February 2, 2013

యువత రాజకీయాల్లోకి వస్తే..అవినీతి అంతం

యువత రాజకీయాల్లోకి వస్తే అవినీతి ప్రక్షాళన జరుగుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా, రష్యా, జపాన్ వంటి దేశాల కంటే మన దేశంలో అపారమైన యువశక్తి ఉందన్నారు. వారిని విద్యావంతులుగా చేయగలిగితే ప్రపంచాన్ని శాసించే స్ధాయికి మన దేశం ఎదుగుతుందన్నారు. పాదయాత్రలో భాగం గా శుక్రవారం మైలవరం నియోజకవర్గం జూపూడిలోని నిమ్రా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. దేశంలోని నాయకులకు దూరదృష్టి కరువైందన్నారు. సాంకేతిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని తాను అధికారంలో ఉండగా రాష్ట్రంలో అప్పటికే 32 ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా వాటిని 350 వరకూ పెంచానని చంద్రబాబు గుర్తు చేశారు.

రాష్ట్రం నుంచి ఉపాధి, విద్యావసరాల కోసం యువత మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలకు వలస వెళుతుండడం చూసి తాను ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఏలూరు, రాజమండ్రి ప్రాంతాల్లో వైద్య కళాశాలలు. ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఓ ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశామన్నారు. ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసిన రెండో ఏడాదే వాటిల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించేలా చర్యలు తీసుకుని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కృషి చేసినట్టు చంద్రబాబు తెలిపారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాజ్‌పేయ్‌తో మాట్లాడి ఐటీ రంగానికి జవజీవాలు కల్పించానన్నారు. బిల్‌గేట్స్, బిల్‌క్లింటన్ వంటి వారు మన రాష్ట్ర ప్రగతిని ప్రశంసించిన సంగతిని చంద్రబాబు వివరించారు. 'మీ కోసం మీరు- జన్మభూమి కోసం అందరం కలసి నడుద్దాం రండి' అని విద్యార్థులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

ముఖాముఖి ఇలా.. గీత: సార్! మీరు ఈ రాష్ట్రానికి తొమ్మిదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఐటీని బాగా అభివృద్ధి చేశారు. బిల్‌గేట్స్, బిల్‌క్లింటన్ వంటి వారిని మన రాష్ట్రానికి తీసుకువచ్చారు. తెలంగాణను ఎలా సమర్థించారు. చంద్రబాబు: అప్పట్లో బీఎస్ఎన్ఎల్, వీఎస్ఎన్ఎల్ ఏకచత్రాధిపత్యం ఉండేది. డీ రెగ్యులైజేషన్ అండ్ కమ్యూనికేషన్ విధానాన్ని అమ లు పరిచి విజయం సాధించా. ఫోన్‌ల కనెక్టివిటీ పెంచా. అప్పట్లో విజయవాడ, వరంగల్, తిరుపతి వంటి నగరాలకు కూడా కనక్టివిటీ ఉండేది కాదు.

ఆ పరిస్థితుల్లో మార్పు తీసుకువచ్చా.జయశ్రీ: మేము.. మిమ్ముల్ని ఎన్నికల్లో గెలిపిస్తాం. ఉద్యోగాలు ఇస్తామని మీరు భరోసా ఇవ్వగలరా? చంద్రబాబు: తప్పకుండా. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను 80 శాతం వరకూ పెంచుతా. లేకుంటే అవి వచ్చేవరకు ఉద్యోగ భృతి కల్పిస్తా. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే రాష్ట్రంలో పాలన గాడిలో పెడతా. నూర్‌జాన్‌బాషా: కొంత మంది, కొన్ని కళాశాలల్లో విద్యాప్రమాణాలు మరీ దారుణంగా ఉంటున్నాయి. చంద్రబాబు: యధారాజా.. తథా ప్రజ అన్నట్లుగా ఉంది పరిస్థితి. దానిని పూర్తిగా మారుస్తా. అందుకు ఆరు నెలల సమయం చాలు. మరో విద్యార్థి : సార్.. జగన్ చేసిన అవినీతి విషయాలను పేస్‌బుక్ ద్వారా స్నేహితులందరికీ వివరిస్తున్నా.

ఈ విషయం తెలిసి వైసీపీకి చెందిన కొందరు నాపై దాడికి యత్నించారు. బెదిరిస్తున్నారు. చంద్రబాబు: చూడు తమ్ముడూ.. అధర్మానికి తాత్కాలికంగా కొంత కాలం బలముంటుంది. నేను ధర్మయుద్ధం చేస్తున్నాను. రోడ్డెక్కి పాదయాత్ర చేస్తున్నాను. నీకేం భయం లేదు. ముందుగా ఫిర్యాదు చేయ్. ఎవరూ ధర్మాన్ని నాశనం చేయలేరు. నీకు నా అండదండలు ఉంటాయి. నీ ప్రాణానికేమీ భయం లేదు. అవసరమనుకుంటే నాకు ఫోన్ చేయ్. నాతో టచ్‌లో ఉండు.