February 2, 2013

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చింది టీడీపీయే
జలయజ్ఞం ద్వారా లబ్ది పొందింది వైఎస్, కాంట్రాక్టర్లే : చంద్రబాబు

సొసైటీ ఎన్నికల్లో రైతులు కాంగ్రెస్‌కే మద్దతు ఇచ్చారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పుకోవడం సిగ్గు చేటని టీడీపీ అధినేత చంద్ర బాబునాయుడు దుయ్యబట్టారు. ఓటును కొనుగోలు చేసి, ప్రత్యర్థులను తీసేసి సహకార ఎన్నికల్లో గెలవడం గొప్పకాదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి వ్యవసాయంపై ప్రణాళిక, అవగాహన లేదని చంద్రబాబు మండిపడ్డారు.

'వస్తున్నా..మీకోసం' పాదయాత్రలో భాగంగా శనివారం ఉదయం ఇబ్రహింపట్నం మండలం నల్లకుంట నుంచి చంద్రబాబు నాయుడు యాత్రను ప్రారంభించారు. అక్కడ నిర్వహించిన రైతు సదస్సులో ఆయన మాట్లాడుతూ ఆదర్శ రైతులంతా కాంగ్రెస్ కార్యకర్తలే అని, వారంతా బెల్టు షాపుల్లో పనిచేస్తున్నారన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చామని, టీడీపీ హాయంలో రైతుల సంక్షేమానికి తీసుకున్న చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆయన పేర్కొన్నారు. జలయజ్ఞం ద్వారా లబ్ది చెందింది వైఎస్, కాంట్రాక్టర్లే అని ఆరోపించారు. తొమ్మిది ఏళ్లు అయినా పులిచింతలను పూర్తి చేయలేకపోయారని, పోలవరానికి కాల్వలు కట్టించలేకపోయారని ఎద్దేవా చేశారు. డెల్టా, సాగర్ కాల్వల ఆధునికీకరణలో అంతా అవినీతే అని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్ర శనివారం నాటికి 124వ రోజుకు చేరింది.

కాగా కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు నాయుడిని నందమూరి హీరో కళ్యాణ్ రామ్ శనివారం ఉదయం కలుసుకున్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నల్లకుంట శిబిరం వద్ద చంద్రబాబును కళ్యాణ్ రామ్ కలుసుకున్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు.

అలాగే చంద్రబాబును ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ కూడా కలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను రాజమండ్రి నుంచే పోటీ చేస్తానని మురళీమోహన్ చంద్రబాబుతో భేటీ తర్వాత మీడియాతో చెప్పారు. పోయిన చోటనే వెతుక్కుంటానని, ఓడిన చోటనే గెలవాలనేది తన ఉద్దేశమని ఆయన అన్నారు. ఒకే చోటి నుంచి పోటీ చేస్తానని, ఒకే పార్టీలో ఉంటానని ఆయన చెప్పారు.

చంద్రబాబు నాయుడు ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, కాలి నొప్పి ఉన్నా ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నారని మురళీమోహన్ అన్నారు. గాడి తప్పిన రైలును పట్టాలెక్కించి, పరుగులు పెట్టించాలని ప్రజలు చంద్రబాబు నుంచి కోరుకుంటున్నారని ఆయన అన్నారు

సొసైటీ ఎన్నికల గెలుపుపై బొత్స వ్యాఖ్యలు సిగ్గు చేటు

అవినీతిపై చంద్రబాబు 'విల్లు' ఎక్కుపెట్టారు. తల్లి, పిల్ల కాంగ్రెస్ పై శుక్రవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విశ్రాంతి అనంతరం తిరిగి పాదయాత్ర ప్రారంభించినప్పట్నుంచి చంద్రబాబు అవినీతినే ప్రధానంగా చేసుకుని మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఎవరికి ఇవ్వని విధంగా తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశాన్ని ప్రజలు కల్పించారన్నారు. తన రికార్డును బద్దలు కొట్టడానికి వేరేవ్వరికైనా రెండు దశాబ్దాలు పడుతుందన్నారు. తనకు అధికారంపై వ్యామోహం లేదన్నారు. జిల్లాలో అడుగుపెట్టిన మొదట్లో కాంగ్రెస్ పార్టీ అసమర్థత గురించి ఎక్కువగా మాట్లాడిన బాబు. తర్వాత వైఎస్సార్ అవినీతిపాలనతో పాటు నేరుగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అవినీతిపై విరుచుకుపడుతున్నారు. విద్యార్థులను ఆకర్షించేదుకు బాబు దృక్ఫథం వేరుగా ఉంది.

విద్యార్థులకు ఎలా చెపితే నాటుకుంటుందో అదే తరహాలో ప్రసంగిస్తున్నారు. యువతను అవినీతిపై పోరాడేలా వారిలో ఆలోచనలను రేకెత్తిస్తున్నారు. అందుకు వారిని నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. మొన్నటి వరకు తమ్ముళ్ళూ..మీ సెల్‌ఫోన్ల నుంచి అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని నడపండంటూ పిలుపునిచ్చిన అధినేత తాజాగా యువతకు ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల ద్వారా అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలని పిలుపునిస్తున్నారు. భూగర్భ కనిజ సంపదను మొదలుకుని, భూ కేటాయింపులు, ప్రాజెక్ట్‌లు, కాంట్రాక్ట్ వర్క్‌లు, ప్రభుత్వ సంక్షేమ పథకాల వరకు తొమ్మిదేళ్ల కాలంలో వైఎస్ హయాంలోనూ, ఇప్పుడు కిరణ్ కుమార్‌రెడ్డి పాలనలో జరుగుతున్న అక్రమాలను చంద్రబాబు తూర్పారబడుతున్నారు. రూ.లక్ష కోట్లు సంపాదించిన జగన్ కొన్నిసీట్లులో గెలిపించినా రాష్ట్రం ఏమైపోతుందో ఆలోచించండంటూ చైతన్య తీసుకువస్తున్నారు.

అవినీతిపై బాబు విల్లు

యువత రాజకీయాల్లోకి వస్తే అవినీతి ప్రక్షాళన జరుగుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా, రష్యా, జపాన్ వంటి దేశాల కంటే మన దేశంలో అపారమైన యువశక్తి ఉందన్నారు. వారిని విద్యావంతులుగా చేయగలిగితే ప్రపంచాన్ని శాసించే స్ధాయికి మన దేశం ఎదుగుతుందన్నారు. పాదయాత్రలో భాగం గా శుక్రవారం మైలవరం నియోజకవర్గం జూపూడిలోని నిమ్రా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. దేశంలోని నాయకులకు దూరదృష్టి కరువైందన్నారు. సాంకేతిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని తాను అధికారంలో ఉండగా రాష్ట్రంలో అప్పటికే 32 ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా వాటిని 350 వరకూ పెంచానని చంద్రబాబు గుర్తు చేశారు.

రాష్ట్రం నుంచి ఉపాధి, విద్యావసరాల కోసం యువత మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలకు వలస వెళుతుండడం చూసి తాను ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఏలూరు, రాజమండ్రి ప్రాంతాల్లో వైద్య కళాశాలలు. ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఓ ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశామన్నారు. ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసిన రెండో ఏడాదే వాటిల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించేలా చర్యలు తీసుకుని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కృషి చేసినట్టు చంద్రబాబు తెలిపారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాజ్‌పేయ్‌తో మాట్లాడి ఐటీ రంగానికి జవజీవాలు కల్పించానన్నారు. బిల్‌గేట్స్, బిల్‌క్లింటన్ వంటి వారు మన రాష్ట్ర ప్రగతిని ప్రశంసించిన సంగతిని చంద్రబాబు వివరించారు. 'మీ కోసం మీరు- జన్మభూమి కోసం అందరం కలసి నడుద్దాం రండి' అని విద్యార్థులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

ముఖాముఖి ఇలా.. గీత: సార్! మీరు ఈ రాష్ట్రానికి తొమ్మిదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఐటీని బాగా అభివృద్ధి చేశారు. బిల్‌గేట్స్, బిల్‌క్లింటన్ వంటి వారిని మన రాష్ట్రానికి తీసుకువచ్చారు. తెలంగాణను ఎలా సమర్థించారు. చంద్రబాబు: అప్పట్లో బీఎస్ఎన్ఎల్, వీఎస్ఎన్ఎల్ ఏకచత్రాధిపత్యం ఉండేది. డీ రెగ్యులైజేషన్ అండ్ కమ్యూనికేషన్ విధానాన్ని అమ లు పరిచి విజయం సాధించా. ఫోన్‌ల కనెక్టివిటీ పెంచా. అప్పట్లో విజయవాడ, వరంగల్, తిరుపతి వంటి నగరాలకు కూడా కనక్టివిటీ ఉండేది కాదు.

ఆ పరిస్థితుల్లో మార్పు తీసుకువచ్చా.జయశ్రీ: మేము.. మిమ్ముల్ని ఎన్నికల్లో గెలిపిస్తాం. ఉద్యోగాలు ఇస్తామని మీరు భరోసా ఇవ్వగలరా? చంద్రబాబు: తప్పకుండా. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను 80 శాతం వరకూ పెంచుతా. లేకుంటే అవి వచ్చేవరకు ఉద్యోగ భృతి కల్పిస్తా. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే రాష్ట్రంలో పాలన గాడిలో పెడతా. నూర్‌జాన్‌బాషా: కొంత మంది, కొన్ని కళాశాలల్లో విద్యాప్రమాణాలు మరీ దారుణంగా ఉంటున్నాయి. చంద్రబాబు: యధారాజా.. తథా ప్రజ అన్నట్లుగా ఉంది పరిస్థితి. దానిని పూర్తిగా మారుస్తా. అందుకు ఆరు నెలల సమయం చాలు. మరో విద్యార్థి : సార్.. జగన్ చేసిన అవినీతి విషయాలను పేస్‌బుక్ ద్వారా స్నేహితులందరికీ వివరిస్తున్నా.

ఈ విషయం తెలిసి వైసీపీకి చెందిన కొందరు నాపై దాడికి యత్నించారు. బెదిరిస్తున్నారు. చంద్రబాబు: చూడు తమ్ముడూ.. అధర్మానికి తాత్కాలికంగా కొంత కాలం బలముంటుంది. నేను ధర్మయుద్ధం చేస్తున్నాను. రోడ్డెక్కి పాదయాత్ర చేస్తున్నాను. నీకేం భయం లేదు. ముందుగా ఫిర్యాదు చేయ్. ఎవరూ ధర్మాన్ని నాశనం చేయలేరు. నీకు నా అండదండలు ఉంటాయి. నీ ప్రాణానికేమీ భయం లేదు. అవసరమనుకుంటే నాకు ఫోన్ చేయ్. నాతో టచ్‌లో ఉండు.

యువత రాజకీయాల్లోకి వస్తే..అవినీతి అంతం

తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉన్నప్పుడే విజయవాడ ధర్మల్ పవర్ స్టేషన్ ప్రతి ఏటా విద్యుత్ ఉత్పాదనలో జాతీయ అవార్డు సాధించిందని చంద్రబాబు అన్నారు. పాదయాత్రలో భాగంగా శుక్రవారం మైలవరం నియోజకవర్గం కిలేశపురం గ్రామ కూడలిలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు పలు అంశాలపై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ ఉత్పత్తి 80 శాతానికి పడిపోయిందన్నారు. నాసిరకం బొగ్గును వినియోగించడమే అందుకు కారణం. రాష్ట్రంలో విద్యుత్ శాఖకు మంత్రే లేడు. పరిపాలన మొత్తం గాడి తప్పింది. 2004లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వర్షాభావ పరిస్ధితులు, సమృద్ధిగా నీరు లేకపోయినా మిగులు విద్యుత్ సాధించామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం లేకుండా చూడడంతో పాటు విద్యుత్ చార్జీలను ఏమాత్రం పెంచలేదని ప్రజలకు వివరించారు.

తన హయాంలో సర్‌చార్జ్ అంటే ఏమిటో కూడా ప్రజలకు తెలియదన్నారు. అలాంటి పరిస్థితుల్లో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ ఇప్పటికే రెండు సార్లు విద్యుత్ సర్‌చార్జ్‌ల భారాన్ని ప్రజలపై మోపిందన్నారు. త్వరలో మూడో విడత భారం వేసేందుకు కూడా సిద్ధమవుతోందన్నారు. రెండు బల్బులు ఉన్న పేదల ఇంటికి నెలకు వెయ్యి రూపాయల బిల్లు వస్తుంటే ఎలా కట్టగలరని చంద్రబాబు ప్రశ్నించారు.జాతీయ రహదారి పక్కనే ఉన్న కిలేశపురం వాసులకు అన్నీ కష్టాలేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను అధికారంలోకి రాగానే తీరుస్తానని హామీ ఇచ్చారు. రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితి, ఆరాచక, అన్యాయాలు పెరిగిపోయి ప్రజలకు సరైన న్యాయం కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు.

పేద వర్గాల్లో ఇబ్బందులు బాగా పెరిగిపోయాయని చంద్రబాబు అన్నారు. వంటగ్యాస్ సిలెండర్‌పై ఇచ్చే రాయితీకి కూడా ఆధార్‌తో ముడిపెట్టడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. ఇలాంటి పనికిమాలిన ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీడీపీ హయాంలో మత్స్యకారులకు సైకిళ్ళు, ఐస్‌బాక్సులు, వలలు, కోల్డ్‌స్టోరేజీలు నిర్మించడంతో పాటు వారి వృత్తికి కావలసిన సౌకర్యాల మెరుగుకు ఎన్నో చర్యలు తీసుకుందన్నారు.వర్గీకరణకు కట్టుబడి ఉన్నా

తెలుగుదేశం పార్టీ మాదిగల వర్గీకరణకు కట్టుబడి ఉందన్నారు. టీడీప హయాంలో కేవలం నాలుగున్నర ఏళ్ళలో మాదిగలు, ఇతర ఉప కులాల వారికి 24,500 ఉద్యోగాలు కల్పిస్తే, కాంగ్రెస్ పార్టీ హయాంలో 16 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయిందని ఎద్దేవా చేశారు. తాను తిరిగి అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ చేస్తామని, బెల్ట్ దుకాణాలను తొలగిస్తామన్నారు. నిత్యావసర వస్తువులకు నగదుబదిలీ పథకాన్ని అంగీకరించవద్దని దీనివల్ల రాబోయే రోజుల్లో వీటిపైనా ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందని చంద్రబాబు ప్రజలను వివరించారు. టీడీపీ ప్రవేశపెట్టాలనుకున్న నగదు బదిలీ పథకం రూపు రేఖలే వేరని చంద్రబాబు అన్నారు.

టీడీపీ హయాంలోనే ఎన్టీటీపీఎస్‌కు మహర్దశ

 పార్టీ జెండా అంటే ఆయనకు ప్రాణం. నాయకుడి మాట శిరోధార్యం. బాస్ చెప్పిన అభిప్రాయం నచ్చినా నచ్చకపోయినా బాస్ ఈజ్ ఆల్‌వేస్ రైట్ అనుకుని కామ్ అయిపోతారు. పార్టీలో ఏ పని అప్పగిస్తే ఆ పనికి నూరుశాతం న్యాయం చేసేందుకు ఆరాటపడతారు. తెలుగుదేశం ఆవిర్భావం నాటి నుంచి ఆయన పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీలోకి ఇలా వచ్చి అలా ఎమ్మెల్యేలు అయిపోయిన వారు ఉన్నారు, ఎంపీలు అయినవారూ ఉన్నారు. మంత్రులుగా కూడా పనిచేసి ఇతర పార్టీలలోకి వెళ్లి తమను పైకి తేచ్చిన నేతనే తిట్టిపోసే వారు కూడా చాలా మంది ఉన్నారు. ముప్పై ఏళ్లుగా పార్టీలో ఉండి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నా ఆయన మాత్రం సింపుల్‌గా ఉంటారు. అధికార పదవులేమి అనుభవించలేదు. అయినా ఆయనలో అసంతృప్తి కన్పించదు.

పార్టీలో ఎన్ని పనులు చేస్తున్నా, ఎప్పుడూ తెరమీదకు రారు. పబ్లిసిటీకి ఆమడ దూరంగా ఉంటారు. పదవుల కోసం ఆశపడే తత్వం కూడా కాదు. ఆయన కావాలనుకుంటే ఏదో ఒక పార్టీలో చేరి డబ్బుతో రాజ్యసభ సభ్యత్వం పొందగల స్థోమత కూడా ఉంది. అయినా ఆయన అధినేత గీచిన గీతదాటరు. నాకు ఇది కావాలని ఎవరిని అడగరు. అలగడాలు, బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్‌లు చేయరు. ఏం ఆశించకుండా, ఏ స్వార్థం లేకు ండా పార్టీలో తిరగడానికి కార ణం ఒకటుంది. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలన్నది ఆయన కోరిక. 2004లో టీడీపీ ఓడిపోయి చంద్రబాబు గవర్నర్‌కు రాజీనామా సమర్పించి ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో చంద్రబాబుతో మళ్ళీ మిమ్మల్ని అరగంట క్రితం ఎలా ఉన్నారో (సీఎం) అలా చూసే వరకు మీ వెంటే ఉంటాను అని చేసిన వాగ్దానాన్ని ఆయన మరిచిపోలేదు.

ఆ లక్ష్యం కోసమే ఇల్లువాకిలి వదిలి 122 రోజులుగా చంద్రబాబుతోపాటు పాదయాత్రలో తిరుగుతున్నారు. పాదయాత్ర ఇన్‌చార్జిగా వ్యవహరిస్తూ అన్నీ తానై చూసుకుంటారు. వయసులో ఏమైనా చిన్నవారా అంటే ఇంచుమించు చంద్రబాబు వయసే ఆయనది. ఆయనకు వేరే పనేమీ లేదా అంటే రాష్ట్రంలోని అత్యంత సంపన్నులలో ఆయన పేరు కూడా ఉంటుంది. అనేక పరిశ్రమలకు ఆయన అధిపతి. అవన్నీ కుటుంబీలకు అప్పగించి తానుమాత్రం బాబు వెంట తిరుగుతున్నారు. ఈ రోజులలో ఇంత విధేయత ఉన్న నాయకుడు ఎవరా అని అనుకుంటున్నారా... ఆయనే గరికపాటి మోహనరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

పదవులు చాలా మందికి ఉంటా యి. కాని పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే వారు అరుదుగా ఉంటారు. అటువంటి కోవలో మొదట కనిపించే వ్యక్తి గరికపాటి. పార్టీలో జూనియర్ల నుంచి సీనియర్ల వరకు గరికపాటి అంటే తెలియని వారు ఉండరు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులలో గరికపాటి కూడా ఒకరు అయినప్పటికీ ఆయనలో ఎక్కడా ఆ ఛాయలే కన్పించవు. చిన్నవారితో, పెద్దవారితో అందరితో ఇట్టే కలసిపోతారు. బాబు పాదయాత్ర 122 రోజులుగా ప్రశాంతంగా, ఇబ్బందులు లేకుండా ఒక ప్రణాళిక ప్రకారం నడవడానికి కారణమైన వ్యక్తులలో గరికపాటి కృషి చాలా ఉంది. చంద్రబాబు పాదయాత్ర జరిగే ప్రాంతాల్లో ఎక్కడికక్కడ టీమ్ మొత్తం బస చేస్తుంది. ఆ క్యాంపు నిర్వహణ మొత్తం గరికపాటి చూసుకుంటారు.

అక్కడే చంద్రబాబు ఒక బస్సులో నిద్రిస్తే, ఆ పక్కనే మరో బస్సులో గరికపాటి నివాసం ఉంటుంది. బాబు ఉదయం రెడీ అయ్యేసరికి గరికపాటి సిద్ధంగా ఉంటారు. ఈలోగా చంద్రబాబు గరికపాటికి రాష్ట్ర పార్టీ నేతలతో మాట్లాడాల్సిన పనులు కూడా చెబుతుంటారు. వారితో మాట్లాడి తిరిగి ఆ వివరాలను బాబుకు చెబుతారు. జిల్లాలలో ఎక్కడైనా వివాదాలు తలెత్తితే చంద్రబాబుకు గుర్తొచ్చే వ్యక్తులలో గరికపాటి ఒకరు. వై.ఎస్. ముఖ్యమంత్రి అయిన తరువాత చంద్రబాబుకు సన్నిహితులైన వారిలో చాలామందిని ఏదో ఒక ఎరవేసి తమ వైపునకు తిప్పుకోగలిగారు. కాని గరికపాటి మాత్రం దొరకలేదు.

కోట్లాది రూపాయిల వ్యాపారాలు ఉన్న గరికపాటికి వై.ఎస్. అనేక ఆఫర్‌లు ఇచ్చారు. ఆయన లొంగలేదు. దీంతో వేధింపులు మొదలై చివరికి తప్పుడు కేసులలో అరెస్టు చేయించే ప్రయత్నాలు కూడా జరిగాయి. అయినా గరికపాటి తనకు నచ్చిన పంధా వీడలేదు. తాను నమ్మిన పార్టీని, తనను నమ్మే నేతను వీడలేదు. ఈ రోజులలో కూడా ఇలాంటివారు ఉంటారా అని ఆశ్చర్యమేస్తోంది కదా.. కాని ఉన్నారు. నాలుగు రోజులు పాదయాత్రలో నడిస్తే నాకేమిటి అని ఆలోచించే నాయకులకు ఇలాంటి నేతలు స్ఫూర్తిదాయకం అవుతారని ఆశిద్దాం.

అధినేత వెన్నంటి...


 'సెక్రటేరియేట్‌కు వెళ్ళకుండానే వైఎస్ జగన్ లక్ష కోట్ల రూపాయలను సంపాదించాడు. మీరు కనుక ఆయనపై సానుభూతి చూపి ఓటేస్తే రాష్ట్రాన్ని సమూలంగా దోచేస్తాడు'' అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలకు హితబోధ చేశారు. ''వస్తున్నా మీ కోసం'' పాదయాత్ర సందర్భంగా శుక్రవారం రాత్రి ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సభకు అధిక సంఖ్యలో జనం తరలివచ్చారు. జనసమూహాన్ని చూసి చంద్రబాబు కూడా ఉత్తేజపూరితంగా ప్రసంగించారు. వైఎస్‌తో పాటు ఆయన తనయుడు జగన్ చేసిన అవినీతిని ప్రజలకు అర్ధమయ్యేరీతిలో వివరించారు. అవినీతి పరులు ఎక్కువైరాష్ట్రాన్ని రాబందుల్లా పీక్కుతింటున్నారని ఆరోపించారు. జనం చేత మద్యం తాగించే ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వమేనా? అంటూ ప్రశ్నించారు.

రాష్ట్రంలో పరిపాలన లేదన్నారు. మంచినీరు కూడా కొనుక్కునే పరిస్ధితి దాపురించిందంటే పరిస్ధితి ఎంత దారుణంగా తయారైందో అర్ధమవుతుందని చంద్రబాబు తీవ్రంగా విమర్వించారు. ప్రజలు పడుతున్న కష్టాలు చూసి తాను పాదయాత్ర చేపట్టానని ఆయన చెప్పారు. ఇది నిస్వార్ధంతో చేస్తున్న పాదయాత్ర అని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో రాస్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి చాలా బాగుండేదని, ఇప్పుడా పరిస్ధితి లేదని, ఆడపిల్లల పరిస్థితి చూస్తుంటే మనసులో బాధ కలుగుతోందన్నారు.వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదేళ్ళ మూడు నెలల పదవీ కాలంలో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆయన అన్నారు.

మైనింగ్ మాఫియా వల్ల ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతోందని తాను సోనియాగాంధీకి చెప్పినా ఆమె వినలేదని చంద్రబాబు చెప్పారు. బయ్యారంలో 1.46 లక్షల ఎకరాల విస్తీర్ణం గల గనులను వైఎస్ తన అల్లుడికి వరకట్నంగా ఇచ్చారని ఆయన ఆరోపించారు. వైఎస్సార్‌సీపీలో చేరే వారంతా ముందుగా జైలుకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఆ తరువాత పార్టీలో చేరాలని ఎద్దేవా చేశారు. యువత భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని పెద్దలంతా వైఎస్ఆర్‌సీపీకి దూరంగా ఉండాలని కోరారు.ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి విలువలు లేని వ్యక్తిఅని ఆయన సోదరులు ఇద్దరు హైదరాబాద్, చిత్తూరులను దోచుకుంటున్నారని ఆరోపించారు. కిరణ్ సహకార వ్యవస్ధను పూర్తిగా భ్రస్టు పట్టించారని అన్నారు. తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఉన్న చోట స్టేలు తెచ్చుకుని పబ్బం గడుపుకున్నారని విమర్శించారు.

జగన్‌కు ఓటేస్తే రాష్ట్రాన్ని దోచేస్తాడు