October 28, 2012

( ఆదివారం మధ్యాహ్నం 27వ రోజు పాదయాత్ర ప్రారంభం) పాలమూరు నుంచి వలసలు అరికడతాం- చంద్రబాబు 28.10.2012

పాలమూరు నుంచి వలసలు అరికడతాం
ఎలాంటి కార్యక్రమాలు చేస్తే మంచిదో చెప్పండి
అవినీతి ప్రభుత్వంవల్ల పనులు జరగడంలేదు 

  తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పాలమూరు నుంచి వలసలను అరికడతామని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. పనులు లేక చాలామంది వలసలు పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకోడానికి, ప్రజల కష్టాలు స్వయంగా చూసి, మీకు అండగా ఉండేందుకు పాదయాత్ర ప్రారంభించానని ఆయన పేర్కొన్నారు.

ఒక్క రోజు విరామం తర్వాత జిల్లాలోని శెట్టి ఆత్మకూరు నుంచి ఆదివారం మ«ధ్యాహ్నం చంద్రబాబు పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. ఆ ప్రాంతంలో బాబు అడుగుపెట్టగానే మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గద్వాల ప్రమాదంలో నడుము కండరాలు స్పల్పంగా కదిలాయని, డాక్టర్లు మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారని, అయినా ఒక్కరోజే విశ్రాంతి తీసుకుని మీకోసం వచ్చానని అన్నారు.

జురాల ప్రాజెక్టు పక్కనే ఉన్న గ్రామాల్లో తాగునీటి సమస్య ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా అంటేనే పేదలు ఎక్కువగా ఉండే జిల్లా అని వ్యాఖ్యానించారు. జురాల ప్రాజెక్టుకు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న అంజయ్య పౌండేషన్ వేశారని, ఆ తర్వాత ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత దీనిని ప్రారంభించారని, నేను (చంద్రబాబునాయుడు) ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఈ ప్రాజెక్టుకు రూ. 600 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అవినీతి ప్రభుత్వం కారణంగా పనులు జరగడంలేదని ఆయన పేర్కొన్నారు.

వ్యవసాయ ఖర్చులు విపరీతంగా పెరిగాయని, పంటలకు గిట్టుబాటు ధరలులేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. పావలా వడ్డీ పేరు చెప్పి రూ. 2 వడ్డీ వసూలు చేసి మహిళలను అప్పుల పాలు చేశారని ఆరోపించారు. భవిష్యత్‌లో ఎలాంటి కార్యక్రమాలు చేస్తే మంచిదో మీరు చెప్పాలని చంద్రబాబు ప్రజలనుద్దేశించి అడిగారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం పేరుతో ప్రతి గ్రామానికి తాగునీటిని సరఫరా చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఘనత ఎన్టీఆర్‌దేనని చంద్రబాబు కొనియాడారు.
No comments :

No comments :