February 19, 2013

19న సాయంత్రం బాబు యాత్ర నిలిపివేత

పాదయాత్రలకు బ్రేక్
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌తో ఆటంకం
గుంటూరులోనే ఉండేందుకు ఈసీ అనుమతి
21న సాయంత్రం యాత్ర తిరిగి ప్రారంభం

ఎన్నికోల కోడ్ కారణంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్ర 48గంటల పాటు నిలిచిపోనుంది. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు పాదయాత్రను నిలిపేయాలని ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇతర జిల్లాల నాయకులు గుంటూరు జిల్లాలో ఉండటానికి వీల్లేదని కూడా స్పష్టం చేసింది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే తమ నేత పాదయాత్ర ప్రారంభించారని, తాము ఎక్కడా ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయమని కోరలేదని, దీన్ని పరిగణనలోకి తీసుకొని గుంటూరు జిల్లాలోనే ఉండేలా అనుమతి ఇవ్వాలని టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు జిల్లా ఎన్నికల అధికారిని కోరారు.

మరోవైపు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇ.పెద్దారెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు సచివాలయంలోని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. సోమవారం మధ్యాహ్నం వరకు ఈసీ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో టీడీపీ నాయకులు కొంత ఉత్కంఠకు లోనయ్యారు. గుంటూరులో ఉండటానికి ఒకవేళ ఈసీ అంగీకరించకపోతే అకాలవర్షానికి తీవ్ర నష్టం వాటిల్లిన ప్రకాశం జిల్లాలో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు చంద్రబాబుతో రెండు రోజుల పర్యటన ఏర్పాట్లు చేయాలని యోచించారు.

అయితే సాయంత్రానికి ఈసీ నుంచి షరతులతో కూడిన అనుమతి వచ్చింది. బస చేస్తున్న ప్రాంతం నుంచి బయటకు రాకూడదని, 21వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు 48 గంటలపాటు వీడియో నిఘాతో పాటు ఓ ప్రత్యాధికారి పర్యవేక్షణ ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది. ఈ వ్యవధిలో చంద్రబాబును ఇతర నేతలెవరూ కలవకూడదన్న షరతును కూడా విధించింది. దీంతో జిల్లాలోని వేయూరు గ్రామ శివార్లలోనే మంగళవారం సాయంత్రం నుంచి రెండు రోజుల పాటు చంద్రబాబు బస చేయనున్నారు.