August 30, 2013




 
"టీఆర్ఎస్ పార్టీ నాది యు- టర్న్ అంటుంది. వైసీపీ నాది టీ-టర్న్ అంటుంది. నాది ఆ టర్నూ కాదు...ఈ టర్నూ కాదు. స్ట్రెయిట్ లైన్. పబ్లిక్ లైన్. ప్రజలకు న్యాయం జరగాలి. తెలుగువారికి ఎక్కడ సమస్యలు వచ్చినా నేను అక్కడ ఉంటాను. ఉత్తరాఖండ్‌లో తెలుగువారు చిక్కుకుపోతే నేను వెళ్లాను. బాబ్లీకి వెళ్లాను. తెలుగు వారి గౌ రవం పెంచడానికి ప్రపంచమంతా తిరిగాను. సీమాంధ్రకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. కాంగ్రెస్ దాన్ని పట్టించుకోవట్లేదు. ముప్పై రోజులుగా ప్రజ లు రోడ్లపై ఉంటే ఎందుకు ఉన్నారని కూడా అడగకపోవడం మరీ ఘోరం. దీన్ని ప్రశ్నించడానికే నేను వెళ్తున్నాను'' అని టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆదివారం నుంచి గుంటూరు జిల్లాలో తలపెట్టిన తెలుగువారి ఆత్మగౌరవ యాత్ర సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ తన నివాసంలో "ఏబీఎన్-ఆంధ్రజ్యోతి'కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని, ఎలాంటి రాష్ట్రం ఎలా అయిపోయిందన్న ఆవేదన మనసును పట్టి పీడిస్తోంది'' అన్నారు.

కేవలం తన రాజకీయ ప్రయోజనం కోసం కాంగ్రెస్ పార్టీ నిర్లజ్జగా వ్యవహరించిన తీరే రాష్ట్రాన్ని ఇప్పుడు ఈ సంక్షోభంలోకి నెట్టిందని, నిర్ణయానికి ముందే అందరినీ విశ్వాసంలోకి తీసుకొని ఎవరి సమస్యలు ఏమిటో తెలుసుకొని తదనుగుణంగా వ్యవహరిస్తే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. "విభజన నిర్ణయం గురించి ప్రకటించిన నోటితోనే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ విలీనం గురించి మాట్లాడింది. దానిని టీఆర్ఎస్ «ద్రువీకరించింది. ఇది రాజకీయమా? ప్రజా కోణమా? టీఆర్ఎస్ నాయకులు ఇక్కడ కూర్చుని.. ఉద్యోగులు వెళ్లిపోవాలని, నాలుకలు కోస్తామని ప్రకటనలు చేశారు. ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ నాయకులు చెప్పగానే మాటమార్చి సంయమనం పాటించాలని హితోక్తులు చెబుతున్నారు. కాంగ్రెస్ స్క్రిప్ట్.. టీఆర్ఎస్ డైలాగులు. తొమ్మిదేళ్లు సీఎంగా చేసిన నేను అడిగితే ప్రధాని సమయం ఇవ్వరు. విజయమ్మ అడగ్గానే రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతారు. వైఎస్ ఉంటే ఇలా జరిగేది కాదని సానుభూతి చూపిస్తారు. రూ.43 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ సీబీఐ కేసు మోపడంతో జైలులో ఉన్న వ్యక్తి గురించి రాష్ట్రపతి వాకబు చేస్తారు.

వీరి మధ్య బంధం ఎంత బలీయంగా ఉందో ఇదే ఉదాహరణ. ఇటు టీఆర్ఎస్‌ను, అటు వైసీపీని కలుపుకొని కాంగ్రెస్ రాజకీయ కుట్రలు చేస్తోంది. ఈ పార్టీల మద్దతుపై ధైర్యంతో ప్రజలను చిన్నచూపు చూస్తోంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది'' అని బాబు ధ్వజమెత్తారు. తన లేఖ వల్లే రాష్ట్ర విభజన జరిగిందంటున్న ప్రత్యర్థి పార్టీల విమర్శలను చంద్రబాబు తోసిపుచ్చారు. "అమ్మ దయ.. అమ్మ వరం అంటూ హైదరాబాద్‌లో టి-కాంగ్రెస్ నేతలు సోనియా ఫొటోతో పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టారు. నా వల్లే వచ్చి ఉంటే వాటిపై కనీసం నా పేరైనా వేసి ఉండాలి కదా. ఎక్కడా కనిపించట్లేదే'' అని వ్యాఖ్యానించారు. తెల్ల కాగితంపై సంతకం చేసి ఇచ్చిన మాదిరిగా కేంద్రానికి లేఖ ఇచ్చిన వైసీపీకి తమ గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. "రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోవడానికి కేంద్రానికి సర్వాధికారాలు ఉన్నాయని షిండేకు ఇచ్చిన లేఖలో వైసీపీ రాసింది. కేంద్రం ఏ నిర్ణయం తీసుకొన్నా కట్టుబడి ఉంటామని చెప్పింది.

ఇక మీరు టీడీపీని ఎలా అంటారు? మమ్మల్ని ఓడించలేమన్న భయంతో 1999లో తెలంగాణ ఉద్యమానికి బీజం వేసింది వైఎస్. 2004లో తెలంగాణ అంశాన్ని మ్యానిఫెస్టోలో పెట్టారు. టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకొన్నారు. మంత్రి పదవులు ఇచ్చారు. ఇవన్నీ మర్చిపోయి మాపై రాళ్లు వేస్తున్నారు. వీళ్లను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ రెండు వైపులా ఓట్లూ సీట్లూ వస్తాయని కలలు కంటోంది'' అని ఆయన విమర్శించారు. తొమ్మిదేళ్లు గాడిద చాకిరీ చేసి ఒక స్థాయికి తెచ్చిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ తన అసమర్థ, అస్తవ్యస్త నిర్ణయాలతో నాశనం చేసి వదిలిపెట్టిందని బాబు దుయ్యబట్టారు. "మూడేళ్లు తెలంగాణలో ఉద్యమాలు, అనిశ్చితి. ఇప్పుడు సీమాంధ్రలో ఉద్యమ జ్వాలలు. ఎలాంటి రాష్ట్రం ఎలా అయిందన్న బాధ కలుగుతోంది. ఎంతో కష్టపడి హైదరాబాద్‌ను ఈ స్థాయికి తెచ్చాం. దేశం అంతా మనవైపు చూసేలా చేశాం.

సమస్యలు మాకూ వచ్చాయి. ఆలమట్టి విషయంలో ప్రధానిగా ఉన్న దేవెగౌడతో తగాదా వస్తే.. ఐదుగురు సీఎంలతో కమిటీ వేయించి పరిష్కరించాం. ఇప్పుడు నేను కేవలం ప్రతిపక్ష నేతను. నా పాత్ర పరిమితం. సలహాలు ఇవ్వగలను. లేఖలు రాయగలను. పెద్దన్న పాత్రలో కాంగ్రెస్ ఉంది. కానీ ఆ పార్టీ తన బాధ్యతను విస్మరించింది. ప్రజల్లోకి వెళ్లి అదే చెబుతాను'' అని ఆయన వివరించారు. తాను మాట మారుస్తున్నానన్న టి-జేఏసీ చైర్మన్ కోదండరాం విమర ్శను బాబు తోసిపుచ్చారు. "ఆయన ఒక్క రోజు కూడా నన్ను అభినందించలేదు. మా గురించి ఇన్ని రోజులూ ఒక్క మంచి మాట చెప్పలేదు. ఇప్పుడు మాత్రం నేను మాట మార్చానంటున్నారు.

జేఏసీ నుంచి పనిగట్టుకొని మా పార్టీ వారిని వెళ్లగొట్టారు. నా పాదయాత్రకు అడ్డుపడే ప్రయత్నం చేశారు. వీళ్లందరూ కాంగ్రెస్ గూటి పక్షులు. టీడీపీని దెబ్బ తీయాలన్నది వీరి ఉమ్మడి లక్ష్యం'' అని మండిపడ్డారు. అటూ ఇటూ రెండు వైపులా తన యాత్రను అడ్డుకోవడానికి గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయన్నారు. హరికృష్ణ యాత్ర గురించి ప్రశ్నించగా.. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు తాను వారి వెంట ఉంటున్నానని, మిగిలిన వారి గురించి తాను పట్టించుకోనని జవాబిచ్చారు.
రేపటి నుంచి చంద్రబాబు యాత్ర

'తెలుగువారి ఆత్మ గౌరవ యాత్ర' పేరుతో చంద్రబాబు తలపెట్టిన బస్సు యాత్ర ఆదివారం గుంటూరు జిల్లా నుంచి ప్రారంభం కానుంది. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత బాబు నిర్వహిస్తున్న యాత్రల్లో ఇది మూడోది. 2008లో ఆయన 'మీ కోసం' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించారు. కొంతకాలం క్రితం ఏకబిగిన ఏడు నెలలపాటు పాదయాత్ర జరిపారు. రాష్ట్ర విభజన పరిణామాల నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లే నిమిత్తం ఆయన తాజా యాత్ర తలపెట్టారు. టీడీపీ విడుదల చేసిన కార్యక్రమం ప్రకారం గుంటూరు జిల్లా సరిహద్దులోని పొందుగుల గ్రామం నుంచి ఆయన పర్యటన మొదలవుతుంది. అక్కడ నుంచి శ్రీనగర్, గామాలపాడు, నడికుడి మీదుగా గురజాల చేరతారు. అక్కడ నుంచి దాచేపల్లిలో ఆయన యాత్ర ముగుస్తుంది. రెండో తేదీన దాచేపల్లిలో మొదలై వీరాపురం మీదుగా కొండమోదు, నెమలిపురి, నకిరికల్లు చేరుతుంది.

యూ టర్న్ కాదు..టీ టర్న్ కాదు.. నా దారి ప్రజల దారి

టీఆర్‌ఎస్ పుట్టకముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 41మంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపింది మీ భర్త వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాదా అని వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ఈ మేరకు వారు బహిరంగ లేఖ విడుదల చేశారు. అధికార పక్షాన్ని వదిలి ప్రతిపక్షంపై విమర్శలు చేయటం వైసీపీ లాలూచీకి నిదర్శనమని ఆ లేఖలో పేర్కొన్నారు. జగన్‌కు బెయిల్ కోసం రాష్ట్రపతితో రాయబారం నడుపుతున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. షర్మిల పాదయాత్రలో, పరకాల ఎన్నికల్లో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడింది గుర్తు లేదా అన్నారు.

మొదలు పెట్టింది మీ భర్త కాదా? : టీడీపీ

టిఆర్ఎస్ పార్టీ ఇంకా పుట్టక ముందే నలభై ఒక్క మంది తెలంగాణ ఎమ్మెల్యేలను తెలంగాణ కోసం ఢిల్లీ పంపి ఉద్యమ బీజం నాటిందే వైఎస్ రాజశేఖరరెడ్డి అయితే అది గుర్తు లేనట్లుగా జగన్ పార్టీ నేతలు నటిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. శుక్రవారం ఇక్కడ టిడిపి ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, పల్లె రఘునాధరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి దేవి వైఎస్ విజయమ్మకు ఒక బహిరంగ లేఖ రాశారు. విజయలక్ష్మి, జగన్ కలిసి విడుదల చేసిన బహిరంగ లేఖ వారి పార్టీ కాంగ్రెస్‌కు తొత్తుగా మారిందని మరోసారి రుజువు చేసిందని, నెల రోజులుగా కోట్లాది మంది ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా పట్టించుకోని కాంగ్రెస్ పార్టీని పల్లెత్తు మాట అనకుండా టిడిపిపై దాడి చేయడం లాలూచీతనానికి నిదర్శనమని వారు విమర్శించారు.

'పోయిన డిసెంబర్లో కేంద్ర హోం మంత్రి షిండేకు ఇచ్చిన లేఖలో రాష్ట్ర విభజనకు కేంద్రానికి సర్వాధికారాలు ఉన్నాయని లిఖితపూర్వకంగా రాసిచ్చి రాష్ట్ర విభజన చేసుకోవచ్చని సోనియా చేతికి కత్తి ఇచ్చి వచ్చారు. ఈ సమావేశం తర్వాత సిపిఎం, ఎంఐఎం పార్టీలు మాత్రమే సమైక్యాన్ని కోరుకొన్నాయని షిండే చెప్పారు. మీరు సమైక్యవాదానికి కట్టుబడి ఉంటే అప్పుడే దానిని ఎందుకు ఖండించలేదు' అని వారు ప్రశ్నించారు. లక్ష కోట్లు దోచుకొని ఆ కేసుల మాఫీకి కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేయడానికి జగన్ పార్టీ సిద్ధపడిందని, కాంగ్రెస్ ఆడిస్తున్న ఆటలో భాగస్వామిగా మారిందని వారు ధ్వజమెత్తారు. 'చంద్రబాబు ఏం మాట్లాడినా ఏం చేసినా మీకు తప్పుగానే కనిపిస్తుంది.

కొత్త రాజధానిని నిర్మించడానికి ఐదారు లక్షల కోట్లు కావాలని...ఎక్కడ నుంచి ఇస్తారని చంద్రబాబు అడిగితే తప్పా? ఎపి ఎన్జీవోలతో చంద్రబాబు కనికరం లేకుండా మాట్లాడారని మరో నింద వేస్తున్నారు. ఫ్యాక్షనిస్టు కుటుంబాల నుంచి వచ్చిన మీకు అసలు కనికరం అన్న పదానికి అర్ధం తెలుసా? మీకు ప్రజలకు మేలు చేయాలన్న సద్భుద్ది ఉంటే దోచుకొన్న డబ్బును వారికి అప్పగించండి. ఆస్తులు ప్రభుత్వానికి స్వాధీనం చేయండి. కాంగ్రెస్‌తో రహస్య అవగాహన లేకపోతే ఎన్నికల తర్వాతగాని...ముందుగాని కాంగ్రెస్‌తో చేతులు కలపబోమని ప్రమాణం చేసి చెప్పండి' అని వారు డిమాండ్ చేశారు.

తెలంగాణ ఉద్యమ బీజమే మీది...గుర్తు లేదా?


కాంగ్రెస్ కుట్రలను ప్రజలకు
వివరించేందుకే బస్సు యాత్ర :
ఏబీఎన్‌తో చంద్రబాబు
తెలుగువారికి గుర్తింపు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పామని, ఆత్మ గౌరవంతో ప్రపంచాన్నే జయించవచ్చునని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టడం బాధాకరంగా ఉందని, విభజన రాజకీయ ప్రయోజనాలకోసమేనని, జాతి ప్రయోజనాలకు కాదని పేర్కొన్నారు. 30 రోజుల నుంచి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంటే కేంద్రం పట్టించుకోవడం లేదని చంద్రబాబు విమర్శించారు.

అసలు విభజనకు బీజం వేసింది వైఎస్సేనని, 1999లో ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపించారని, అప్పటి నుంచే ఈ కార్యక్రమం మొదలైందని చంద్రబాబు పేర్కొన్నారు. విభజన ప్రకటన రోజే టీఆర్ఎస్, వైసీపీలు తమతో వస్తాయని దిగ్విజయ్‌సింగ్ చెప్పారని అన్నారు. రాష్ట్ర పరిస్థితులను ప్రధాన మంత్రి పట్టించుకోవడంలేదని బాబు విమర్శించారు. వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. వైసీపీ అవినీతి డబ్బుతో పేపర్, చానల్‌పెట్టి అదే పనిగా దుష్ప్రాచారం చేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు.

తెలుగుదేశం పార్టీని దెబ్బ తీయాలనే కుట్రతో తెలుగు జాతినే దెబ్బతీయాలనే పరిస్థితికి వచ్చారని, కాంగ్రెస్ స్క్రిప్ట్‌ను టీఆర్ఎస్ చదువుతోందని, ఇక్కడ కేసీఆర్ సీమాంధ్ర ఉద్యోగస్తులు వెళ్లిపోవాలని అంటారు, టీఆర్ఎస్ నేతలు నాలుకలు కోస్తామని రెచ్చగొడతారని, ఢిల్లీ వెళ్లినప్పుడు మేం సంయమనం పాటిస్తున్నామని చెబుతారని, సీమాంధ్రలో రెచ్చగొట్టి లబ్ది పొందడానికి చూస్తున్నారని బాబు విమర్శించారు.

కాంగ్రెస్ కుట్రలను రాష్ట్ర ప్రజలకు వివరించేదుకే సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి బస్సు యాత్ర చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్నో సార్లు కలుస్తామని అపాయింట్‌మెంట్ ఇవ్వమంటే ప్రధాని ఇవ్వలేదని, అదే విజయమ్మ అయితే రెడ్ కార్పెట్ పరిచారని ఆయన మండిపడ్డారు. జగన్‌కు బెయిల్ ఇవ్వాలి, కేసులు మాఫీ చేయాలి, బయటకు వచ్చి రాహుల్‌ను ప్రధానిని చేయడానికి సహకరిస్తారని, ఇదంతా కాంగ్రెస్, జగన్ ఆడుతున్న నాటకమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రూపాయి పతనానికి అవినీతే కారణమని అన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం రవీంధ్రభారతిలో చేసిన వ్యాఖ్యలు నిర్ణయానికి ముందు ఎందుకు చెప్పలేదని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. త్వరలో కొత్త పార్టీ ఆవిర్భవిస్తున్న మీడియా ప్రశ్నకు సమాధానంగా చాలా మంది పార్టీలు పెట్టారు చివరకు ఏమయ్యాయో చూశాంకదా అన్ని అన్నారు. జగన్ మాట తప్పను, మడమ తిప్పను అన్నారు. చివరకు సోనియా గాంధీకి సాష్టాంగ నమస్కారం చేసే పరిస్థితిలో ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నడూ సుస్థిర పాలన జరగలేదని, వైఎస్ హయాంలో ఐదేళ్లు అవినీతి జరిగిందని, ఒక్క జగన్మోహన్‌రెడ్డి లక్ష కోట్లు సంపాదించారని దేశంలో ఎక్కడా జరగని అవినీతి ఇక్కడ జరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు.

టీడీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రపంచమంతా పొగిడిందని చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగు జాతి కోసం హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని, సైబరాబాద్ సిటీని నిర్మించామని, తొమ్మిదేళ్ళ పాలనలో దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి చేసి చూపించామని, తెలుగువారి ప్రతిష్ట కోసం ప్రపంచమంతా తిరిగామని ఆయన అన్నారు.

రాష్టంలోని పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయంతో కాంగ్రెస్ భయపడి ఇలాంటి తొందపాటు నిర్ణయాలు తీసుకుందని చంద్రబాబు నాయుడు విమర్శించారు. తెలుగుజాతికి సంబంధించిన వ్యవహారాన్ని కాంగ్రెస్ సొంత వ్యవహారంలా చేసిందని ఆయన అన్నారు. తనకు రాజకీయాలు ముఖ్యం కాదని, ఇబ్బందుల్లో ఉన్న వారి సమస్యల పరిష్కారమే ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టి సమస్యను జఠిలం చేశారని, ఏ రాజకీయ లబ్దికోసం సమస్యలు సృష్టించారో ప్రజలకు తెలియజేస్తానని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తి తన గురించి మాట్లాడే అర్హత లేదని, అడ్రస్ లేనివాళ్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. అందరికీ న్యాయం జరగాలని, న్యాయం జరిగే వరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

తెలుగువారికి గుర్తింపు తెచ్చింది టీడీపీ

విభజించు - పాలించు సూత్రానికి కేంద్ర శ్రీకారం చుట్టిందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్ర ప్రాంతంలో మూడు ప్రధాన సామాజిక వర్గాలు కేంద్ర మంత్రులను ఒత్తిడికి గురి చేస్తున్నాయని, అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఆమోదించేలా చేసేందుకే కొత్త ఎత్తుగడవేస్తోందని మండిపడ్డారు.
అసెంబ్లీలో తీర్మానంపై ప్రజల పక్షాన నిలబడి ఓటేస్తామని ఆయన తెలిపారు. చంద్రబాబు బస్సు యాత్ర చారిత్రక అవసరమన్నారు. యాత్రకు ఇప్పుడు సరైన సమయం కాదని బాబుకు చెప్పానని, కాంగ్రెస్, వైసీపీ అల్లర్లకు కాచుకుని కూర్చున్నారని పయ్యావుల తెలిపారు.

విభజించు-పాలించు సూత్రానికి కేంద్రం శ్రీకారం : పయ్యావుల

సస్పెన్షన్ కాలం పూర్తి చేసుకుని తిరిగి లోక్ సభకు హాజరైన సీమాంధ్ర ఎమ్.పిలు మళ్లీ లోక్ సభలో ఆందోళన నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ ను రక్షించండి అంటూ నినాదాలు చేస్తూ వారంతా నినాదాలు చేశారు.వెల్ లోకి దూసుకువెళ్లి ఆందోళన సాగించడంతో సభను గంటసేపు వాయిదా వేశారు. కాంగ్రెస్ కు చెందిన ఎనిమిది మంది ఎమ్.పిలు, టిడిపికి చెందిన ఎమ్.పిలు ఆందోళన చేస్తుండడంతో ఐదు రోజులపాటు సస్పెండ్ చేయాలని స్పీకర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ ఐదు రోజులు పూర్తి అయ్యాక తిరిగి యధా ప్రకారం వారు మళ్లీ సభకు ఆటంకం సృష్టించారు.

సస్పెన్షన్ పూర్తి -మళ్లీ లోక్ సభలో ఆందోళన