January 8, 2013

కిరణ్ పాలనలో కనీస వైద్యం కరువు



పేదల ప్రాణం గాలిలో దీపం!
వరంగల్ ఎంజీయంకూ గ్రహణం
అధికారమిస్తే రూ. 100 కోట్లు ఇస్తాం
వరంగల్ పాదయాత్రలో చంద్రబాబు హామీ

కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో పేదవారి ప్రాణాలు గాలిలో దీపాలుగా మారాయని, వైద్యం కరువైందని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లాలో పాదయాత్రను తిమ్మాపూర్ వద్ద ఆయన ప్రారంభించారు. తిమ్మాపూర్ నుంచి గాంధీనగర్, తీగరాజుపల్లి, శ్రీనగర్, కొంకపాక, చౌటపల్లి, జమాల్‌పూర్, గుంటూరుపల్లి మీదుగా 15.5 కిలోమీటర్లు నడిచారు. సోమారం క్రాస్ రోడ్ వద్ద రాత్రి బస చేశారు. ఈ సందర్భంగా తీగరాజుపల్లిలో ప్రజలతో ఆయన ముచ్చటించారు.

"నిరుపేద ప్రజలకు కనీసం వైద్యం లభించక అర్ధంతరంగా పేదలు ప్రాణాలు వదులుతున్నారు. ఉత్తర తెలంగాణకు ఏకైక దిక్కు అయిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేక రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వెంటిలేటర్లు లేక పసిపిల్లలు ప్రాణాలు వదులుతున్నారు'' అని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హయాంలో ఎంజీఎంను వేయి పడకల ఆస్పత్రిగా అభివృద్ది చేస్తే కాంగ్రెస్ పార్టీ పాలనలో కనీస సౌకర్యాలు లేకుండా చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ఎంజీఎం ఆసుపత్రికి రూ. 100 కోట్లు కేటాయించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామన్నారు.

పీడియాట్రిక్ వార్డును హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రి స్థాయి లో అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే కాకతీయ వైద్య కళాశాలకు అదనపు సీట్లు రాకుండా పోయాయని ఆరోపించారు. పార్టీని గెలిపిస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య, యువతకు ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. విద్యార్థులకు లాప్‌టాప్, కంప్యూటర్లు అందిస్తాం. గతంలో ఆడపిల్లలకు ఇచ్చినట్టే మగపిల్లలకూ ఉచితంగా సైకిళ్లు ఇస్తాం'' అని హామీ ఇచ్చారు.

ఎస్సారెస్పీ కాలువలు మరమ్మతులు లేక పూర్తిగా దెబ్బతిన్నాయనీ, బాబ్లీతోపాటు మరో 14 ప్రాజెక్టులను మహారాష్ట్ర నిర్మించడం వల్ల ఈ కాలువల్లో నీళ్లకు బదులు రైతుల కన్నీళ్లు పారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, వ్యవసాయ కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.