January 8, 2013

రూపం లేని అభిమానమిది!



వారికి నా రూపం తెలియదు. నేను ఎలా ఉంటానో చూడలేరు. అయినా, ఎందుకో ఇంత అ భిమానం? తీగరాజుపల్లె దాటగానే కొంతమంది గుడారం వేసుకొని నా కోసం వేచి ఉన్నారు. దగ్గరకెళ్లి చూడగా వారంతా అంధులు. బాధనిపించింది. "సార్ ఈ రోజు మా ఆరాధ్య దైవం లూయీ బ్రైల్ పుట్టినరోజు. కేక్ ఏర్పాట్లు చేశాం. మా వినతి మన్నించి ఈ కేక్‌ను కాస్త కట్ చే యరూ'' అంటూ అభ్యర్థించారు. వాళ్ల మాట కాదనలేకపోయాను. మనకు సంక్రాంతి, దసరా ఎంత ఘనమైన పండువో.. వీళ్లకు ఈ రోజు అంత పెద్ద వేడుక.

అయినా.. భగవంతుడికి ఎందుకింత వివక్ష? వాళ్లూ అందరి లాంటి మనుషులే కదా! వారికి ఇలాంటి లోపం ఎందుకు పెట్టాడా అనిపించింది. అటువంటి వారి పట్ల ప్రభుత్వాలు మరింత శ్రద్ధ పెట్టాలి. కళ్లు లేకపోయినా కాళ్లపై స్వయంశక్తితో నిలదొక్కుకునే ఆత్మస్థైర్యం అందించాలి. 'నేను ఉన్నాను' అంటూ భరోసా ఇచ్చే స్నేహితుడి పాత్రను సర్కారు తీసుకోవాలి. కానీ, వాస్తవం దీనికి పూర్తి విరుద్ధం. వాళ్లకు కొత్తగా ఒరగబెట్టేదేమీ లేకపోగా, వివిధ పథకాల కింద వారికి అందాల్సిన సాయానికీ మోకాలడ్డుతోంది. అప్పుడిలా కాదు. బ్రైల్ జన్మదినం వచ్చిదంటే వాళ్ల ముఖాల్లో సంతోషం కోసం పరితపించేవాడిని ఆ రోజును గుర్తించుకొని.. అంధ బాలబాలికలకు బ్రెయిలీ కిట్లు, సంగీత వాయిద్య పరికరాలు అందించేవాడిని. పాలకులు తలుచుకుంటే వారికి ఏ లోటూ లేకుండా చూడొద్దని నా పాలనతో నిరూపించాను. అందుకే వీళ్లు ఇప్పటికీ నా పేరుని గుర్తుంచుకున్నారనిపించింది.

ఆ రోజు నా నడకంతా చిన్న చిన్న పల్లెల మీదుగానే.. దారిలో ఎస్సారెస్పీ కాలువలను చూశా ను. నా హయాంలో చేసిన సిమెంట్ లైనింగ్ నన్ను ముచ్చటగా పలకరించింది. 15 ఏళ్లయినా అది చెక్కు చెదరలేదు. అంత నాణ్యతతో నాడు పనులు చేయించాం. కానీ, ఇప్పుదంతా ఆర్భాటమే. జలయజ్ఞం కింద నోట్లు గుమ్మరించి నాసిరకం పనులే చేస్తున్నారు. గ్రామాల్లో మహిళలు హారతి పళ్లాలతో ఎదురొచ్చారు. కష్టాల సుడిగుండంలో ఉన్నప్పటికీ నన్ను చూసినప్పుడు వాళ్ల ముఖాల్లో వెలుగు కనిపించింది. ఆ వెలుగును శాశ్వతం చేయాలన్నదే నా తాపత్రయం!