February 2, 2013

సొసైటీ ఎన్నికల గెలుపుపై బొత్స వ్యాఖ్యలు సిగ్గు చేటు

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చింది టీడీపీయే
జలయజ్ఞం ద్వారా లబ్ది పొందింది వైఎస్, కాంట్రాక్టర్లే : చంద్రబాబు

సొసైటీ ఎన్నికల్లో రైతులు కాంగ్రెస్‌కే మద్దతు ఇచ్చారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పుకోవడం సిగ్గు చేటని టీడీపీ అధినేత చంద్ర బాబునాయుడు దుయ్యబట్టారు. ఓటును కొనుగోలు చేసి, ప్రత్యర్థులను తీసేసి సహకార ఎన్నికల్లో గెలవడం గొప్పకాదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి వ్యవసాయంపై ప్రణాళిక, అవగాహన లేదని చంద్రబాబు మండిపడ్డారు.

'వస్తున్నా..మీకోసం' పాదయాత్రలో భాగంగా శనివారం ఉదయం ఇబ్రహింపట్నం మండలం నల్లకుంట నుంచి చంద్రబాబు నాయుడు యాత్రను ప్రారంభించారు. అక్కడ నిర్వహించిన రైతు సదస్సులో ఆయన మాట్లాడుతూ ఆదర్శ రైతులంతా కాంగ్రెస్ కార్యకర్తలే అని, వారంతా బెల్టు షాపుల్లో పనిచేస్తున్నారన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చామని, టీడీపీ హాయంలో రైతుల సంక్షేమానికి తీసుకున్న చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆయన పేర్కొన్నారు. జలయజ్ఞం ద్వారా లబ్ది చెందింది వైఎస్, కాంట్రాక్టర్లే అని ఆరోపించారు. తొమ్మిది ఏళ్లు అయినా పులిచింతలను పూర్తి చేయలేకపోయారని, పోలవరానికి కాల్వలు కట్టించలేకపోయారని ఎద్దేవా చేశారు. డెల్టా, సాగర్ కాల్వల ఆధునికీకరణలో అంతా అవినీతే అని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్ర శనివారం నాటికి 124వ రోజుకు చేరింది.

కాగా కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు నాయుడిని నందమూరి హీరో కళ్యాణ్ రామ్ శనివారం ఉదయం కలుసుకున్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నల్లకుంట శిబిరం వద్ద చంద్రబాబును కళ్యాణ్ రామ్ కలుసుకున్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు.

అలాగే చంద్రబాబును ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ కూడా కలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను రాజమండ్రి నుంచే పోటీ చేస్తానని మురళీమోహన్ చంద్రబాబుతో భేటీ తర్వాత మీడియాతో చెప్పారు. పోయిన చోటనే వెతుక్కుంటానని, ఓడిన చోటనే గెలవాలనేది తన ఉద్దేశమని ఆయన అన్నారు. ఒకే చోటి నుంచి పోటీ చేస్తానని, ఒకే పార్టీలో ఉంటానని ఆయన చెప్పారు.

చంద్రబాబు నాయుడు ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, కాలి నొప్పి ఉన్నా ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నారని మురళీమోహన్ అన్నారు. గాడి తప్పిన రైలును పట్టాలెక్కించి, పరుగులు పెట్టించాలని ప్రజలు చంద్రబాబు నుంచి కోరుకుంటున్నారని ఆయన అన్నారు