February 19, 2013

అధికారాన్ని ఢీకొని.. టీడీపీ విజయం

అధికార పార్టీ కాంగ్రెస్ తన వనరులన్నీ ప్రయోగించినా వాటిని తట్టుకొని టీడీపీ ఖమ్మం డీసీసీబీ, డీసీఎంఎస్‌లను దక్కించుకొంది. జిల్లాలో ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సత్తా చాటి పార్టీ ప్రతిష్ఠ నిలిపారు. రాష్ట్రంలో ఖమ్మంతోపాటు మరో రెండు మూడు జిల్లాల్లో టీడీపీ సహకార ఎన్నికల్లో మొదటి స్థానంలో నిలిచినా డీసీసీబీ, డీసీఎంఎస్‌లను దక్కించుకోలేకపోయింది. అక్కడ మెజారిటీలు స్వల్పంగా ఉండటం, తన వనరులన్నీ వెచ్చించి అధికార పార్టీ కాంగ్రెస్ సొసైటీ అధ్యక్షులను సమీకరించడం దీనికి కారణం.

ఖమ్మంలో కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో టీడీపీ కంటే చాలా దూరంలో ఉండిపోవడంతో అక్కడ ఇటువంటి ప్రయత్నాలు సాధ్యం కాలేదు. వైఎస్ సీఎంగా ఉండగా జరిగిన సహకార ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఒక్క డీసీసీబీయే దక్కింది. అదీ ఖమ్మమే. అప్పుడు టీడీపీ మద్దతుతో ఈ స్థానాన్ని సీపీఎం దక్కించుకొంది. ఈసారి సీసీఎం కాంగ్రెస్‌కు మద్దతిచ్చినా.. సీపీఐ సహకారంతో టీడీపీ గెలిచింది. సొసైటీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో టీడీపీకి 45 సొసైటీలు దక్కాయి. సీపీఐతో కలిపి ఆ కూటమికి 49 ఉండగా డీసీసీబీ డైరెక్టర్ల ఎన్నికలో వారికి 58కి పైగా ఓట్లు పోలయ్యాయి. తుమ్మల మంత్రాంగంతో ఇతర పార్టీల నుంచి వచ్చిన ఓట్లు దీనికి కారణం.

వైసీపీ కడప జిల్లాను దక్కించుకోగా.. తాము ఖమ్మంలో పాగా వేయడం టీడీపీ శిబిరానికి ఊరట కలిగించింది. జిల్లాలో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. డీసీసీబీ చైర్మన్ పదవికి మాజీ వైస్‌చైర్మన్ తుళ్లూరి బ్రహ్మయ్యతో పాటు మువ్వా విజయబాబు, బోడేపుడి రమేష్‌బాబు బరిలో ఉన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు అభ్యర్థిని ఖరారుచేసే అవకాశం ఉంది. డీసీఎంఎస్ పదవికి టీడీపీ నుంచి బోయినపల్లి సు ధాకర్, ఎగ్గడి అంజయ్య, చల్లగొండ్ల కృష్ణయ్య పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కాగా.. డీసీసీబీలో సీపీఎం తొలిసారి ప్రాతినిధ్యం కోల్పోయింది. ఈసారి కాంగ్రెస్‌తో జతకట్టి బరిలోకి దిగిన సీపీఎం.. ఘోర పరాజయం మూటగట్టుకుంది. సీపీఎం డైరెక్టర్ అభ్యర్థుల్లో ఒక్కరూ గెలవలేదు.

ఖమ్మంలో సత్తా చాటిన తుమ్మల

పాదయాత్రలకు బ్రేక్
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌తో ఆటంకం
గుంటూరులోనే ఉండేందుకు ఈసీ అనుమతి
21న సాయంత్రం యాత్ర తిరిగి ప్రారంభం

ఎన్నికోల కోడ్ కారణంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్ర 48గంటల పాటు నిలిచిపోనుంది. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు పాదయాత్రను నిలిపేయాలని ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇతర జిల్లాల నాయకులు గుంటూరు జిల్లాలో ఉండటానికి వీల్లేదని కూడా స్పష్టం చేసింది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే తమ నేత పాదయాత్ర ప్రారంభించారని, తాము ఎక్కడా ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయమని కోరలేదని, దీన్ని పరిగణనలోకి తీసుకొని గుంటూరు జిల్లాలోనే ఉండేలా అనుమతి ఇవ్వాలని టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు జిల్లా ఎన్నికల అధికారిని కోరారు.

మరోవైపు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇ.పెద్దారెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు సచివాలయంలోని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. సోమవారం మధ్యాహ్నం వరకు ఈసీ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో టీడీపీ నాయకులు కొంత ఉత్కంఠకు లోనయ్యారు. గుంటూరులో ఉండటానికి ఒకవేళ ఈసీ అంగీకరించకపోతే అకాలవర్షానికి తీవ్ర నష్టం వాటిల్లిన ప్రకాశం జిల్లాలో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు చంద్రబాబుతో రెండు రోజుల పర్యటన ఏర్పాట్లు చేయాలని యోచించారు.

అయితే సాయంత్రానికి ఈసీ నుంచి షరతులతో కూడిన అనుమతి వచ్చింది. బస చేస్తున్న ప్రాంతం నుంచి బయటకు రాకూడదని, 21వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు 48 గంటలపాటు వీడియో నిఘాతో పాటు ఓ ప్రత్యాధికారి పర్యవేక్షణ ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది. ఈ వ్యవధిలో చంద్రబాబును ఇతర నేతలెవరూ కలవకూడదన్న షరతును కూడా విధించింది. దీంతో జిల్లాలోని వేయూరు గ్రామ శివార్లలోనే మంగళవారం సాయంత్రం నుంచి రెండు రోజుల పాటు చంద్రబాబు బస చేయనున్నారు.

19న సాయంత్రం బాబు యాత్ర నిలిపివేత


రైతు: చంద్రబాబు గారూ... వ్యవసాయానికి ఆరుగంటల విద్యుత్ రోజులో నాలుగు దఫాలుగా ఇస్తున్నారు. నేను ఒకేసారి ఇవ్వమని గట్టిగా అడిగితే కరెంటు ఏఈ నా ఇంటి విద్యుత్ కనెక్షన్‌ను తొలగించాడు. నేను పోరాడినా విద్యుత్ కనెక్షన్‌ను పునరుద్ధరించకపోవడంతో చివరికి ఎమ్మెల్యే ఆనందబాబు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.వృద్ధురాలు: అయ్యా... నా మనవరాలు ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసి ఆరేళ్లు అయింది. ఇప్పటివరకు ఉద్యోగం రాలేదు. మా వద్ద ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టి చదివించాం. ఒక పక్క ఉద్యోగం రాక మరోపక్క మనవరాలికి పెళ్లి చేయలేక మానసిక క్షోభను అనుభవిస్తున్నాం. గృహిణి: నేను హైదరాబాద్ నుంచి తెనాలి వరకు బస్సులో హాయిగా వచ్చాను. అక్కడి నుంచి మూల్పూరు వచ్చేసరికి నరకం కనిపించింది. అంత అధ్వాన్నంగా ఉన్నాయి రహదారులు.అలుపెరగకుండా జిల్లాలో 'వస్తున్నా... మీకోసం' పాదయాత్రతో నడక సాగిస్తోన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు అడుగడుగునా ప్రజలు ఎదురౌతూ తమ కష్టాలను ఏకరువు పెట్టుకొంటున్నారు.

పొలం పనులు చేసే కూలీల నుంచి ఉద్యోగుల వరకు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు నివేదిస్తున్నారు. మీరు సీఎం అయితేనే మా కష్టాలు తీరుతాయంటూ తమ నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్రజలకు తనకు నివేదించే సమస్యలను ఎంతో ఓర్పుగా వింటోన్న చంద్రబాబు ఎక్కడికక్కడ స్పందిస్తున్నారు. ఆయన ఇస్తున్న హామీలతో సంతోషం చెందుతూ మీకు ఓటేస్తే బాధ్యత మాది అని మాట ఇచ్చి మరీ సాగనంపుతున్నారు.సోమవారం జిల్లాలో 12వ రోజు పాదయాత్రను వేమూరు నియోజకవర్గంలోని కూచిపూడి గ్రామంలో శ్రీరామలింగేస్వారస్వామి దేవస్థానం వద్ద నుంచి చంద్రబాబు ప్రారంభించారు. దేవాలయం ఎదుట పురోహితుల దీవెనలు అందుకొన్న చంద్రబాబుకు స్థానిక మహిళలు 'విజయీభవ... దిగ్విజయీభవ' అంటూ స్వీయరచనలో రూపొందించిన గేయాన్ని ఆలపించి దీవించారు. అక్కడి నుంచి కూచిపూడి గ్రామంలోని ప్రధాన కూడలికి చేరుకొని ప్రసంగించారు.

'కూచిపూడి ఎప్పుడూ టీడీపీకి కంచుకోట... అందులో మరో ఆలోచనకు తావులేదు... గ్రామంలో ఎటు చూసినా మీ అభిమానం కనిపిస్తోంది... మీ రుణాన్ని ఎన్ని జన్మలెత్తి ఎంత సేవ చేసినా తీర్చుకోలేనిదని'' కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. కూచిపూడిలో సభకు మహిళలు పెద్ద ఎత్తున రాగా వారిని చూసి చంద్రబాబు 'ఏవమ్మా... బాగున్నారా! మిమ్నల్ని చూస్తేనే మీరు కష్టాల్లో ఉన్నారని తెలిసిపోతోంది. ఆరోజున నేను ఉచితంగా సిలిండర్లు ఇస్తే మీరు కాంగ్రెస్ వాళ్లు వచ్చి అన్నం వండి పెడతారని ఆశించి ఆ పార్టీకి ఓటేశారు. ఈ రోజున ఒక్క వంట గ్యాసే కాదు సన్నబియ్యం, నూనె, కందిపప్పు, పంచదార, ఉప్పు, ఉల్లిపాయలు ఇలా అన్ని నిత్యవసర సరుకుల ధరలు మీకు అందుబాటులో లేకుండాపోయాయి.

మీ మగవాళ్లకు పప్పేసి అన్నం పెడుతున్నారా లేక నీళ్లరసం పెడుతున్నారా? అని ప్రశ్నించారు. మీరు ఆరోజున ఏమారకుండా ఉండి ఉంటే ఈ రోజు కష్టాలు ఉండేవి కావు. హాయిగా సుఖపడాల్సిన సమయంలో కష్టాలు కొని తెచ్చుకొన్నారు.నాకు అధికారం ముఖ్యం కాదు. కష్టమైనా ఫర్వాలేదని మీతో ఉండి సమస్యలు తెలుసుకొని సంఘీభావం తెలిపేందుకే పాదయాత్రతో వచ్చానన్నారు. నాకు వ్యక్తిగతంగా కష్టాలేవి లేవు. మా అబ్బాయి బాగా చదువుకొన్నాడు. కోడల్ని కూడా పెళ్లి అయిన తర్వాత చదివిస్తున్నాం. నా భార్య 25 ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తుంటే ప్రోత్సహిస్తున్నానని చెప్పారు. చదువుకొన్న వాళ్లు డబ్బుకు అమ్ముడుపోతున్నారు ఆయారామ్... గయారామ్‌లు రాజకీయాల్లోకి వచ్చారు.

చదువుకొన్న వాళ్లు డబ్బుకు అమ్ముడు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నీతి కథలు చెప్పేవారని, ఈ రోజున నీతి గురించి మాట్లాడేవారే కరువవుతుండటమే సమస్యలకు మూలం అవుతోందన్నారు. లక్ష కోట్లు దోచుకొన్న వైఎస్‌కి లక్ష విగ్రహాలు పెట్టి ఏమి సంకేతాలిస్తారని ప్రశ్నించారు. జైల్లో ఉన్న వాళ్ల ఫోటోలను పెట్టుకొంటారో మహనీయులను ఆరాధిస్తారో మీరే తేల్చుకోవాలన్నారు.త్రివిక్రమరావు ఆదర్శం నా హయాంలో ప్రకాశం జిల్లాలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన త్రివిక్రమరావు అనే వ్యక్తి ఇంజనీరింగ్ చదివి మంచి సాఫ్టువేర్ ఉద్యోగం సాధించాడు. నేడు నెలకు రూ. లక్ష సంపాదిస్తున్నాడు. అతను వారంలో శని, ఆదివారం నా పాదయాత్రకు వ చ్చి సంఘీభావం తెలిపి వెళుతున్నాడు. అతను తన నెల జీతంలో ఇంటి అద్దె, ఖర్చులు పోను రూ. 78 వేలు పార్టీకి విరాళంగా ఇచ్చారు.

అలాంటివారు ఎంతోమంది టీడీపీపై విశ్వాసం ప్రదర్శిస్తున్నారు. ప్రజలు ఇచ్చిన విరాళాలతోనే టీడీపీ కొనసాగుతుంది తప్పా ప్రభుత్వ అవినీతి సొమ్ముతో కాదని చంద్రబాబు స్పష్టం చేశారు.చంద్రబాబు రోడ్డుకు ఇరువైపులా పచ్చని మొక్కజొన్న పొలాల మధ్యన కూచిపూడి నుంచి మూల్పురుకు పాదయాత్రను కొనసాగించారు. మధ్యా హ్నం భోజన విరామం అనంతరం మూల్పూరులో జరిగిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడి నుంచి ఎస్‌సీ కాలనీకి వెళ్లి దళిత ్రకైస్తవులను ఎస్‌సీల్లోకి చేరుస్తానని హామి ఇచ్చారు. ఆ తర్వాత పోతులమర్రి, జంపనిలో ప్రసంగించారు.

విజయీభవ


గుంటూరు, కృష్ణా జిల్లాల అభివృద్ధికే తన జీవితం అంకితం చేస్తానని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిగురుపాటి వరప్రసాద్ వాగ్దానం చేశారు. సోమవారం ఆయన గుంటూరులోని అరండల్‌పేట, బ్రాడీపేట, పాతగుంటూరు, గుజ్జనగుళ్ల ప్రాంతాల్లో పర్యటించి తనకు ఓటు వేయాల్సిందిగా పట్టభద్రులను అభ్యర్థించారు. ఈ సందర్భంగా చిగురుపాటి మాట్లాడుతూ రాజకీయ, విద్యా చైతన్యానికి మారు పేరైన గుంటూరు జిల్లా ఓట ర్లు తనకు మద్దతివ్వాలన్నారు. తాను గత ఆరేళ్లల్లో ఎమ్మెల్సీగా ఉంటూ పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరిగిందని చెప్పారు. పేద విద్యార్థులు ఎక్కువగా చదివే పాఠశాలలను దత్తత తీసుకొని వాటిని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

ఉపాధ్యాయుల సంక్షేమం, నిరుద్యోగులకు ఉపాధి కోసం శ్రమిస్తానన్నారు. తాను చేపట్టిన కార్యక్రమాలకు స్వచ్ఛంధ సంస్థల నుంచి కూడా సహకారం లభించిందన్నారు. మరోసారి సేవ చేసుకొనే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. చిగురుపాటి వెంట టీడీపీ నగర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్, మాజీ ఎమ్మెల్యే ఎస్ఎం జియావుద్దీన్, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ యాగంటి దుర్గారావు, పార్టీ నగర నాయకులు కొమ్మినేని ప్రసాద్, మీరావలి, రఫీ, ఖలీలుద్దీన్, మున్వర్, రషీద్ తదితరులు పాల్గొన్నారు.

గుంటూరు,కృష్ణా జిల్లాల అభివృద్ధికి కృషిచేస్తా


చంద్రబాబు 48 గంటల పాటు వేమూరులోనే బస చేయనున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఇతర జిల్లా నేతలు ఎవరూ స్థానికంగా ఉండటానికి వీల్లేదన్న నిబంధనను సడలించాలని టీడీపీ జిల్లా నేతల విజ్ఞాపన మేరకు ఈసీ షరతులతో కూడిన అనుమతిని జారీ చేసింది. దీంతో నేడు(మంగళవారం) సాయంత్రం ఐదు గంటల నుంచి 21వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు చంద్రబాబు పాదయాత్ర తాత్కాలికంగా వేమూరు శివారులో నిలిచిపోనుంది. ఈ నెల 21వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆ రోజున సా యంత్రం ఐదు గంటలకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచార కార్యకలాపాలు నిలిపేయాలి. అలానే ఇతర ప్రాంతాల నేతలు జిల్లాను విడిచి వెళ్లిపోవాలి.

ఈ నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ సురేష్‌కుమార్ వారం క్రితమే ఈ విషయాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావుకు తెలిపారు. అయితే తాము ఆయా తేదీల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోమని, చంద్రబాబుకు మాత్రం జిల్లాలోనే బస చేసేలా అనుమతివ్వాలని విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. ఆ లేఖను కలెక్టర్ ఎన్నికల సంఘానికి నివేదించగా సోమవారం సాయంత్రం ఈసీ నుంచి లేఖ వచ్చింది. చంద్రబాబు బస చేస్తే ఎ లాంటి అభ్యంతరం లేదని, అయితే కొ న్ని షరతులు పాటించాలని స్పష్టం చే సింది. ఎలాంటి ప్రచారం, రాజకీయ కార్యకలాపాలు నిర్వహించరాదని తెలిపింది. నిషేదిత సమయంలో ఆయన పోలింగ్ కేంద్రం, గ్రామానికి కొన్ని కి లోమీటర్ల దూరంలో ఉండాలని పే ర్కొన్నది. ఒక సీనియర్ అధికారితో వీ డియో చిత్రీకరించాలని ఆదేశించిది.

చంద్రబాబు వేమూరులోనే బస చేసేందుకు ఈసీ అనుమతి రావడంపై టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తాము ఇప్పటివరకు ఎక్కడా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించలేదని, ఎమ్మెల్సీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం కూడా నిర్వహించ లేదని, దీని వలనే ఈసీ తమ విజ్ఞాపనకు సంతృప్తి చెందిందని పుల్లారావు తెలిపారు. 48 గంటల విశ్రాంతి నేపథ్యంలో వచ్చే ఆదివారం కూడా పాదయాత్ర జరుగుతుందని, అలానే 21వ తేదీన సాయంత్రం కూడా ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల పాదయాత్రకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇది ఇలా ఉంటే ఎండలు పెరిగిన నేపథ్యంలో చంద్రబాబు పాదయాత్ర ఉదయం పూట త్వరితగతిన ప్రారంభించే యోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉదయం 11 గంటలకు పాదయాత్ర ప్రారంభమౌతున్నది. మధ్యాహ్నం 2 గంటలకు విశ్రాంతికి నిలిచపోతున్నది. ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు సాగుతోంది. ఎండలు, 21వ తేదీతో ఎన్నికల కోడ్ ముగియనుండటంతో పాదయాత్ర మొదలయ్యే వేళలు, ముగిసే సమయంలో మార్పు ఉండొచ్చని తెలిసింది.

చంద్రబాబు వేమూరులోనే..

కూచిపూడిలో అమృతలూరుకు చెందిన శివా టెంపుల్ యూత్ ఆధ్యర్యంలో 150ఆడుగుల భారీ ప్లెక్సీని ఏర్పాటుచేశారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా ఏర్పాటుచేసిన ప్లెక్సీ పలువురిని ఆకట్టుకుంది. ఆంధ్రా హజారేగా చంద్రబాబును అభివర్ణించారు. యువతకు దిశానిర్ధేశం చేశారు. ప్లెక్సీలో కాషాయధారి ఎన్‌టీఆర్, చంద్రబాబు, బాలకృష్ణలపై చేయివేసిన పలు చిత్రాలు ఆకర్షణీయంగా రూపొందించారు. దీనితోపాటు దమ్ముందా.. సిస్టంమార్చుకో.. ధైర్యం ఉందా.. అవినీతిని ఎదిరించు.. ఫైరుందా.. సమాజాన్ని మార్చు.. బాధ్యత ఉందా చంద్రబాబుకు ఓటేయి అంటూ యువత, నేటి ప్రజానీకాన్ని ఉత్తేజపరిచే నినాదాలను ఉదహరించారు. పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు కూడా కొద్దిసేపు ప్లెక్సీ వద్ద నిలబడి ఆసక్తిగా తిలకించారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు, మాజీ జడ్పీటీసీ శరణుగిరిని అడిగి ప్లెక్సీ ఏర్పాటు చేసిన వారి వివరాలు అడిగి వారిని అభినందించారు. మూల్పూరు మార్గంలో కూడా అరటి బొత్తలతో మందిరాల్లో ఏర్పాటు చేసిన ఎన్‌టీఆర్ చిత్రపటాలను తిలకించారు. ఆక్కడ చంద్రబాబుకు శివాటెంపుల్ యూత్ సభ్యులు దిష్టి తీసి, గజమాలతో సత్కరించారు. అనంతరం ఎన్‌టీఆర్ చిత్రపటాలకు కొబ్బరికాయ కొట్టారు. కార్యక్రమంలో శివా టెంపుల్ యూత్ సభ్యులు, యలవర్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ప్రత్యేక ఆకర్షణగా ఫ్లెక్సీ