February 2, 2013

టీడీపీ హయాంలోనే ఎన్టీటీపీఎస్‌కు మహర్దశ

తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉన్నప్పుడే విజయవాడ ధర్మల్ పవర్ స్టేషన్ ప్రతి ఏటా విద్యుత్ ఉత్పాదనలో జాతీయ అవార్డు సాధించిందని చంద్రబాబు అన్నారు. పాదయాత్రలో భాగంగా శుక్రవారం మైలవరం నియోజకవర్గం కిలేశపురం గ్రామ కూడలిలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు పలు అంశాలపై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ ఉత్పత్తి 80 శాతానికి పడిపోయిందన్నారు. నాసిరకం బొగ్గును వినియోగించడమే అందుకు కారణం. రాష్ట్రంలో విద్యుత్ శాఖకు మంత్రే లేడు. పరిపాలన మొత్తం గాడి తప్పింది. 2004లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వర్షాభావ పరిస్ధితులు, సమృద్ధిగా నీరు లేకపోయినా మిగులు విద్యుత్ సాధించామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం లేకుండా చూడడంతో పాటు విద్యుత్ చార్జీలను ఏమాత్రం పెంచలేదని ప్రజలకు వివరించారు.

తన హయాంలో సర్‌చార్జ్ అంటే ఏమిటో కూడా ప్రజలకు తెలియదన్నారు. అలాంటి పరిస్థితుల్లో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ ఇప్పటికే రెండు సార్లు విద్యుత్ సర్‌చార్జ్‌ల భారాన్ని ప్రజలపై మోపిందన్నారు. త్వరలో మూడో విడత భారం వేసేందుకు కూడా సిద్ధమవుతోందన్నారు. రెండు బల్బులు ఉన్న పేదల ఇంటికి నెలకు వెయ్యి రూపాయల బిల్లు వస్తుంటే ఎలా కట్టగలరని చంద్రబాబు ప్రశ్నించారు.జాతీయ రహదారి పక్కనే ఉన్న కిలేశపురం వాసులకు అన్నీ కష్టాలేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను అధికారంలోకి రాగానే తీరుస్తానని హామీ ఇచ్చారు. రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితి, ఆరాచక, అన్యాయాలు పెరిగిపోయి ప్రజలకు సరైన న్యాయం కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు.

పేద వర్గాల్లో ఇబ్బందులు బాగా పెరిగిపోయాయని చంద్రబాబు అన్నారు. వంటగ్యాస్ సిలెండర్‌పై ఇచ్చే రాయితీకి కూడా ఆధార్‌తో ముడిపెట్టడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. ఇలాంటి పనికిమాలిన ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీడీపీ హయాంలో మత్స్యకారులకు సైకిళ్ళు, ఐస్‌బాక్సులు, వలలు, కోల్డ్‌స్టోరేజీలు నిర్మించడంతో పాటు వారి వృత్తికి కావలసిన సౌకర్యాల మెరుగుకు ఎన్నో చర్యలు తీసుకుందన్నారు.వర్గీకరణకు కట్టుబడి ఉన్నా

తెలుగుదేశం పార్టీ మాదిగల వర్గీకరణకు కట్టుబడి ఉందన్నారు. టీడీప హయాంలో కేవలం నాలుగున్నర ఏళ్ళలో మాదిగలు, ఇతర ఉప కులాల వారికి 24,500 ఉద్యోగాలు కల్పిస్తే, కాంగ్రెస్ పార్టీ హయాంలో 16 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయిందని ఎద్దేవా చేశారు. తాను తిరిగి అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ చేస్తామని, బెల్ట్ దుకాణాలను తొలగిస్తామన్నారు. నిత్యావసర వస్తువులకు నగదుబదిలీ పథకాన్ని అంగీకరించవద్దని దీనివల్ల రాబోయే రోజుల్లో వీటిపైనా ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందని చంద్రబాబు ప్రజలను వివరించారు. టీడీపీ ప్రవేశపెట్టాలనుకున్న నగదు బదిలీ పథకం రూపు రేఖలే వేరని చంద్రబాబు అన్నారు.