January 8, 2013

ఎమ్మేల్యే వినయ్ తీరు మార్చుకో..





తెలంగాణ అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టమైన వైఖరి ప్రకటించినా, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ విమర్శించడం సరి కాదని టీడీపీ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు సిరిల్ లారెన్స్ అన్నారు. చంద్రబాబు పాదయాత్రలో పాల్గొనేందుకు కాజీపేటకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఆదివారం బయలుదేరి వెళ్ళారు. వాహనాల ర్యాలీని లారెన్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినయ్‌భాస్కర్ గత ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో ఎమ్మెల్యేగా గెలిచారని, ఆయన కుటుంబం ఎదుగుదలకు తెలుగుదేశం పార్టీ పునాదిగా ఉన్నదనే విషయాన్ని మరిచి పోవద్దని హితవు పలికారు.

ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి పశ్చిమ నియోజకవర్గంలో వినయ్ చేసిన అభివృద్ధి శూన్యమని విమరించారు. ఎన్నికలకు ముందు కాజీపేట ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందే గాక, ఇప్పుడు మళ్ళీ బస్తీబాట పేరుతో పర్యటించడం సిగ్గు చేటని అన్నారు. కాజీపేట ప్రాంత ప్రధాన సమస్యలైన బస్టాండ్, చౌరస్తా విస్తరణ, విద్యానగర్ స్మశానవాటిక, బ్రిడ్జి విస్తరణ అంశాలపై ఎలాంటి కృషి చేయడం లేదని, కాజీపేట జంక్షన్ డివిజన్ స్థాయికి ఎదగకపోవడం, మంజూరైన వ్యాగన్ షెడ్ పనుల ప్రారంభంలో తీవ్ర జాప్యం.. ఇలా అనేక సమస్యలపై ఎమ్మెల్యే వినయ్ చేష్టలుడిగి చూస్తున్నారని ధ్వజమెత్తారు.

ఈ కార్యక్రమంలో సిలువేరు విజయభాస్కర్, మతిన్, దుప్పటి శివకుమార్, శోభనబోయిన భిక్షపతి, ఫీటర్ గ్జేవియర్, గంధశ్రీ కిరణకుమార్, ఎండి.ఖాజా, నాగరాజు, రాంసింగ్, సాదినేని రవి, ఎండి.షబీర్, 34వ డివిజన్ నుంచి తరలివెళ్ళిన వారిలో జిల్లా కార్యవర్గ సభ్యుడు మర్యాల కృష్ణ, గొర్రెల కాపర్ల సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల కేదారి యాదవ్, డివిజన్ అధ్యక్షులు పెసరు రాజు, దావ సుధాకర్, తదితరులు ఉన్నారు.