October 28, 2012

ఈద్గాలో అపచారం! బూట్లు ధరించి షర్మిల ప్రార్థనలు

ఈద్గాలో అపచారం!
బూట్లు ధరించి షర్మిల ప్రార్థనలు

 
అనంతపురం, అక్టోబర్ 28 : మరో ప్రజా ప్రస్థానం యాత్రలో వైఎస్ షర్మిల ముందు నడుస్తున్నారు. ఆ సమయంలో పాదయాత్ర అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం బడన్నపల్లి ప్రాంతం చేరుకుంది. అక్కడికి సమీపంలోనే 'ఈద్గా' ప్రార్థనా ప్రదేశం కనిపించింది. ఆ రోజు బక్రీద్ అన్న విషయం గుర్తుకు వచ్చింది. అంతే.. షర్మిల అడుగులు అటువైపు సాగాయి.

పాదయాత్ర కోసం ధరించిన బూట్లతోనే దువా (ప్రార్థన) ముగించారు. ఆ సమయంలో ఆమె వెంట వైసీపీ పార్టీకి చెందిన పలువురు మైనారిటీ నాయకులు ఉన్నా ఆమెను వారించడానికి ప్రయత్నించలేదు. వివాదం ముదరకముందే నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు గానీ, షర్మిలతో ప్రకటన చేసేందుకు గానీ వైసీపీ పార్టీ నేతలు ప్రయత్నించలేదు. తిరుమల పవిత్రతకు ఆమె అన్న, వైఎస్ జగన్ అపచారం తలపెట్టారన్న వివాదం సమసిపోకముందే,

ఆయన సోదరి దాదాపు అలాంటి వివాదంలోనే చిక్కుకోవడం గమనార్హం. నిజానికి, ఏ మతం వారైనా ఏ దేవుడిని ప్రార్థించేటప్పుడు.. చెప్పులు కానీ, బూట్లు కానీ వేసుకోరు. ఆ సంప్రదాయానికి విరుద్ధంగా షర్మిల కొందరు ముస్లింలతో కలిసి ప్రార్థన చేయడాన్ని ముస్లిం మైనారిటీ వర్గాలు తప్పుబట్టాయి. మరోసారి ముస్లిం మనోభావాలను దెబ్బతీయొద్దని టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు లాల్ జాన్ బాషా హెచ్చరించారు.

రాజకీయాలతో మతాన్ని ముడిపెట్టొద్దన్నారు. ముస్లింల మనోభావాలు దెబ్బతీశారని బేషరతుగా ఆమె క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నేత ఖలీకుల్లాఖాన్ డిమాండ్ చేశారు. కాగా అసలు వివాదమేమీ లేదన్నట్టు వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. గతంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా మత అపచారానికి పాల్పడ్డారని వాదించే ప్రయత్నమూ చేశారు. "హిందూపురం ఎమ్మెల్యే అబ్దుల్ ఘని సమక్షంలోనే గతంలో చంద్రబాబు బూట్లతోనే ఖురాన్‌ను అందుకున్నారు'' అని జిల్లా వైసీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు సాలార్‌బాషా చెప్పుకొచ్చారు.
No comments :

No comments :