October 28, 2012

ఒక రోజు విరామం తరువాత నడక మొదలుపెట్టాను. అడుగేయడం మొదట్లో కష్టంగానే అనిపించింది.

.. ఒక రోజు విరామం తరువాత నడక మొదలుపెట్టాను. అడుగేయడం మొదట్లో కష్టంగానే అనిపించింది. కాలు సాగడానికి చాలాసేపు పట్టింది. మా నేతలను, డాక్టర్లను ఒప్పించి బయట పడేసరికి సూర్యుడు నడినెత్తిన ఉన్నాడు. అప్పటికీ యాత్రలో వేగం పెరగకుండా అడుగడుగునా మావాళ్లు కాళ్లకు అడ్డం పడుతూనే ఉన్నారు. "సార్.. యాత్రను ఎలాగూ మీరు పూర్తి చేస్తారు. ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా!. వేగం తగ్గినా ఫరవాలేదు. కిలోమీటర్ తక్కువా ఎక్కువా అనేదీ పట్టింపు కాదు.

చిన్నగానే వెళతాం. ఈ కొద్ది రోజుల పాటైనా మా మాట ఆలకించండి'' అంటున్న మా వాళ్లను కాదని అడుగు పెంచడం ఎప్పటిలా ఈసారి కుదరదనిపించింది. వేదిక కూలి కిందపడినప్పటి నడుం నొప్పి, మధ్య మధ్యలో "నేనున్నా'నని చెబుతోంది. దానికి కండరాల నొప్పులు కలవడం, కాళ్లకు ఒక రోజుపాటు విశ్రాంతి ఇవ్వడం, మధ్యాహ్నం నుంచి యాత్ర మొదలుపెట్టడంతో పెద్ద దూరమేమీ నడవలేకపోయాను. "సార్, కొంతకాలం ఇంతే. మీ నడక దూరం తగ్గించేశాం'' అంటున్న మా వాళ్ల ఆజ్ఞలను నవ్వుతూ పాటించక తప్పుతుందా?

తలాటున జూరాల. కానీ పొలం గానీ, పొలమారిన గొంతు గానీ తడవవు. జూరాలకు ఆరు కిలోమీటర్ల దూరంలోని శెట్టి ఆత్మకూరులో ఆ రైతును కలిసినప్పుడు.. "నేను చెప్పడం ఎందుకు సారు.. ఎదురుగ్గా కనిపిస్తుంటే'' అంటూ నన్ను తన ఆముదం పొలంలోకి తీసుకెళ్లాడు. కష్టాలను ఓర్చుకోవడం, కన్నీరు మింగేయడం అలవాటైనట్టుంది. తనను తాను తమాయించుకోడానికి తాయన్న ప్రయత్నించాడు.

"ఎంత సార్..రెండు తడులు..బంగారం పండేది'' అని చెబుతూనే నాతోపాటు మట్టిరోడ్డుపై కొద్దిదూరం నడిచాడు. ఆ తరువాత కొద్ది దూరంలోనే ఆడపడుచులు ఖాళీ బిందెలతో ఎదురుపడినప్పుడు అడక్కుండానే వాళ్ల సమస్య తెలిసిపోయింది. ఈ జిల్లాలో అడుగుపెట్టిన తొలిరోజే ప్రకటించిన 'ఎన్టీఆర్ సుజల' సాకారం కోసం నీళ్లింకిన ఇలాంటి ఎన్నో కళ్లు ఎదురు చూస్తున్నాయనిపించింది.
No comments :

No comments :