలో సెల్ఫ్‌గోల్ చేసుకున్నదని వ్యాఖ్యానించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం పైడిపర్రు వద్ద ఆయన పాదయాత్ర ప్రారంభించారు. తణుకు, అజ్జరం కాలనీల మీదుగా నడిచారు. కాకర పర్రు హైస్కూలులో రాత్రి బస చేశారు. అంతకుముందు.. తణుకు తదితర ప్రాంతాల్లో జరిగిన సభల్లో అవిశ్వాస తీర్మానం వీగిపోవడాన్ని చంద్రబాబు ప్రస్తావించారు.

"వీళ్లకి (వైఎస్సార్, టీఆర్ఎస్) రూల్ పొజిషన్ చదవటం రాదు. అందుకే కాంగ్రెస్ ఒకరోజులోనే అవిశ్వాసం తంతు పూర్తి చేసింది. తగుదునమ్మా అంటూ అవిశ్వాసం పెట్టిన పార్టీలు..ఎందుకు, ఎవరి కోసం పెట్టింది చెప్పలేకపోయాయి. బెయిల్, బ్లాక్‌మెయిల్, సూట్‌కేసులతో రాజకీయాలు నడపాలనుకుంటున్నాయి. ఈ పార్టీలను ప్రజలు క్షమించబోరు' అని హెచ్చరించారు.

వైఎస్ వేటగాడు అయితే జగన్ చిన్నవేటగాడు అని దుయ్యబట్టారు. స్వార్థం కోసం, అవినీతి పనులను కప్పిపెట్టుకునేందుకు ఆ పార్టీలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. "నాకు బెయిల్ అవసరం లేదు. కేసులు లేవు. పెట్టాలనుకున్నా పెట్టలేరు. నేను నిప్పు లాంటివాడిని' అని తణుకు ఫ్లై ఓవర్ సెంటర్‌లో జరిగిన సభలో అన్నారు. కుప్పంలో ప్రజాస్వామ్యం నాలుగు పాదాలపై నడుస్తుండగా, పులివెందులలో అరాచక రాజ్యం సాగుతోందని ధ్వజమెత్తారు.

"ఈ రెండు నియోజకవర్గాలను మీరే వెళ్లి పరిశీలించండి. అప్పుడు నేను చెప్పేది ఎంత నిజమో మీకే స్వయంగా తెలుస్తుంది. ర్రాష్టాన్ని దోచుకుతింటున్నారనే ఆవేదన తప్ప నాకు ఎవరి మీద కూడా కోపం లేదు'' అని పేర్కొన్నారు. అవిశ్వాసం సందర్భంగా సీఎంకిరణ్ తీరుపై ఆయన మండిపడ్డారు. "కిరికిరి కిరణ్‌కుమార్‌రెడ్డి క్రికెట్ ఆడతాడు. కానీ ఆయనొక ఎక్స్‌ట్రా ప్లేయర్. ఒళ్లంతా గర్వం. అంత గర్వం ఎందుకో? తన ఉద్యోగాన్ని, పదవిని కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నాడు? తన ఇద్దరి తమ్ముళ్లతో అవినీతిని విస్తరింపజేస్తున్నారు'' అని మండిపడ్డారు.

జగన్.. ఓ రౌడీ పత్రిక నడుపుతున్నాడని దుయ్యబట్టారు. మరోసారి ఉద్యోగుల కష్టాలను ప్రస్తావించారు. "నా హయాంలో పని ఒత్తిడితో ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. ప్రజల కోసమే అప్పట్లో నేనలా వ్యవహరించాను. ఇప్పుడు ఉద్యోగులు అన్ని వర్గాల మాదిరిగానే కష్టాల్లో ఉన్నారు. వారికి జీతాలు పెరగాలి. పిీఆర్‌సీలో వారికి సంతృప్తికరమైన జీతాలు ఫిక్స్ చేయాల్సిందే'' అని డిమాండ్ చేశారు. కాగా, పాదయాత్రకు ముందు తణుకు, ఉంగుటూరు నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమయ్యారు. అవిశ్వాస తీర్మానంపై తాను ముందు నుంచి చెబుతున్నదే జరిగిందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.