August 20, 2013

యూపీఏ సర్కారు దేశాన్ని భ్రష్టు పట్టించిందని టీడీపీ చీఫ్‌ చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్థిక వృద్ధిరేటు తగ్గడం వల్ల దేశంలో నిరుద్యోగం పెరుగుతోందన్నారు. విధాన నిర్ణయాల్లో ప్రభుత్వానికి పక్షవాతం వచ్చిందని ఎద్దేవా చేశారు. ఆర్థికసంక్షోభంపై ప్రభుత్వానికి అధ్యయనం కరవైందన్నారు. బొగ్గు శాఖలో దస్ర్తాల గల్లంతుకు బాధ్యులెవరని ఆయన ప్రశ్నించారు. దీనిపై ప్రధాని సమాధానం చెప్పాలన్నారు. ఇంత నికృష్టమైన ప్రభుత్వాన్ని తానెప్పుడూ చూడలేదని ఆయన చెప్పారు.

దేశాన్ని భ్రష్టు పట్టించిన యూపీఏ : బాబు

రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుండి ఉండి కాలువలో జలదీక్ష చేపట్టారు. విభజన జరిగితే సీమాంధ్ర ప్రాంత ప్రజలు నీటి వనరులు కోల్పోతారని తాను ప్రజల కోసం నిరవధికంగా జలదీక్షకు పూనుకున్నట్లు ఆయన దీక్షకు ముందు ప్రకటించారు. ఈ సందర్భంగా ఉండి కాలువలో వలలు వేసుకొని వలపై కుర్చీవేసి దానిపై కూర్చున్నారు. ఉండి కాలువ ఎఫ్‌ఎస్‌ఎల్ 4.5 అడుగులు కాగా ప్రస్తుతం 4.0 అడుగుల స్థాయిలో ప్రవహిస్తోంది. ఇక కొవ్వూరు ఎమ్మెల్యే టివి రామారావు గోదావరి ఒడ్డున ఉన్న గోష్పాద క్షేత్రంలో బాలా త్రిపుర సుందరీ సమేత సుందరేశ్వర స్వామివారి ఆలయం చుట్టూ పొర్లు దండాలు చేశారు. 108 సార్లు ఈ ప్రదక్షిణ చేశారు. దేవాలయ ఆవరణలో మోకాళ్లపై కొద్ది దూరం నడిచారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విధంగా సోనియా, యుపిఎ ప్రభుత్వానికి బుద్ధిని ప్రసాదించాలని భగవంతుడిని కోరినట్లు చెప్పారు.

సమైక్యత కోసం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జలదీక్ష

చంచల్‌గూడ జైల్లో ఉన్న జగన్‌కు బెయిల్‌ కోసమే వైకాపా గౌరవఅధ్యక్షురాలు విజయమ్మ దీక్ష చేస్తుందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌తో చీకటి ఒప్పందాలను కుదుర్చుకున్న వైకాపా సమైక్యాంధ్ర కోసం దీక్ష చేపట్టడం ప్రజలను మోసం చేయడమేమని ఆయన ఆరోపించారు.

జగన్‌ బెయిల్‌ కోసమే విజయమ్మ దీక్ష: పయ్యావుల