March 16, 2013

పేదోడి ప్రాణం ఎంత చౌక!

జన్మని ఇవ్వడం తల్లికి మరో జన్మ. ఆ తల్లిని, బిడ్డని చల్లగా దీవించేది ఆస్పత్రి..అందువల్లే ప్రతి ఆస్పత్రీ మరో అమ్మే. అమ్మ లేని ఇల్లు ఎలా గొల్లమంటుందో ఆస్పత్రి లేని ఊరూ ఉసూరుమంటుంది. స్వార్థం పెరిగిన సమాజం, సర్కారుల నిర్లక్ష్యంతో అమ్మా, ఆస్పత్రి రెండూ దిక్కులేనివవుతున్నాయి. తణుకు ఏరియా ఆస్పత్రిని చూసినప్పుడు నన్ను ఇదే భావం మెలిపెట్టింది.

కడుపు నొప్పి వచ్చినా, కాలునొప్పి వచ్చినా ధర్మాసుపత్రే కష్టజీవులకు దిక్కు. కార్పొరేట్ ఆస్పత్రుల వైపు కాళ్లు కాదు కదా..కళ్లు కూడా తిప్పిచూడలేని నిర్భాగ్యులు వీళ్లు. ఆరోగ్య బీమా నుంచి ఆరోగ్యశ్రీదాకా ఎన్ని కబుర్లు చెప్పినా కడకు ఈ పేదసాదలకు ఈ ధర్మాసుపత్రులే గతి. వినడానికి బాధనిపించినా ఇది నిజం. అది ఎంత నిజమో తణుకులో అడుగుపెట్టిన తరువాతే నాకూ తెలిసింది. సూదిమందు నుంచి జ్వరం బిళ్లల దాకా.. ఏదీ అడగడానికి లేదు. చీటీలు రాసి బయట తెచ్చకోమంటున్నారట. "ఇక్కడ కాదు.. నేనే ఫలానా సెంటర్‌లో క్లినిక్ పెట్టాను.. అక్కడకు రండి. తగ్గిస్తాను'' అని రోగులతో వైద్యుల బేరాలట! పేదోడి ప్రాణం ఎంత చౌక!

నిధి పడితే ఒక్కరికే.. ఉపాధి చూపితే పది మందికి! ఈ ఆలోచనతోనే నాడు నేను సంస్కరణలు తెచ్చాను. రూపాయిను తినడం కాదు.. సంపాదించడం ఎలాగో నేర్పించాను. నా ముందుచూపుతో రాష్ట్రానికి స్థిర ఆస్తులు సమకూరాయి. ఆదాయం పెరిగింది. కానీ ఏం లాభం? సమాజం మొత్తానికి చెందాల్సిన ఈ ఆస్తులు ఒకరిద్దరి చేతుల్లో బందీ అవుతున్నాయి. తణుకులో చివరకు గుడినీ, బడినీ వదిలిపెట్టలేదు. భూబకాసురులే అంతటా! వీళ్ల బొజ్జలు నింపడానికి ఏ ఆస్తీ, ఏ వనరులూ చాలడం లేదు. మంది సొమ్ముకు కక్కుర్తి పడేవారికి సమాధి కట్టేదెప్పుడో!