January 8, 2013

30 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు నాడు చమరగీతం

నాడు అన్న.. నేడు చంద్రన్న... 9/1 అనుబంధం
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం'వస్తున్నా మీకోసం'లో ఇప్పుడు కీలక ఘట్టం
వంద రోజులకు చేరుకుంటున్న బాబు యాత్ర

జనవరి 9.. టీడీపీ చరిత్రలో మరుపురాని తేదీ.
కీలక ఘట్టాలకు సాక్షి. అప్పటి ఎన్టీఆర్.. ఇప్పటి
చంద్రబాబులతో ముడిపడిన ఆసక్తికరమైన తేదీ ఇది.

రాష్ట్రంలో కాంగ్రెస్ 30ఏళ్ల పాలనకు చరమగీతం పాడిన టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు 1983 జనవరి 9న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జనవరి ఐదున జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించినప్పటికీ.. తొమ్మిది ఆయన ఇష్ట సంఖ్య కావడంతో నాలుగు రోజుల తర్వాత 9న బాధ్యతలు స్వీకరించారు. అంతేకాదు, రాజ్‌భవన్‌లో కాకుండా బహిరంగ వేదికపై ప్రజల సమక్షంలో ప్రమాణస్వీకారోత్సవం నిర్వహించి కొత్త సంప్రదాయానికి ఎన్టీఆర్ నాంది పలికారు.

రాష్ట్ర చరిత్రలో తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా కూడా ఘనత సాధించారు. మళ్లీ సరిగ్గా 30ఏళ్లకు ఆ పార్టీ చరిత్రలో మరో ఆసక్తికర ఘట్టం చోటు చేసుకోబోతోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర జనవరి 9 నాటికి వంద రోజులు పూర్తి చేసుకోనుంది. అక్టోబర్ రెండో తేదీన ఆయన అనంతపురం జిల్లా హిందూపురంలో పాదయాత్రను మొదలుపెట్టారు. సరిగ్గా వందో రోజున ఆయన తొమ్మిది జిల్లాల్లో పర్యటన పూర్తి చేసుకొని ఖమ్మంలో యాత్ర ప్రారంభించనున్నారు. ఇది యాదృచ్ఛికమేనని, దీని గురించి ముందుగా ఏమీ అనుకోలేదని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో భారీ స్థూపాన్ని నిర్మిస్తున్నారు.

ముస్తాబవుతున్న మాదిరిపురం
నిజానికి చంద్రబాబు నాయుడు మంగళవారం రాత్రే ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించనున్నారు. అయితే తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం గ్రామంలోని మిషన్ హైస్కూల్‌లో బసచేసి బుధవారం నుంచి యాత్ర మొదలుపెడతారు. వందో రోజు యాత్ర నేప«థ్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడానికి పార్టీ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి.

మాదిరిపురం గ్రామాన్ని ముస్తాబు చేస్తున్నాయి. మిషన్ హైస్కూల్ ప్రాంగణంలోనే బుధవారం టీడీపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరగనుంది. సహకార, స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యుత్తు, బస్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై ఆందోళన కార్యక్రమాల రూపకల్పనపై నేతలు చర్చించనున్నారు. ఇక పాదయాత్రలో ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యలపై చర్చించి, దానికనుగుణంగా కార్యక్రమాలను రూపొందించే అవకాశం ఉంది.

ఈ సమావేశం అనంతరం మధ్యాహ్నం ప్రస్తుతం ఇక్కడ శరవేగంగా నిర్మిస్తున్న వంద అడుగుల స్థూపాన్ని చంద్రబాబు ఆవిష్కరిస్తారు. శిఖరంపై పార్టీ గుర్తును ఏర్పాటుచేస్తున్నారు. స్థూపావిష్కరణ అనంతరం వంద రోజుల వేడుకను పురస్కరించుకుని బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. చంద్రబాబుతోపాటు ముఖ్యనేతలు ఈ సభలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత జిల్లాలో పాదయాత్ర ప్రారంభమవుతుంది.

నల్లగొండ, గుంటూరు పర్యటన రద్దు
నల్లగొండ, గుంటూరు జిల్లాల్లో చంద్రబాబు పాదయాత్ర రద్దయింది. ఖమ్మం జిల్లా మీదుగా నల్లగొండలో ప్రవేశించి అక్కడి నుంచి గుంటూరులో పాదయాత్రకు మార్గాన్ని ఖరారు చేయాలని ఆ పార్టీ వర్గాలు తొలుత భావించాయి. దీని ప్రకారం నల్లగొండ జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో పర్యటించి పులిచింతల ఆనకట్ట మీదుగా గుంటూరులోకి ప్రవేశించాల్సి ఉంది.

కానీ ఈ మార్గంలో 40 కిలోమీటర్లకుపైగా అటవీప్రాంతం ఉండటంతో ఇది యాత్రకు అనువైన రూటు కాదని పార్టీ నేతలు భావించారు. దీంతో నల్లగొండ, గుంటూరు జిల్లాల పర్యటన పూర్తిగా రద్దయింది. ఆయన ఖమ్మం నుంచి నేరుగా కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తారు. 15న ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి నుంచి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోకి చంద్రబాబు అడుగుపెడతారు. ఈసారి సంక్రాంతి పండుగను కూడా ఆయన తెలంగాణలోనే జరుపుకొంటున్నారు.

ఆయన దసరాకు తెలంగాణలో.. సంక్రాంతికి కోస్తాలో ఉంటారని పార్టీ వర్గాలు మొదట అనుకున్నాయి. కానీ పాదయాత్రలో జాప్యం వల్ల సంక్రాంతి కూడా తెలంగాణలోనే వచ్చేసింది. ఈసారి నాగార్జునసాగర్ కాల్వల్లో నీరు రాకపోవడంతో ముదిగొండ మండలంలో ఈ ఏడాది పొలాలు బీళ్లు పడి ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో ఈసారి పెద్దగా సంక్రాంతి పండుగ సంబరం లేదు.