January 8, 2013

ఇవేం ఊళ్లు.. ఇవేం రోడ్డు!



రాష్ట్రంలో ఇలాంటి గ్రామాలు కూడా ఉన్నాయా! సుబ్బక్కపల్లి, నవాబుపేట, మొగుళ్ల పల్లి గ్రామాలకు చేరుకునే రహదారులను చూసినప్పుడు విస్మయానికి గురయ్యాను. మొగుళ్ల పల్లి మండల కేంద్రం. అయినా, కనీస రోడ్డు సౌకర్యమూ లేదు. ఈ దారిలో బస్సు ఎప్పుడు వస్తుం దో ఊరి వాళ్లకు కూడా తెలియదు. జీపుల టాప్‌పై కూర్చొని నరక ద్వారాల్లాంటి ఆ రహదారులపై జనం వచ్చిపోతున్న దృశ్యాలే ఎటూ చూసినా.. నా హయాంలో ఈ ప్రాంతంలో పడిన రోడ్ల ఆనవాళ్లే కనిపించడం లేదు.

అప్పట్లో రహదారులు అద్దంగా మెరిసేవి. రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా తారురోడ్లు పలకరించేవి. పల్లెల నుంచి వాడల దాకా సిమెంటు రోడ్లు వేసిన ప్రభుత్వం మాది. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. వీళ్లొచ్చాక దోచుకుంది దాచుకోవడం తప్ప రహదారులను బాగు చేసిన దాఖలా లేదు. అద్దంలా ఉండటం దేవుడెరుగు..కనీసం రోడ్లు అని చెప్పుకోవడానికి కూడా జాడలు లేవు. నడవడమే కష్టం.

పొలం నుంచి పంట దిగుబళ్లతో బళ్లపై వచ్చేవారి అవస్థలు చెప్పనక్కర్లేదు. పెద్ద ఆస్పత్రికి వెళ్లకుండానే ప్రసవం అయిపోయిన దారుణ ఘటనలను ఆడపడుచులు చెప్పుకొని వాపోయారు. అప్పట్లో మేం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి గ్రామసడక్ యోజన లాంటి పథకాల కింద వందల కోట్ల నిధులను తీసుకొచ్చి రోడ్లకు ఖర్చుపెట్టాం. కనీసం ఉపాధి హామీ పథకం కింద అయినా ఈ ప్రభుత్వం రోడ్లను కాస్త పట్టించుకోవచ్చు కదా!

నవాబుపేట అయినా మరో పల్లె అయినా, రైతు చిత్తు అవుతూనే ఉన్నాడు. గిట్టుబాటు కాని సాగుతో చావలేక బతకలేక చితికిపోతున్నాడు. ఈ గ్రామంలో కలిసిన రైతుల్లోనూ పొలాల్లో పలకరించిన మహిళా కూలీల్లోనూ ఇదే మనోభావం వ్యక్తం అయింది. వారంతా శ్రీరాంసాగర్ కాలువలను నాకు చూపించారు. " పేరుకే కాలువ సార్..నీళ్లను చూసి తొమ్మిదేళ్లవుతోంది. ఆ తర్వాత ఈ కాలువల్లో మా కన్నీరే పారుతోంది'' అని వాళ్లంతా వాపోయారు. అయినా, సకల సహజ సంపదలు కలిగిన రాష్ట్రానికి ఈ దౌర్భాగ్యం ఏమిటో!