August 9, 2013

ముఖ్యమంత్రే సమస్యలు చెబితే పరిష్కరించేదెవరు?

నాటకంలో భాగమే ఆంటోనీ కమిటీ సోమిరెడ్డి, యనమల
'సీమాంధ్రలో గత తొమ్మిది రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రజలు లేవనెత్తుతున్న అంశాలనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ఉండి ఆయన కూడా సామాన్యుని మాదిరి సమస్యలు ఏకరువు పెడితే వాటిని పరిష్కరించేదెవరు? ఆయన మాటలకు విలువేముంటుంది' అని తెదేపా పార్టీనేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. విభజన నిర్ణయం కాంగ్రెస్ పార్టీదే తప్ప ప్రభుత్వానిది కాదన్న ముఖ్యమంత్రి వాదన అసంబద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు.

'ఈ నిర్ణయం తీసుకొన్న కాంగ్రెస్ కమిటీలో యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా,ప్రధాని మన్మోహన్ సింగ్, హోం మంత్రి షిండే, ఆరిక మంత్రి చిదంబరం వంటివారు ఉన్నారు. దేశాన్ని పాలించేది కాంగ్రెస్ పార్టీనా...వేరే పార్టీనా?' అని ప్రశ్నించారు. గత పదిహేను రోజులుగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తాము మాట్లాడుతున్న విషయాలనే ముఖ్యమంత్రి కూడా మాట్లాడారని, వాటిపై స్పష్టత కావాలని తమ పార్టీ డిమాండ్ చేస్తున్నామని, అవి తేలిన తర్వాతే పార్లమెంటులో బిల్లు పెట్టాలన్నది తమ డిమాండ్ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకంలో మరో భాగమే ఆంటోనీ కమిటీ అని తెదేపా సీమాంధ్ర నేత, శాసనమండలి పక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎనిమిదిన్నర కోట్ల ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశంపై కాంగ్రెస్ ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. సొంత రాష్ట్రాల ప్రయోజనాల కోసం చిదంబరం, వీరప్ప మొయిలీ తెలుగుజాతిని ముక్కలు చేశారు. వారినే మళ్లీ ఆంటోనీ కమిటీలో సభ్యులుగా వేశారు. దీనిని బట్టే ఈ కమిటీ నిజ స్వరూపం తెలుస్తోంది' అని విమర్శించారు.