January 8, 2013

సీఎంకి కరెంట్ కష్టం తెలియదు.. తెలుసుకోడు!





అర్థం చేసుకోవాలేగానీ ప్రజలనిలా బాధిస్తాడా!
ఆయన అసమర్థత వల్లే రాష్ట్రానికి కష్టాలు

బొగ్గు కేటాయింపుల్లో రూ.400 కోట్లు తిన్నారు
అస్మదీయ కాంట్రాక్టర్లకు వేల కోట్ల రాయితీలు
కిరణ్‌పై చంద్రబాబు నిప్పులు
దొంగ దారుల్లో ప్రజలపై రూ.28 వేల కోట్ల భారం

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అసమర్థత, అవగాహనా రాహిత్యమే రాష్ట్రంలో కరెంట్ సంక్షోభానికి ప్రధాన కారణమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. "ఈయనకు కరెంట్ సమస్య అర్థం కాదు. అర్థం చేసుకునేందుకూ ప్రయత్నించడు. తెలియకుంటే తెలుసుకోవాలి గానీ ప్రజలనిలా బాధపెట్టడం ఎందుకు?'' అని సూటిగా ప్రశ్నించారు. కరెంట్ సరిగా ఇవ్వడం కూడా చేతగాని కిరణ్‌కు ఓటు అడిగే హక్కులేద'ని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పాదకత, దానికోసం పెట్టిన పెట్టుబడులు, సరఫరా, అవసరాలు తదితర అంశాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం ఎర్రబెల్లిగూడెం వద్ద  ఆయన పాదయాత్ర ప్రారంభించారు. మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్రను ప్రారంభించారు. ఎర్రబెల్లిగూడెం, కాచికల్, నెల్లికుదురు గ్రామాల మీదుగా 14.5 కిలోమీటర్లు నడిచారు. ఈ సందర్భంగా వివిధ వృత్తుల వారితో మాట్లాడారు. మార్గ మధ్యలో ఒక రజకుని లాండ్రీ షాపునకు వెళ్ళి ఇస్త్రీ చేశారు. దారి పక్కనే ఉన్న చేతి పంపునుకొట్టారు. తండాల్లో కలిసిన లంబాడాలపై వరాల వాన కురిపించారు.

అమ్మాయిల పెళ్లి ఖర్చుల కింద రూ. 50వేలు ఇస్తామని వాగ్దానం చేశారు. లంబాడాలకు ప్రత్యేకంగా డీఎస్సీ నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. గిరిజనుల బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయిస్తానన్నారు. వారి సంక్షేమానికి ప్రత్యేకంగా ఒక ఎస్టీ కమిషన్‌ను నియమిస్తానని, ఎటువంటి పూచీకత్తు లేకుండా రూ. 5 లక్షల మేరకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తానని, గిరిజన పూజారులకు నెలకు రూ. 5వేల గౌరవ వేతనం ఇస్తానని, గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.

లంబాడాలకు ఐటీడీ ఏ మాదిరిగా ప్రత్యేక ఏజెన్సీనీ ఏర్పాటు చేస్తానని చెప్పారు. తండాల్లో రోడ్లు, రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తానన్నారు. నెల్లికుదురు దాటిన తర్వాత ఆకేరువాగు బ్రిడ్జి వద్ద బాబు రాత్రి బస చేశారు. అంతకుముందు.. ఎర్రబెల్లిగూడెంలో వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ సీఎం కిరణ్‌పై ఘాటైన విమర్శలు చేశారు. బొగ్గు కేటాయింపుల్లో కిరణ్ రూ. 400 కోట్లను కోట్టేశారని ఆరోపించారు. తనకు ప్రయోజనం చేకూర్చిన కాంట్రాక్టు కంపెనీలకు అప్పనంగా మరో రూ. 4 వేల కోట్ల మేరకు రాయితీలను ఇచ్చాడన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో ప్రజలపై రూ. 28 వేల కోట్ల మేర దొంగ దారుల్లో భారం మోపిందన్నారు. " ప్రజలు నమ్మి కాంగ్రెస్‌కు అధికారం కట్టపెడితే రోజుకో రూపంలో పన్నుల భారం మోపుతున్నారు. సంచిలో డబ్బులు పెట్టుకొని నిత్యావసర వస్తువుల ధరలను కొనుగోలు చేస్తే జోలెలో వస్తువులుపెట్టుకోవాల్సిన దుస్థితి. ఇప్పుడు కొత్తగా విద్యుత్ చార్జీలు, రిజిస్ట్రేషన్ల ఫీజులు, వాహనాల ఫీజులు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నార''ని ఆవేదన వ్యక్తం చేశారు.

ఖమ్మంలో ఈనెల 9వ తేదీన జరిగే పార్టీ విస్త­ృత స్థాయి సమావేశంలో కరెంట్ సమస్యపై లోతుగా చర్చించనున్నట్టు చెప్పారు. ప్రభుత్వం మెడలు వంచి కరెంట్ చార్జీలు తగ్గించేలా ఆందోళన కార్యక్రమాలకు ఈ సమావేశంలో రూపకల్పన చేయనున్నట్టు తెలిపారు. కాగా, భూస్వామ్య, పెత్తందారి పార్టీగా టీఆర్ఎస్‌ను ఆయన దుయ్యబట్టారు. " అఖిలపక్ష సమావేశానికి మా పార్టీ వెనుకబడిన తరగతికి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చెరో ప్రతినిధిని పంపాం. కానీ, టీఆర్ఎస్ నుంచి మాత్రం ఇద్దరూ అగ్రవర్ణాలవారే హాజరయ్యారు'' అని గుర్తుచేశారు.

మాటలు మీకు, డబ్బులు మాకు అన్నట్టు ఆ పార్టీ తీరు ఉన్నదని ఆక్షేపించారు. " ఏర్పడిన నాటి నుంచి టీఆర్ఎస్ చేసిందేమిటి? ఎవరిని ఉద్ధరించింది? తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డంపెట్టుకొని డబ్బులు సంపాదించడం తప్ప కేసీఆర్‌కు మరొకటి తెలియదు. ధరలు పెరిగినా పట్టించుకోడు. పంటలకు గిట్టుబాటు ధర లభించకపోయినా స్పందించడు'' అని కేసీఆర్‌ను తూర్పారబట్టారు. డబ్బుల పంపకం దగ్గర విడిపోయారు కానీ రాష్ట్రాన్ని దోచుకోవడంలో కాంగ్రెస్, వైసీపీ ఒక్కటేనన్నారు.