February 19, 2013

విజయీభవ


రైతు: చంద్రబాబు గారూ... వ్యవసాయానికి ఆరుగంటల విద్యుత్ రోజులో నాలుగు దఫాలుగా ఇస్తున్నారు. నేను ఒకేసారి ఇవ్వమని గట్టిగా అడిగితే కరెంటు ఏఈ నా ఇంటి విద్యుత్ కనెక్షన్‌ను తొలగించాడు. నేను పోరాడినా విద్యుత్ కనెక్షన్‌ను పునరుద్ధరించకపోవడంతో చివరికి ఎమ్మెల్యే ఆనందబాబు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.వృద్ధురాలు: అయ్యా... నా మనవరాలు ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసి ఆరేళ్లు అయింది. ఇప్పటివరకు ఉద్యోగం రాలేదు. మా వద్ద ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టి చదివించాం. ఒక పక్క ఉద్యోగం రాక మరోపక్క మనవరాలికి పెళ్లి చేయలేక మానసిక క్షోభను అనుభవిస్తున్నాం. గృహిణి: నేను హైదరాబాద్ నుంచి తెనాలి వరకు బస్సులో హాయిగా వచ్చాను. అక్కడి నుంచి మూల్పూరు వచ్చేసరికి నరకం కనిపించింది. అంత అధ్వాన్నంగా ఉన్నాయి రహదారులు.అలుపెరగకుండా జిల్లాలో 'వస్తున్నా... మీకోసం' పాదయాత్రతో నడక సాగిస్తోన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు అడుగడుగునా ప్రజలు ఎదురౌతూ తమ కష్టాలను ఏకరువు పెట్టుకొంటున్నారు.

పొలం పనులు చేసే కూలీల నుంచి ఉద్యోగుల వరకు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు నివేదిస్తున్నారు. మీరు సీఎం అయితేనే మా కష్టాలు తీరుతాయంటూ తమ నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్రజలకు తనకు నివేదించే సమస్యలను ఎంతో ఓర్పుగా వింటోన్న చంద్రబాబు ఎక్కడికక్కడ స్పందిస్తున్నారు. ఆయన ఇస్తున్న హామీలతో సంతోషం చెందుతూ మీకు ఓటేస్తే బాధ్యత మాది అని మాట ఇచ్చి మరీ సాగనంపుతున్నారు.సోమవారం జిల్లాలో 12వ రోజు పాదయాత్రను వేమూరు నియోజకవర్గంలోని కూచిపూడి గ్రామంలో శ్రీరామలింగేస్వారస్వామి దేవస్థానం వద్ద నుంచి చంద్రబాబు ప్రారంభించారు. దేవాలయం ఎదుట పురోహితుల దీవెనలు అందుకొన్న చంద్రబాబుకు స్థానిక మహిళలు 'విజయీభవ... దిగ్విజయీభవ' అంటూ స్వీయరచనలో రూపొందించిన గేయాన్ని ఆలపించి దీవించారు. అక్కడి నుంచి కూచిపూడి గ్రామంలోని ప్రధాన కూడలికి చేరుకొని ప్రసంగించారు.

'కూచిపూడి ఎప్పుడూ టీడీపీకి కంచుకోట... అందులో మరో ఆలోచనకు తావులేదు... గ్రామంలో ఎటు చూసినా మీ అభిమానం కనిపిస్తోంది... మీ రుణాన్ని ఎన్ని జన్మలెత్తి ఎంత సేవ చేసినా తీర్చుకోలేనిదని'' కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. కూచిపూడిలో సభకు మహిళలు పెద్ద ఎత్తున రాగా వారిని చూసి చంద్రబాబు 'ఏవమ్మా... బాగున్నారా! మిమ్నల్ని చూస్తేనే మీరు కష్టాల్లో ఉన్నారని తెలిసిపోతోంది. ఆరోజున నేను ఉచితంగా సిలిండర్లు ఇస్తే మీరు కాంగ్రెస్ వాళ్లు వచ్చి అన్నం వండి పెడతారని ఆశించి ఆ పార్టీకి ఓటేశారు. ఈ రోజున ఒక్క వంట గ్యాసే కాదు సన్నబియ్యం, నూనె, కందిపప్పు, పంచదార, ఉప్పు, ఉల్లిపాయలు ఇలా అన్ని నిత్యవసర సరుకుల ధరలు మీకు అందుబాటులో లేకుండాపోయాయి.

మీ మగవాళ్లకు పప్పేసి అన్నం పెడుతున్నారా లేక నీళ్లరసం పెడుతున్నారా? అని ప్రశ్నించారు. మీరు ఆరోజున ఏమారకుండా ఉండి ఉంటే ఈ రోజు కష్టాలు ఉండేవి కావు. హాయిగా సుఖపడాల్సిన సమయంలో కష్టాలు కొని తెచ్చుకొన్నారు.నాకు అధికారం ముఖ్యం కాదు. కష్టమైనా ఫర్వాలేదని మీతో ఉండి సమస్యలు తెలుసుకొని సంఘీభావం తెలిపేందుకే పాదయాత్రతో వచ్చానన్నారు. నాకు వ్యక్తిగతంగా కష్టాలేవి లేవు. మా అబ్బాయి బాగా చదువుకొన్నాడు. కోడల్ని కూడా పెళ్లి అయిన తర్వాత చదివిస్తున్నాం. నా భార్య 25 ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తుంటే ప్రోత్సహిస్తున్నానని చెప్పారు. చదువుకొన్న వాళ్లు డబ్బుకు అమ్ముడుపోతున్నారు ఆయారామ్... గయారామ్‌లు రాజకీయాల్లోకి వచ్చారు.

చదువుకొన్న వాళ్లు డబ్బుకు అమ్ముడు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నీతి కథలు చెప్పేవారని, ఈ రోజున నీతి గురించి మాట్లాడేవారే కరువవుతుండటమే సమస్యలకు మూలం అవుతోందన్నారు. లక్ష కోట్లు దోచుకొన్న వైఎస్‌కి లక్ష విగ్రహాలు పెట్టి ఏమి సంకేతాలిస్తారని ప్రశ్నించారు. జైల్లో ఉన్న వాళ్ల ఫోటోలను పెట్టుకొంటారో మహనీయులను ఆరాధిస్తారో మీరే తేల్చుకోవాలన్నారు.త్రివిక్రమరావు ఆదర్శం నా హయాంలో ప్రకాశం జిల్లాలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన త్రివిక్రమరావు అనే వ్యక్తి ఇంజనీరింగ్ చదివి మంచి సాఫ్టువేర్ ఉద్యోగం సాధించాడు. నేడు నెలకు రూ. లక్ష సంపాదిస్తున్నాడు. అతను వారంలో శని, ఆదివారం నా పాదయాత్రకు వ చ్చి సంఘీభావం తెలిపి వెళుతున్నాడు. అతను తన నెల జీతంలో ఇంటి అద్దె, ఖర్చులు పోను రూ. 78 వేలు పార్టీకి విరాళంగా ఇచ్చారు.

అలాంటివారు ఎంతోమంది టీడీపీపై విశ్వాసం ప్రదర్శిస్తున్నారు. ప్రజలు ఇచ్చిన విరాళాలతోనే టీడీపీ కొనసాగుతుంది తప్పా ప్రభుత్వ అవినీతి సొమ్ముతో కాదని చంద్రబాబు స్పష్టం చేశారు.చంద్రబాబు రోడ్డుకు ఇరువైపులా పచ్చని మొక్కజొన్న పొలాల మధ్యన కూచిపూడి నుంచి మూల్పురుకు పాదయాత్రను కొనసాగించారు. మధ్యా హ్నం భోజన విరామం అనంతరం మూల్పూరులో జరిగిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడి నుంచి ఎస్‌సీ కాలనీకి వెళ్లి దళిత ్రకైస్తవులను ఎస్‌సీల్లోకి చేరుస్తానని హామి ఇచ్చారు. ఆ తర్వాత పోతులమర్రి, జంపనిలో ప్రసంగించారు.