May 27, 2013

టీడీపీ మళ్లీ జై తెలంగాణ నేడు తీర్మానం ప్రవేశపెట్టనున్న దయాకర్‌


ప్రణబ్‌ కమిటీ లేఖకు కట్టుబడి ఉంటామని స్పష్టీకరణ
ఇటీవలి అఖిలపక్ష బేటీలో ఇచ్చిన లేఖను ప్రస్తావించనున్న టీడీపీ
టీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టే వ్యూహం
కడియం వ్యాఖ్యలను చూపించే యత్నం
పార్టీ వైఖరిని ప్రశంసించిన టీ కాంగ్రెస్‌ నేతల ప్రస్తావన
గతంలో కేసీఆర్‌ వ్యాఖ్యలనూ ప్రస్తావించనున్న దయాకర్‌
మళ్లీ తెరపైకి రఘునందన్‌ ఆరోపణలు

తెలంగాణ అంశంలో తనపై టీఆర్‌ఎస్‌ నుంచి ఎదురవుతున్న దాడిని తిప్పికొట్టేందుకు తెలుగుదేశం పార్టీ మహానాడును వేదిక చేసుకోనుంది. తెలంగాణకు తానే అడ్డంకి అని, టీడీపీ లేఖ ఇస్తే తెలంగాణ వచ్చేస్తుందన్న ట్లుగా ప్రచారం చేస్తున్న టీఆర్‌ఎస్‌కు చెక్‌ చెప్పడం తోపాటు, తెలంగాణపై తన చిత్తశుద్ధిని చాటుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగా మహానాడు రెండవ రోజున తెలంగాణపై గతంలో చాటిన తన చిత్తశుద్ధి, ఇచ్చిన లేఖలు ప్రస్తావించి, వాటికి కట్టుబడి ఉందని తీర్మానం చేయనుంది. పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు దీనిపై తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. తెలుగుదేశం పార్టీని తెలంగాణ అంశంతో దెబ్బతీయాలని ప్రయత్నిస్తోన్న టీఆర్‌ఎస్‌పై ఎదురుదాడికి మహానాడు వేదిక కానుంది. ఆ సందర్భంగా గతంలో కేంద్రమంత్రి షిండే నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖ, అంతకంటే ముందు ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖలను ప్రముఖంగా ప్రస్తావించనుంది.

సమావేశం తర్వాత షిండే మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిందని చేసిన వ్యాఖ్యలతో పాటు, సమావేశం ముగిసిన తర్వాత పార్టీ ప్రతినిధిగా హాజరయిన కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలను కూడా మహానాడు వేదిక మీద నుంచే ప్రముఖంగా ప్రస్తావించనున్నారు. ఆ తర్వాత కడియం శ్రీహరి వివిధ చానళ్లు, చర్చావేదికలో పాల్గొని చేసిన వ్యాఖ్యలను కూడా తెలంగాణ ప్రజలకు ఎర్రబెల్లి గుర్తు చేయనున్నారు. ఆ సందర్భంగా టీ కాంగ్రెస్‌ ఎంపీలు తెలుగుదేశం పార్టీ విధానాన్ని ప్రశంసించిన వైనాన్ని ప్రస్తావించనున్నారు. దీనితో అటు కడియంను, తమ పార్టీ నేతలపై వల విసరడంతోపాటు, తెలంగాణలో తన పార్టీని దోషిగా నిలబెట్టేందుకు టీఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రయత్నాలకు ఒకేసారి చెక్‌ చెప్పాలని భావిస్తున్నారు.

ప్రణబ్‌ కమిటీకి ఇచ్చిన లేఖతోపాటు, షిండే సమక్షంలో జరిగిన సమావేశంలో దానికి మద్దతుగా ఇచ్చిన లేఖకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుందని తెలుగుదేశం పార్టీ మహానాడులో తీర్మానం చేయనుంది. అదే సమయంలో గతంలో కేసీఆర్‌ టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను కూడా మరోసారి గుర్తు చేయనున్నారు. ప్రధానంగా 610 జీఓను ప్రస్తావించనున్నారు. 610 జీఓను అమలు చేయాలని ఇప్పుడు గళమెత్తుతున్న కేసీఆర్‌ గతంలో టీడీపీ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు, మళ్లీ మధ్యలో తెలంగాణనే వస్తున్నప్పుడు ఇక 610 జీఓ ఎందుకని కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను కూడా దయాకర్‌ ప్రముఖంగా ప్రస్తావించి ఎదురుదాడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా కేసీఆర్‌ కుటుంబ వసూళ్లపై టీఆర్‌ఎస్‌ మాజీ నేత రఘునందన్‌రావు చేసిన ఆరోపణలను గుర్తు చేయనున్నారు. మొత్తానికి తెలంఐగాణపై తమ పార్టీ చిత్తశుద్ధితోపాటు, ఆ అంశాన్ని అడ్డుపెట్టుకుని టీఆర్‌ఎస్‌ చేస్తున్న దాడికి చెక్‌ చెప్పేందుకు మహానాడు సిద్ధమవుతోంది.