October 28, 2012

కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో వెనకబడిన వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగింది,బీసీలకు ఇంత అన్యాయమా? ...27వ రోజు పాదయాత్రలో చంద్రబాబు

బీసీలకు ఇంత అన్యాయమా?
జనాభాలో సగం ఉన్నా ఒక్కటే పదవా?
కేంద్ర కేబినెట్ కూర్పుపై చంద్రబాబు నిప్పులు
తెలంగాణకు వ్యతిరేకం కాదని పునరుద్ఘాటన

  కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో వెనకబడిన వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో 50 శాతం బీసీ జనాభా ఉండగా, ఒకరికే అవకాశం కల్పించడం ఏమిటని ప్రశ్నించారు. నాలుగు మంత్రి పదవులను కూడా ఇవ్వలేకపోయారని దుయ్యబట్టారు. తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని పునరుద్ఘాటించారు.

మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల శివారు ప్రాంతం నుంచి 'వస్తున్నా..మీ కోసం' పాదయాత్రను చంద్రబాబు ఆదివారం పునః ప్రారంభించారు. 8.8 కిలోమీటర్ల మేర నడిచారు. మధ్యాహ్నం 2.45 గంటలకు తిరిగి పాదయాత్రకు సిద్ధమైన చంద్రబాబుకు ముఖ్యనేతలు స్వాగతం పలికారు. డప్పుల మోతలు, శ్రేణుల కేరింతల మధ్య యాత్రను ఆయన పునఃప్రారంభించారు. గద్వాల మండలం చిట్టిఆత్మకూర్, ఈదుగోనిపల్లి, పెద్దపాడు గ్రామాల్లో స్థానికులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

చిట్టి ఆత్మకూర్ వద్ద మహిళలు ఖాళీ బిందెలు చూపిస్తూ చంద్రబాబుకు మొరపెట్టుకున్నారు. తమకు ఏడాది నుంచి తాగునీరు లేదని వాపోయారు. అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ సుజల పేరుతో ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తామని, రాష్ట్రంలోని అన్ని తండాలకు, పంచాయతీలకు మంచినీటిని సరఫరా చేస్తామని చంద్రబాబు వారికి హామీనిచ్చారు. "అధికారంలోకి వచ్చిన తొలిరోజు తొలి సంతకం రుణ మాఫీ ఫైలుపైనే చేస్తాను. రెండో సంతకం బెల్టు షాపుల రద్దుపై, మూడో సంతకం ఎన్టీఆర్ సుజల పథకం అమలుపై ఉంటుంద''ని పేర్కొన్నారు. "గద్వాలలో వేదిక కూలడంతో నడుము కండరాలు బిగించుకు పోయాయి.

డాక్టర్లు మూడు రోజులు విశ్రాంతి తీసుకోమన్నారు. ప్రజల ఆశీస్సులు, భగవంతుని దయవల్ల మళ్లీ నడవగలుగుతున్నాను'' అని తెలిపారు. అక్కడే ఉన్న లక్ష్మణ్ అనే నిరుద్యోగ యువకుడి మాటలు చంద్రబాబును ఆకట్టుకున్నాయి. "మీరు తెలంగాణకు మద్దతు ఇస్తే అంతకంటే అదృష్టం లేదు సార్'' అని అన్నారు. తెలంగాణకు టీడీపీ వ్యతిరేకం కాదని వందసార్లు చెప్పామని, మళ్లీ అదే చెబుతున్నానని లక్ష్మణ్‌కు ఆయన స్పష్టం చేశారు. తాగునీటి, నిరుద్యోగ సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పరిష్కరించడం లేదని నిలదీశారు. పోలవరం, ప్రాణహిత-చేవెళ్లను ఎందుకు జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడం లేదని ప్రశ్నించారు.
No comments :

No comments :