January 8, 2013

రాష్ట్రం చీకటవుతున్న మీనమేషాలా!



కిరణ్‌కు కమీషన్ల కక్కుర్తి
ఈ సీఎం తీరుతో ఆంధ్రా అంధకారం
ఏప్రిల్ తర్వాత మరింత అధ్వానం
పాలించలేకపోతే గద్దె దిగి పోండి
పాదయాత్రలో చంద్రబాబు నిప్పులు

కమీషన్ల కోసం కక్కుర్తి తప్ప మరేదీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి పట్టడంలేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రం అంధకారంగా మారుతున్నా, విద్యుత్ సంక్షోభంపై కాంగ్రెస్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కబెడుతోందని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం చేతకాకపోతే గద్దె దిగిపోవాలని హెచ్చరించారు. వరంగల్ జిల్లా సోమారం వద్ద శనివారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. దేవీలాల్ తండా, పర్వతగిరి, కల్లెడ, బూర్గుమడ్ల, మేచరాజుపల్లి గ్రామాల మీదుగా 14 కిలోమీటర్లు నడిచారు.

దేవీలాల్ తండాలోని ఒక గిరిజనుడి ఇంటిని సందర్శించి, జొన్నరొట్టె ఆరగించారు. "రొట్టె ఎంతో రుచిగా ఉంది. ఈ అనుభూతిని మరిచిపోలేన''ంటూ కుటుంబ పెద్ద సీనును అభినందించారు. పర్వతగిరి మండల కేంద్రంలోగల మిర్చిపొడి తయారీ యూనిట్ ఆవరణలో డ్వాక్రా సంఘాల లీడర్లతో అరగంట పాటు ముఖాముఖిలో పాల్గొన్నారు. డ్వాక్రా సంఘాలకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని, పావలా వడ్డీ పథకం అమలు కావడం లేదని మహిళలు ఫిర్యాదు చేశారు.

టీడీపీ హయాంలో డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటైన చాలా యూనిట్లు మూతపడ్డ విషయాన్ని బాబు దృష్టికి తీసుకువచ్చారు. పర్వతగిరిలోని ఈ మిర్చిపొడి తయారీ యూనిట్ కూడా గత నాలుగేళ్ళుగా మూతపడిందని, యూనిట్ స్థాపనకు బ్యాంకు నుంచి తీసుకున్న రూ.5 లక్షల అప్పుకు రూ.12 లక్షల వడ్డీ అయిందనితెలిపారు. సభ్యుల అభ్యర్థన మేరకు ఎన్‌టీఆర్ ట్రస్ట్ ద్వారా ఈ యూనిట్ తిరిగి పనిచేసేలా చూస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అది విజయవంతమైతే తమ పార్టీ అధికారంతోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ఇతర మూతపడిన డ్వాక్రా యూనిట్ల పునరుద్దరణకు చర్యలు తీసుకుంటానని వాగ్దానం చేశారు.

అనంతరం జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీరును తూర్పారబట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతం దుర్మార్గ, అసమర్థ, అవినీతి ప్రభుత్వం నడుస్తున్నదని మండిపడ్డారు. కరెంట్ సంక్షోభం పాపం పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని విమర్శించారు. "కరెంట్ కొరత వల్ల రైతు నుంచి పారిశ్రామికవేత్తల వరకు, అన్ని వర్గాల జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయి. వ్యవసాయం కుప్పకూలింది. పరిశ్రమలు మూతపడ్డాయి. చిన్నతరహా వ్యాపారాలు అటకెక్కాయి. వాటిపై ఆధారపడ్డ లక్షలాది కుటుంబాలు రోడ్డునపడ్డాయి. సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.

చేతగానీ ఈ ప్రభుత్వానికి కొనసాగే హక్కులేదు. తక్షణమే గద్దె దిగాల''ని డిమాండ్ చేశారు. చాలినంత కరెంట్ ఇవ్వకపోగా త్వరలో వివిధ చార్జీలపేరుతో నిరుపేద ప్రజలపై మరో రూ.10 వేల కోట్ల భారాన్ని మోపబోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఏప్రిల్ నాటికి ఈ మాత్రం కరెంట్ కూడా సరఫరా అయ్యే పరిస్థితి లేదని, అప్పుడు ఆంధ్రప్రదేశ్ కాస్తా అంధకారాంధ్రప్రదేశ్‌గా మారిపోనున్నదని పేర్కొన్నారు. తమ పాలనలో రాష్ట్ర ప్రతిష్ఠ అంతర్జాతీయ స్థాయికి పెరగగా, కాంగ్రెస్ అవినీతి పాలనతో అప్రతిష్టపాలైందని తెలిపారు. టీఆర్ఎస్‌ను బ్లాక్‌మెయిల్ పార్టీగా ఆయన అభివర్ణించారు. కేసీఆర్‌కు సీట్లు, ఓట్లు, నోట్లు కావాలి తప్ప ప్రజల సమస్యలే పట్టడం లేదని మండిపడ్డారు. అనంతరం కల్లెడలోని గ్రామీణాభివృద్ధి పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో కొద్ది సేపు ముచ్చటించారు. మేచరాజుపల్లి, ఎర్రబెల్లిగూడెంల మధ్య రాత్రి బస చేశారు.

గుండెపోటుతొ అభిమాని మృతి
చంద్రబాబు పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు పర్వతగిరి మండల కేంద్రానికి తరలివచ్చిన ఓ అభిమాని గుండెపోటుతో మరణించారు. హన్మకొండ మండలం పైడిపెల్లి గ్రామానికి చెందిన జన్ను చిన్ని(35) చంద్రబాబుకు అభిమాని. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిన్ని గుండెపోటుకు గురయిన వెంటనే చుట్టుపక్కల వారు అప్రమత్తమయ్యారు.

108 వాహనానికి సమాచాం అందించారు. అది వచ్చేసరికే చిన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా విషాద వాతావరణం నెలకొంది. కార్యకర్తలు,ప్రజల సహాయంంతో ఆయన మృతదేహాన్ని స్వస్థలానికి తరలించారు. పార్టీ నుంచి రూ.లక్ష తక్షణ సాయం చంద్రబాబు ప్రకటించారు.