January 8, 2013



రాష్ట్రంలో ఇలాంటి గ్రామాలు కూడా ఉన్నాయా! సుబ్బక్కపల్లి, నవాబుపేట, మొగుళ్ల పల్లి గ్రామాలకు చేరుకునే రహదారులను చూసినప్పుడు విస్మయానికి గురయ్యాను. మొగుళ్ల పల్లి మండల కేంద్రం. అయినా, కనీస రోడ్డు సౌకర్యమూ లేదు. ఈ దారిలో బస్సు ఎప్పుడు వస్తుం దో ఊరి వాళ్లకు కూడా తెలియదు. జీపుల టాప్‌పై కూర్చొని నరక ద్వారాల్లాంటి ఆ రహదారులపై జనం వచ్చిపోతున్న దృశ్యాలే ఎటూ చూసినా.. నా హయాంలో ఈ ప్రాంతంలో పడిన రోడ్ల ఆనవాళ్లే కనిపించడం లేదు.

అప్పట్లో రహదారులు అద్దంగా మెరిసేవి. రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా తారురోడ్లు పలకరించేవి. పల్లెల నుంచి వాడల దాకా సిమెంటు రోడ్లు వేసిన ప్రభుత్వం మాది. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. వీళ్లొచ్చాక దోచుకుంది దాచుకోవడం తప్ప రహదారులను బాగు చేసిన దాఖలా లేదు. అద్దంలా ఉండటం దేవుడెరుగు..కనీసం రోడ్లు అని చెప్పుకోవడానికి కూడా జాడలు లేవు. నడవడమే కష్టం.

పొలం నుంచి పంట దిగుబళ్లతో బళ్లపై వచ్చేవారి అవస్థలు చెప్పనక్కర్లేదు. పెద్ద ఆస్పత్రికి వెళ్లకుండానే ప్రసవం అయిపోయిన దారుణ ఘటనలను ఆడపడుచులు చెప్పుకొని వాపోయారు. అప్పట్లో మేం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి గ్రామసడక్ యోజన లాంటి పథకాల కింద వందల కోట్ల నిధులను తీసుకొచ్చి రోడ్లకు ఖర్చుపెట్టాం. కనీసం ఉపాధి హామీ పథకం కింద అయినా ఈ ప్రభుత్వం రోడ్లను కాస్త పట్టించుకోవచ్చు కదా!

నవాబుపేట అయినా మరో పల్లె అయినా, రైతు చిత్తు అవుతూనే ఉన్నాడు. గిట్టుబాటు కాని సాగుతో చావలేక బతకలేక చితికిపోతున్నాడు. ఈ గ్రామంలో కలిసిన రైతుల్లోనూ పొలాల్లో పలకరించిన మహిళా కూలీల్లోనూ ఇదే మనోభావం వ్యక్తం అయింది. వారంతా శ్రీరాంసాగర్ కాలువలను నాకు చూపించారు. " పేరుకే కాలువ సార్..నీళ్లను చూసి తొమ్మిదేళ్లవుతోంది. ఆ తర్వాత ఈ కాలువల్లో మా కన్నీరే పారుతోంది'' అని వాళ్లంతా వాపోయారు. అయినా, సకల సహజ సంపదలు కలిగిన రాష్ట్రానికి ఈ దౌర్భాగ్యం ఏమిటో!

ఇవేం ఊళ్లు.. ఇవేం రోడ్డు!



పేదల ప్రాణం గాలిలో దీపం!
వరంగల్ ఎంజీయంకూ గ్రహణం
అధికారమిస్తే రూ. 100 కోట్లు ఇస్తాం
వరంగల్ పాదయాత్రలో చంద్రబాబు హామీ

కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో పేదవారి ప్రాణాలు గాలిలో దీపాలుగా మారాయని, వైద్యం కరువైందని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లాలో పాదయాత్రను తిమ్మాపూర్ వద్ద ఆయన ప్రారంభించారు. తిమ్మాపూర్ నుంచి గాంధీనగర్, తీగరాజుపల్లి, శ్రీనగర్, కొంకపాక, చౌటపల్లి, జమాల్‌పూర్, గుంటూరుపల్లి మీదుగా 15.5 కిలోమీటర్లు నడిచారు. సోమారం క్రాస్ రోడ్ వద్ద రాత్రి బస చేశారు. ఈ సందర్భంగా తీగరాజుపల్లిలో ప్రజలతో ఆయన ముచ్చటించారు.

"నిరుపేద ప్రజలకు కనీసం వైద్యం లభించక అర్ధంతరంగా పేదలు ప్రాణాలు వదులుతున్నారు. ఉత్తర తెలంగాణకు ఏకైక దిక్కు అయిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేక రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వెంటిలేటర్లు లేక పసిపిల్లలు ప్రాణాలు వదులుతున్నారు'' అని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హయాంలో ఎంజీఎంను వేయి పడకల ఆస్పత్రిగా అభివృద్ది చేస్తే కాంగ్రెస్ పార్టీ పాలనలో కనీస సౌకర్యాలు లేకుండా చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ఎంజీఎం ఆసుపత్రికి రూ. 100 కోట్లు కేటాయించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామన్నారు.

పీడియాట్రిక్ వార్డును హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రి స్థాయి లో అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే కాకతీయ వైద్య కళాశాలకు అదనపు సీట్లు రాకుండా పోయాయని ఆరోపించారు. పార్టీని గెలిపిస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య, యువతకు ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. విద్యార్థులకు లాప్‌టాప్, కంప్యూటర్లు అందిస్తాం. గతంలో ఆడపిల్లలకు ఇచ్చినట్టే మగపిల్లలకూ ఉచితంగా సైకిళ్లు ఇస్తాం'' అని హామీ ఇచ్చారు.

ఎస్సారెస్పీ కాలువలు మరమ్మతులు లేక పూర్తిగా దెబ్బతిన్నాయనీ, బాబ్లీతోపాటు మరో 14 ప్రాజెక్టులను మహారాష్ట్ర నిర్మించడం వల్ల ఈ కాలువల్లో నీళ్లకు బదులు రైతుల కన్నీళ్లు పారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, వ్యవసాయ కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కిరణ్ పాలనలో కనీస వైద్యం కరువు



వారికి నా రూపం తెలియదు. నేను ఎలా ఉంటానో చూడలేరు. అయినా, ఎందుకో ఇంత అ భిమానం? తీగరాజుపల్లె దాటగానే కొంతమంది గుడారం వేసుకొని నా కోసం వేచి ఉన్నారు. దగ్గరకెళ్లి చూడగా వారంతా అంధులు. బాధనిపించింది. "సార్ ఈ రోజు మా ఆరాధ్య దైవం లూయీ బ్రైల్ పుట్టినరోజు. కేక్ ఏర్పాట్లు చేశాం. మా వినతి మన్నించి ఈ కేక్‌ను కాస్త కట్ చే యరూ'' అంటూ అభ్యర్థించారు. వాళ్ల మాట కాదనలేకపోయాను. మనకు సంక్రాంతి, దసరా ఎంత ఘనమైన పండువో.. వీళ్లకు ఈ రోజు అంత పెద్ద వేడుక.

అయినా.. భగవంతుడికి ఎందుకింత వివక్ష? వాళ్లూ అందరి లాంటి మనుషులే కదా! వారికి ఇలాంటి లోపం ఎందుకు పెట్టాడా అనిపించింది. అటువంటి వారి పట్ల ప్రభుత్వాలు మరింత శ్రద్ధ పెట్టాలి. కళ్లు లేకపోయినా కాళ్లపై స్వయంశక్తితో నిలదొక్కుకునే ఆత్మస్థైర్యం అందించాలి. 'నేను ఉన్నాను' అంటూ భరోసా ఇచ్చే స్నేహితుడి పాత్రను సర్కారు తీసుకోవాలి. కానీ, వాస్తవం దీనికి పూర్తి విరుద్ధం. వాళ్లకు కొత్తగా ఒరగబెట్టేదేమీ లేకపోగా, వివిధ పథకాల కింద వారికి అందాల్సిన సాయానికీ మోకాలడ్డుతోంది. అప్పుడిలా కాదు. బ్రైల్ జన్మదినం వచ్చిదంటే వాళ్ల ముఖాల్లో సంతోషం కోసం పరితపించేవాడిని ఆ రోజును గుర్తించుకొని.. అంధ బాలబాలికలకు బ్రెయిలీ కిట్లు, సంగీత వాయిద్య పరికరాలు అందించేవాడిని. పాలకులు తలుచుకుంటే వారికి ఏ లోటూ లేకుండా చూడొద్దని నా పాలనతో నిరూపించాను. అందుకే వీళ్లు ఇప్పటికీ నా పేరుని గుర్తుంచుకున్నారనిపించింది.

ఆ రోజు నా నడకంతా చిన్న చిన్న పల్లెల మీదుగానే.. దారిలో ఎస్సారెస్పీ కాలువలను చూశా ను. నా హయాంలో చేసిన సిమెంట్ లైనింగ్ నన్ను ముచ్చటగా పలకరించింది. 15 ఏళ్లయినా అది చెక్కు చెదరలేదు. అంత నాణ్యతతో నాడు పనులు చేయించాం. కానీ, ఇప్పుదంతా ఆర్భాటమే. జలయజ్ఞం కింద నోట్లు గుమ్మరించి నాసిరకం పనులే చేస్తున్నారు. గ్రామాల్లో మహిళలు హారతి పళ్లాలతో ఎదురొచ్చారు. కష్టాల సుడిగుండంలో ఉన్నప్పటికీ నన్ను చూసినప్పుడు వాళ్ల ముఖాల్లో వెలుగు కనిపించింది. ఆ వెలుగును శాశ్వతం చేయాలన్నదే నా తాపత్రయం!

రూపం లేని అభిమానమిది!



కిరణ్‌కు కమీషన్ల కక్కుర్తి
ఈ సీఎం తీరుతో ఆంధ్రా అంధకారం
ఏప్రిల్ తర్వాత మరింత అధ్వానం
పాలించలేకపోతే గద్దె దిగి పోండి
పాదయాత్రలో చంద్రబాబు నిప్పులు

కమీషన్ల కోసం కక్కుర్తి తప్ప మరేదీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి పట్టడంలేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రం అంధకారంగా మారుతున్నా, విద్యుత్ సంక్షోభంపై కాంగ్రెస్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కబెడుతోందని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం చేతకాకపోతే గద్దె దిగిపోవాలని హెచ్చరించారు. వరంగల్ జిల్లా సోమారం వద్ద శనివారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. దేవీలాల్ తండా, పర్వతగిరి, కల్లెడ, బూర్గుమడ్ల, మేచరాజుపల్లి గ్రామాల మీదుగా 14 కిలోమీటర్లు నడిచారు.

దేవీలాల్ తండాలోని ఒక గిరిజనుడి ఇంటిని సందర్శించి, జొన్నరొట్టె ఆరగించారు. "రొట్టె ఎంతో రుచిగా ఉంది. ఈ అనుభూతిని మరిచిపోలేన''ంటూ కుటుంబ పెద్ద సీనును అభినందించారు. పర్వతగిరి మండల కేంద్రంలోగల మిర్చిపొడి తయారీ యూనిట్ ఆవరణలో డ్వాక్రా సంఘాల లీడర్లతో అరగంట పాటు ముఖాముఖిలో పాల్గొన్నారు. డ్వాక్రా సంఘాలకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని, పావలా వడ్డీ పథకం అమలు కావడం లేదని మహిళలు ఫిర్యాదు చేశారు.

టీడీపీ హయాంలో డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటైన చాలా యూనిట్లు మూతపడ్డ విషయాన్ని బాబు దృష్టికి తీసుకువచ్చారు. పర్వతగిరిలోని ఈ మిర్చిపొడి తయారీ యూనిట్ కూడా గత నాలుగేళ్ళుగా మూతపడిందని, యూనిట్ స్థాపనకు బ్యాంకు నుంచి తీసుకున్న రూ.5 లక్షల అప్పుకు రూ.12 లక్షల వడ్డీ అయిందనితెలిపారు. సభ్యుల అభ్యర్థన మేరకు ఎన్‌టీఆర్ ట్రస్ట్ ద్వారా ఈ యూనిట్ తిరిగి పనిచేసేలా చూస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అది విజయవంతమైతే తమ పార్టీ అధికారంతోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ఇతర మూతపడిన డ్వాక్రా యూనిట్ల పునరుద్దరణకు చర్యలు తీసుకుంటానని వాగ్దానం చేశారు.

అనంతరం జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీరును తూర్పారబట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతం దుర్మార్గ, అసమర్థ, అవినీతి ప్రభుత్వం నడుస్తున్నదని మండిపడ్డారు. కరెంట్ సంక్షోభం పాపం పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని విమర్శించారు. "కరెంట్ కొరత వల్ల రైతు నుంచి పారిశ్రామికవేత్తల వరకు, అన్ని వర్గాల జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయి. వ్యవసాయం కుప్పకూలింది. పరిశ్రమలు మూతపడ్డాయి. చిన్నతరహా వ్యాపారాలు అటకెక్కాయి. వాటిపై ఆధారపడ్డ లక్షలాది కుటుంబాలు రోడ్డునపడ్డాయి. సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.

చేతగానీ ఈ ప్రభుత్వానికి కొనసాగే హక్కులేదు. తక్షణమే గద్దె దిగాల''ని డిమాండ్ చేశారు. చాలినంత కరెంట్ ఇవ్వకపోగా త్వరలో వివిధ చార్జీలపేరుతో నిరుపేద ప్రజలపై మరో రూ.10 వేల కోట్ల భారాన్ని మోపబోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఏప్రిల్ నాటికి ఈ మాత్రం కరెంట్ కూడా సరఫరా అయ్యే పరిస్థితి లేదని, అప్పుడు ఆంధ్రప్రదేశ్ కాస్తా అంధకారాంధ్రప్రదేశ్‌గా మారిపోనున్నదని పేర్కొన్నారు. తమ పాలనలో రాష్ట్ర ప్రతిష్ఠ అంతర్జాతీయ స్థాయికి పెరగగా, కాంగ్రెస్ అవినీతి పాలనతో అప్రతిష్టపాలైందని తెలిపారు. టీఆర్ఎస్‌ను బ్లాక్‌మెయిల్ పార్టీగా ఆయన అభివర్ణించారు. కేసీఆర్‌కు సీట్లు, ఓట్లు, నోట్లు కావాలి తప్ప ప్రజల సమస్యలే పట్టడం లేదని మండిపడ్డారు. అనంతరం కల్లెడలోని గ్రామీణాభివృద్ధి పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో కొద్ది సేపు ముచ్చటించారు. మేచరాజుపల్లి, ఎర్రబెల్లిగూడెంల మధ్య రాత్రి బస చేశారు.

గుండెపోటుతొ అభిమాని మృతి
చంద్రబాబు పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు పర్వతగిరి మండల కేంద్రానికి తరలివచ్చిన ఓ అభిమాని గుండెపోటుతో మరణించారు. హన్మకొండ మండలం పైడిపెల్లి గ్రామానికి చెందిన జన్ను చిన్ని(35) చంద్రబాబుకు అభిమాని. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిన్ని గుండెపోటుకు గురయిన వెంటనే చుట్టుపక్కల వారు అప్రమత్తమయ్యారు.

108 వాహనానికి సమాచాం అందించారు. అది వచ్చేసరికే చిన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా విషాద వాతావరణం నెలకొంది. కార్యకర్తలు,ప్రజల సహాయంంతో ఆయన మృతదేహాన్ని స్వస్థలానికి తరలించారు. పార్టీ నుంచి రూ.లక్ష తక్షణ సాయం చంద్రబాబు ప్రకటించారు.

రాష్ట్రం చీకటవుతున్న మీనమేషాలా!



ఆరు పదులు దాటిన స్వాతంత్య్ర భారతంలో ఇప్పటికీ పల్లె గొంతుక తడవకపోవడం ఎంత దారుణం! ఈ రోజు ఎక్కువభాగం తండాల మీదుగానే సాగాను. ఎర్రబెల్లి గూడెం, కాచికల్ గ్రామాల్లో చాలామంది గిరిజన మహిళలు ఎదురొచ్చి కష్టాలు చెప్పుకున్నారు. దాదాపు అందరూ తాగునీటి సమస్యను పదేపదే నా దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. ఏది లేకపోయినా సరిపెట్టుకోవచ్చు. చివరకు గంజి లేకపోయినా నాలుగైదు రోజులు తట్టుకోవచ్చు.

కానీ, దాహం వేసినప్పుడు గుక్కెడు నీళ్లు ఇవ్వలేకపోవడం ఏమిటి? 1,50,000 కోట్ల బడ్జెట్ అని గొప్పగా చెప్పుకునే అర్హత అసలు ఈ ప్రభుత్వానికి ఉన్నదా? " సారూ..ఏమని చెప్పాలి..దూప వేస్తే తాగేందుకు గంగ లేదు. మంచినీరు లేదని గొంతు ఎండకుంటుందా? దొరికిన నీళ్లు తాగి బిమారయితే దవాఖానా ఉండదు. ఒకటీ అర ఉన్నా వైద్యులు ఉండరు. వాళ్లూ ఉన్నారనుకుంటే మందులు ఉండవు. పోనీ టౌన్‌కు వెళదామంటే ఊరికి సరైన రోడ్డే లేదు. జరూరు పడితే 108 వాహనం వచ్చిపోవడమూ కష్టమే'' అంటూ వాపోయారు.

నేను ఈ జిల్లాలో అడుగుపెట్టినప్పటినుంచీ చూస్తున్నాను..ఏ పల్లెకూ ఏ తండాకూ కచ్చా దారులు తప్ప పక్కా రోడ్లు లేవు. మంచినీటి గుంటల్లో పాచి పేరుకుపోయింది. డ్రైనేజీ లేక గుడిసెల ముందు మురుగు మడుగు కట్టడం గమనించాను. ఈ తండాలు రాష్ట్రంలో భాగమే కాదన్నట్టు పాలకుల తీరు ఉంటోంది. ఇప్పుడే ఇలా ఉంటే వేసవిలో ఇంకెంత దారుణంగా ఉంటుందో! దీన్ని దృష్టిలో ఉంచుకొనే ఎన్టీఆర్ సుజల పథకం ప్రకటించాను. రైతు రుణాల మాఫీ, బెల్టు షాపుల ఎత్తివేత తరువాత ఈ అంశానికే నా ప్రాధాన్యం!

దారిపొడవునా కులసంఘాలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు నాతో పాటు నడిచి సంఘీభావం తెలిపాయి. వారి అభిమానం వెల కట్టలేనిది. మహిళలు బోనాలతోనూ, గీత కార్మికులు మోకులతోనూ, మత్స్యకారులు వలలతోనూ, గొర్రెల కాపరులు గొర్రె పిల్లలతోనూ నాకు స్వాగతం పలికారు. వీరందరికి నేనెంత రుణపడిపోతున్నాను!

గుక్కెడు గంగ లేని తండాలెన్నో!