July 17, 2013

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం తలుపులు బార్లా తెరవడంపై తెలుగుదేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. కీలక రంగాల్లోకి ఎఫ్‌డీఐలు సరికాదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. బీమా, రక్షణతో పాటు మరో 12 రంగాల్లో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు లను ఆహ్వానించడం దేశ సమగ్రతేక చేటని తెలిపారు. బుధవారం యనమల పార్టీ కార్యాల యంలో విలేకరులతో మాట్లాడారు. కీలక రంగాల్లో వంద శాతం ఎఫ్‌డీఐలకు అనుమతిం చడం సరైంది కాదని, యూపీఏ ప్రభుత్వ అసమర్థ విధానాలకు ఈ నిర్ణయం పరాకాష్ట అని మండిపడ్డారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా తొమ్మిది శాతం విద్యుత్ లోటు, ఆర్థిక మాంద్యం, అధిక వడ్డీ రేట్ల కారణంగా కుదులయిన భారత పారిశ్రామిక రంగంపై కేంద్ర తాజా నిర్ణయం గోరుచుట్టు విూద రోకలిపోటు లాంటిదేననని ధ్వజమెత్తారు. విదేశీ పెట్టుబడులపై ఎందుకంతా ఆసక్తి? అని ప్రశ్నించారు. విదేశీ పెట్టుబడిదారులకు ఇచ్చే ప్రోత్సాహకాలేవో స్వదేశీ పెట్టుబడిదారులకు ఇచ్చేలా ప్రధాని మన్మోహన్‌సింగ్ బృందం చొరవచూపాలని డిమాండ్ చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగుతున్న తరుణంలో దిక్కుతోచని స్థితిలో పడిన కేంద్ర ప్రభుత్వం.. మంగళవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. సంస్కరణల పేరుతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచింది. కీలకమైన పన్నెండు రంగాల్లో వంద శాతం ఎఫ్‌డీఐలకు అనుమతిస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. రక్షణ, టెలికం, పౌరవిమానయాన, బీమా, పెట్రోలియం, విద్యుత్ వంటి ముఖ్యమైన రంగాలలో 49 శాతంగా ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని ఎత్తేసింది. అయితే, ఈ నిర్ణయం వల్ల దేశ సమగ్రత దెబ్బతింటుందని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రక్షణ, విద్యుత్, బీమా వంటి కీలక రంగాల్లో 100 శాతం ఎఫ్‌డీఐలకు ఆమోదం తెలపడాన్ని తపబట్టాయి. ఆర్థిక వ్యవస్థ దిగజారుతుంటే చేతులు ముడుచుకొని కూర్చున్న ప్రభుత్వం చివరకు ఎఫ్‌డీఐలకు బార్లా తెరిచిందని ఆగ్రహం వ్యక్తం చేశాయి.

కేంద్ర నిర్ణయం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేత యనమల రామకృష్ణుడు

మరో యాత్రకు చంద్రబాబు రెడీ ఈ సారి బస్సులో బాబు యాత్ర
ఆగస్టు నెలాఖరున బస్సుయాత్ర!
బాబుకు తోడుగా బాలయ్య
యువత టార్గెట్‌గా లోకేష్‌ సదస్సులు


ఎన్నికల వరకు ప్రజల్లోనే గడిపేందుకు టీడీపీ అధినేత సిద్ధమవుతున్నారు. గతంలో వస్తున్నా మీకోసం అంటూ పాదయాత్ర చేసిన బాబు, మరోసారి జనంలోకి వెళ్లేందుకు బస్సుయాత్రకు సిద్దమవుతున్నారు. ఆగస్టు నెలాఖరులో చంద్రబాబు బస్సుయాత్ర శ్రీకాకుళం లేదా విజయనగంరం జిల్లాలో ప్రారంభం కానున్నాట్లు సమాచారం. ఈసారి బాబుతోపాటు బాలయ్య, లోకేష్ కూడా యాత్రలో పాల్గొంటుండడంతో అందరి దృష్టీ ఇప్పుడు టీడీపీ అధినాయకత్వంపైనే ఉంది.

వస్తున్నా మీకోసం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మరో యాత్రకు రెడీ అవుతున్నారు. వస్తున్నా మీకోసం యాత్రలో కవర్‌ కాని ఆరు జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడపల్లో బాబు మొదట బస్సుయాత్ర చేయనున్నారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా టూర్ కొనసాగించాలని ప్రణాళిక సిద్దం చేసుకుంటున్నారు. పార్టీ వర్గాలు చెప్తున్నదాన్ని బట్టి.. హైదరాబాద్‌లో కూడా బస్సుయాత్ర ఉండొచ్చు. ఈ నెలలోనే బస్సుయాత్ర చేపట్టాలని భావించినా, పంచాయతీ ఎన్నికల కారణంగా, ఆగస్టు చివరి వారానికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు ప్రజల్లో ఉండే విధంగా చంద్రబాబు యాత్ర రోడ్‌ మ్యాప్ సిద్ధమవుతోంది.

అటు బావకు తోడుగా బావమరిది, హీరో బాలయ్య కూడా ఈసారి బస్సుయాత్రలో పాల్గొంటారని సమాచారం. ప్రస్తుం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తి కావడానికి మరో నాలుగు నెలలు పడుతుందని అంచనా. ఆ ప్రాజెక్ట్ అయిపోయిన వెంటనే బాలయ్య.. ప్రజాక్షేత్రంలోకి దిగుతారు. బాబుతో కలసి బస్సుయాత్ర చేస్తారు..

మరోవైపు యువత ఆదరణ పొందడమే లక్ష్యంగా నారా లోకేష్‌ కసరత్తు చేస్తున్నారు. తండ్రితో పాటు లోకేష్‌ కూడా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించే విధంగా ప్లాన్‌ సిద్ధమవుతోంది. ఐతే.. బస్సుయాత్ర కాకుండా.. యూనివర్సిటీలు, కాలేజీలలో సదస్సులు నిర్వహించడం వంటివి కార్యక్రమాలు చినబాబు కోసం డిజైన్ చేస్తున్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, లభించిన ఉద్యోగ అవకాశాలు, ఇతర సంక్షేమ పథకాలను యువతకు వివరించే విధంగా లోకష్‌ ఇప్పటికే ప్రణాళిక రూపొందించుకున్నారు. యూత్ టార్గెట్‌గా పాటలు కూడా తయారు చేయిస్తున్నట్లు తెలుస్తోంది..

చంద్రబాబు.. చినబాబు.. మధ్యలో బాలయ్య..