August 30, 2013

తెలంగాణ ఉద్యమ బీజమే మీది...గుర్తు లేదా?

టిఆర్ఎస్ పార్టీ ఇంకా పుట్టక ముందే నలభై ఒక్క మంది తెలంగాణ ఎమ్మెల్యేలను తెలంగాణ కోసం ఢిల్లీ పంపి ఉద్యమ బీజం నాటిందే వైఎస్ రాజశేఖరరెడ్డి అయితే అది గుర్తు లేనట్లుగా జగన్ పార్టీ నేతలు నటిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. శుక్రవారం ఇక్కడ టిడిపి ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, పల్లె రఘునాధరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి దేవి వైఎస్ విజయమ్మకు ఒక బహిరంగ లేఖ రాశారు. విజయలక్ష్మి, జగన్ కలిసి విడుదల చేసిన బహిరంగ లేఖ వారి పార్టీ కాంగ్రెస్‌కు తొత్తుగా మారిందని మరోసారి రుజువు చేసిందని, నెల రోజులుగా కోట్లాది మంది ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా పట్టించుకోని కాంగ్రెస్ పార్టీని పల్లెత్తు మాట అనకుండా టిడిపిపై దాడి చేయడం లాలూచీతనానికి నిదర్శనమని వారు విమర్శించారు.

'పోయిన డిసెంబర్లో కేంద్ర హోం మంత్రి షిండేకు ఇచ్చిన లేఖలో రాష్ట్ర విభజనకు కేంద్రానికి సర్వాధికారాలు ఉన్నాయని లిఖితపూర్వకంగా రాసిచ్చి రాష్ట్ర విభజన చేసుకోవచ్చని సోనియా చేతికి కత్తి ఇచ్చి వచ్చారు. ఈ సమావేశం తర్వాత సిపిఎం, ఎంఐఎం పార్టీలు మాత్రమే సమైక్యాన్ని కోరుకొన్నాయని షిండే చెప్పారు. మీరు సమైక్యవాదానికి కట్టుబడి ఉంటే అప్పుడే దానిని ఎందుకు ఖండించలేదు' అని వారు ప్రశ్నించారు. లక్ష కోట్లు దోచుకొని ఆ కేసుల మాఫీకి కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేయడానికి జగన్ పార్టీ సిద్ధపడిందని, కాంగ్రెస్ ఆడిస్తున్న ఆటలో భాగస్వామిగా మారిందని వారు ధ్వజమెత్తారు. 'చంద్రబాబు ఏం మాట్లాడినా ఏం చేసినా మీకు తప్పుగానే కనిపిస్తుంది.

కొత్త రాజధానిని నిర్మించడానికి ఐదారు లక్షల కోట్లు కావాలని...ఎక్కడ నుంచి ఇస్తారని చంద్రబాబు అడిగితే తప్పా? ఎపి ఎన్జీవోలతో చంద్రబాబు కనికరం లేకుండా మాట్లాడారని మరో నింద వేస్తున్నారు. ఫ్యాక్షనిస్టు కుటుంబాల నుంచి వచ్చిన మీకు అసలు కనికరం అన్న పదానికి అర్ధం తెలుసా? మీకు ప్రజలకు మేలు చేయాలన్న సద్భుద్ది ఉంటే దోచుకొన్న డబ్బును వారికి అప్పగించండి. ఆస్తులు ప్రభుత్వానికి స్వాధీనం చేయండి. కాంగ్రెస్‌తో రహస్య అవగాహన లేకపోతే ఎన్నికల తర్వాతగాని...ముందుగాని కాంగ్రెస్‌తో చేతులు కలపబోమని ప్రమాణం చేసి చెప్పండి' అని వారు డిమాండ్ చేశారు.