August 9, 2013

నాటకంలో భాగమే ఆంటోనీ కమిటీ సోమిరెడ్డి, యనమల
'సీమాంధ్రలో గత తొమ్మిది రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రజలు లేవనెత్తుతున్న అంశాలనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ఉండి ఆయన కూడా సామాన్యుని మాదిరి సమస్యలు ఏకరువు పెడితే వాటిని పరిష్కరించేదెవరు? ఆయన మాటలకు విలువేముంటుంది' అని తెదేపా పార్టీనేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. విభజన నిర్ణయం కాంగ్రెస్ పార్టీదే తప్ప ప్రభుత్వానిది కాదన్న ముఖ్యమంత్రి వాదన అసంబద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు.

'ఈ నిర్ణయం తీసుకొన్న కాంగ్రెస్ కమిటీలో యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా,ప్రధాని మన్మోహన్ సింగ్, హోం మంత్రి షిండే, ఆరిక మంత్రి చిదంబరం వంటివారు ఉన్నారు. దేశాన్ని పాలించేది కాంగ్రెస్ పార్టీనా...వేరే పార్టీనా?' అని ప్రశ్నించారు. గత పదిహేను రోజులుగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తాము మాట్లాడుతున్న విషయాలనే ముఖ్యమంత్రి కూడా మాట్లాడారని, వాటిపై స్పష్టత కావాలని తమ పార్టీ డిమాండ్ చేస్తున్నామని, అవి తేలిన తర్వాతే పార్లమెంటులో బిల్లు పెట్టాలన్నది తమ డిమాండ్ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకంలో మరో భాగమే ఆంటోనీ కమిటీ అని తెదేపా సీమాంధ్ర నేత, శాసనమండలి పక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎనిమిదిన్నర కోట్ల ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశంపై కాంగ్రెస్ ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. సొంత రాష్ట్రాల ప్రయోజనాల కోసం చిదంబరం, వీరప్ప మొయిలీ తెలుగుజాతిని ముక్కలు చేశారు. వారినే మళ్లీ ఆంటోనీ కమిటీలో సభ్యులుగా వేశారు. దీనిని బట్టే ఈ కమిటీ నిజ స్వరూపం తెలుస్తోంది' అని విమర్శించారు.

ముఖ్యమంత్రే సమస్యలు చెబితే పరిష్కరించేదెవరు?


హైదరాబాద్ : తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ఆటలాడుతోందని టీ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. ఇవాళ ఎన్టీఆర్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తొమ్మిదేళ్లుగా తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఓ వైపు ఉద్యమాన్ని ప్రోత్సహిస్తూ, ఓ వైపు అణగదొక్కారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నియమించిన హైలెవల్ కమిటీ ఎవరి కోసం అని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెడుతామని ఇంత వరకు ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నించారు. తెలంగాణను అడ్డుకోవాలని కేంద్రం యత్నిస్తుందని, అందులో భాగంగానే కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించారని ఎర్రబెల్లి చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి చంద్రబాబు చాలా కృషి చేశారని కొనియాడారు. హైదరాబాద్ చుట్టుపక్కల అభివృద్ధి జరిగిందంటే చంద్రబాబుతోనే సాధ్యమైందన్నారు.

కాంగ్రెస్ ఆటలాడుతోంది : ఎర్రబెల్లి


హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ తీసుకున్న నిర్ణయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి నచ్చకుంటే రాజీనామా వారి ముఖాన కొట్టాలని లేదంటే వారి పార్టీ అధిష్టానంతో పొట్లాడాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ నగర అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం మండిపడ్డారు. తమ పార్టీ తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఎప్పుడో లేఖ ఇచ్చిందన్నారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకొని... ఇప్పుడు ఇరు ప్రాంతాల నేతలతో కొత్త డ్రామా ఆడిస్తోందని విమర్సించారు. హైదరాబాదు పైన మాట్లాడే హక్కు తమకు మాత్రమే ఉందని, ఎవరికి లేదన్నారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే ఒప్పుకునేది లేదన్నారు.

నచ్చకుంటే రాజీనామా ముఖాన కొట్టు: కిరణ్‌కు తలసాని


తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తప్పుడు కూతలు కూస్తున్నారని టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు విజయవాడలో అన్నారు. విభజన విషయంలో డ్రామాలు వేస్తున్న కాంగ్రెసు పార్టీ నేతలు తమను విమర్శిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ప్రజా ఉద్యమంలో తామే ముందుంటామన్నారు. సమైక్యాంధ్ర తమ గుండె చప్పుడు అన్నారు. నీళ్లు, నిధులు, సీమాంధ్ర హక్కులపై పోరాడుతామన్నారు. ఇష్టారీతిగా మాట్లాడే కెసిఆర్ వంటి వారిని డిజిపి ఏమనరని, అదే సీమాంధ్రులను మాత్రం హెచ్చరించడమేమిటిన్నారు. తమపై తప్పుడు కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదన్నారు. కాంగ్రెసు పార్టీ విభజన విషయంలో విడ్డూరంగా మాట్లాడుతోందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిది వాదమైతే, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మరోలా మాట్లాడుతున్నారన్నారు. తెరాసను విలీనం చేసుకుని లబ్ధి పొందాలనే దుర్మార్గపు ఆలోచనతో కాంగ్రెసు విభజన చేసిందన్నారు. డిజిపి దినేష్ రెడ్డి సమైక్యవాదేనని, తెలంగాణలో నలభై శాతం మంది సమైక్యవాదులు ఉన్నారని మరో నేత కోడెల శివప్రసాద రావు అన్నారు.

కెసిఆర్ తప్పుడు కూతలు: దేవినేని