February 19, 2013

ఖమ్మంలో సత్తా చాటిన తుమ్మల

అధికారాన్ని ఢీకొని.. టీడీపీ విజయం

అధికార పార్టీ కాంగ్రెస్ తన వనరులన్నీ ప్రయోగించినా వాటిని తట్టుకొని టీడీపీ ఖమ్మం డీసీసీబీ, డీసీఎంఎస్‌లను దక్కించుకొంది. జిల్లాలో ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సత్తా చాటి పార్టీ ప్రతిష్ఠ నిలిపారు. రాష్ట్రంలో ఖమ్మంతోపాటు మరో రెండు మూడు జిల్లాల్లో టీడీపీ సహకార ఎన్నికల్లో మొదటి స్థానంలో నిలిచినా డీసీసీబీ, డీసీఎంఎస్‌లను దక్కించుకోలేకపోయింది. అక్కడ మెజారిటీలు స్వల్పంగా ఉండటం, తన వనరులన్నీ వెచ్చించి అధికార పార్టీ కాంగ్రెస్ సొసైటీ అధ్యక్షులను సమీకరించడం దీనికి కారణం.

ఖమ్మంలో కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో టీడీపీ కంటే చాలా దూరంలో ఉండిపోవడంతో అక్కడ ఇటువంటి ప్రయత్నాలు సాధ్యం కాలేదు. వైఎస్ సీఎంగా ఉండగా జరిగిన సహకార ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఒక్క డీసీసీబీయే దక్కింది. అదీ ఖమ్మమే. అప్పుడు టీడీపీ మద్దతుతో ఈ స్థానాన్ని సీపీఎం దక్కించుకొంది. ఈసారి సీసీఎం కాంగ్రెస్‌కు మద్దతిచ్చినా.. సీపీఐ సహకారంతో టీడీపీ గెలిచింది. సొసైటీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో టీడీపీకి 45 సొసైటీలు దక్కాయి. సీపీఐతో కలిపి ఆ కూటమికి 49 ఉండగా డీసీసీబీ డైరెక్టర్ల ఎన్నికలో వారికి 58కి పైగా ఓట్లు పోలయ్యాయి. తుమ్మల మంత్రాంగంతో ఇతర పార్టీల నుంచి వచ్చిన ఓట్లు దీనికి కారణం.

వైసీపీ కడప జిల్లాను దక్కించుకోగా.. తాము ఖమ్మంలో పాగా వేయడం టీడీపీ శిబిరానికి ఊరట కలిగించింది. జిల్లాలో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. డీసీసీబీ చైర్మన్ పదవికి మాజీ వైస్‌చైర్మన్ తుళ్లూరి బ్రహ్మయ్యతో పాటు మువ్వా విజయబాబు, బోడేపుడి రమేష్‌బాబు బరిలో ఉన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు అభ్యర్థిని ఖరారుచేసే అవకాశం ఉంది. డీసీఎంఎస్ పదవికి టీడీపీ నుంచి బోయినపల్లి సు ధాకర్, ఎగ్గడి అంజయ్య, చల్లగొండ్ల కృష్ణయ్య పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కాగా.. డీసీసీబీలో సీపీఎం తొలిసారి ప్రాతినిధ్యం కోల్పోయింది. ఈసారి కాంగ్రెస్‌తో జతకట్టి బరిలోకి దిగిన సీపీఎం.. ఘోర పరాజయం మూటగట్టుకుంది. సీపీఎం డైరెక్టర్ అభ్యర్థుల్లో ఒక్కరూ గెలవలేదు.