May 27, 2013

జయం టీడీపీదే కేంద్రంలో మాదే కీలకపాత్ర


రానున్న ఎన్నికలపై చంద్రబాబురాష్ట్రంలో కాంగ్రెస్‌ది దుష్టపాలన
-కిరణ్‌కుమార్ సీల్డ్ కవర్ సీఎం
-సోనియా చెపితేనేమంత్రులతో రాజీనామా
-అందుకు మా పోరాటమే కారణం
-కాంగ్రెస్ పార్టీ దొంగల రైలు
-కేంద్రంలో పనికిమాలిన సర్కారు
-ఏపీ అంటే కేంద్రానికి లెక్కలేదు
-జగన్ అవినీతితోరూ.43వేల కోట్లు నష్టం
-ఈ మాట సీబీఐ చెప్పినదే
-మహానాడులోటీడీపీ అధినేత వ్యాఖ్యలు

:రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ అఖండ విజయం ఖాయమని ఆ పార్టీ అధినేత ఎన్ చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెప్పారు. టీడీపీ గెలుపు చారివూతక అవసరమని అభివర్ణించారు. కేంద్రంలో మూడవ ఫ్రంట్ ఏర్పాటులో టీడీపీ కీలకపాత్ర నిర్వహించనుందని చెప్పారు. సోమవారం గండిపేటలోని తెలుగు విజయంలో రెండు రోజులు జరిగే పార్టీ మహానాడును సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేసిన చంద్రబాబు.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టబోయే కార్యక్షికమాలను వివరించారు. జైల్లో ఉన్నవారు బెయిలు కోసం పని చేస్తుంటే.. తాను లోక కల్యాణం కోసం పని చేస్తున్నానన్నారు. వివిధ అంశాలపై చంద్రబాబు ప్రసంగం క్లుప్తంగా.. ఆయన మాటల్లోనే..

దేశ రాజకీయాల్లో కీలక పాత్ర
దేశ రాజకీయాల్లో టీడీపీ కీలక పాత్ర పోషిస్తుంది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన టీడీపీ.. 30 ఏళ్లుగా రాజీలేని పోరాటం చేసింది. దేశంలో నాలుగు కాంగ్రెస్ వ్యతిరేక ప్రభుత్వాలు వస్తే అందులో మూడు టీడీపీ చొరవతో ఏర్పడినవే. చరిత్ర పునరావృతం అవుతుంది. వచ్చే ఏడాది కేంద్రంలో కింగ్‌మేకర్ టీడీపీయే. మూడో కూటమి ఏర్పాటులో టీడీపీ ప్రధాన పాత్ర పోషించబోతున్నది. దేశానికి ప్రధాని, దేశాధ్యక్షులను, స్పీకర్‌లను నియమించిన ఘనత టీడీపీది. కాంగ్రెస్‌కు కేంద్రంలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. పన్నులు పెంచారు. సహజవనరులు దోచుకున్నారు. అవినీతి డబ్బు టెర్రరిస్టుల వరకు వెళుతోంది. కేంద్రంలో పనికిమాలిన ప్రభుత్వం ఉంది. ఢిల్లీలో ఆడబిడ్డను బస్సులో రేప్ చేసి చంపేశారు. కేంద్రం బలహీనంగా ఉండటంతో పక్కదేశాలలో కూడా పరపతి పెంచుకోలేక పోయారు. కేంద్రన్యాయ మంత్రి దోషులను కాపాడే ప్రయత్నంలో సీబీఐ నివేదిక తెప్పించుకొని, మార్చిన సంఘటనలో పదవి పోగొట్టుకున్నారు. అల్లుడి వ్యవహారంతో రైల్వే మంత్రి రాజీనామా చేయించాల్సి వచ్చింది. ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు. కర్ణాటక, తమిళనాడులో అదే జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. మాఫియా, రౌడీయిజం ఇష్టానుసారంగా రాజ్యమేలుతున్నాయి.

టీడీపీ అఖండ మెజార్టీతో గెలుస్తుంది

రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అవినీతి పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో 2014లో టీడీపీ అఖండ మెజార్టీతో గెలుస్తుంది. మూడవ ప్రత్యామ్నాయంలో చొరవ చేసేది టీడీపీనే. టీడీపీ గెలుపు చారివూతక అవసరం. టీడీపీ అధికారంలోకి రాగానే వృద్ధులకు వెయ్యి రూపాయలు, వికలాంగులకు రూ.1500 పింఛన్లు ఇస్తాం. అధికారంలోకి వస్తే ఉద్యోగులకు న్యాయం చేస్తాం. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వారు ఉండాలనుకుంటున్న ప్రాంతాల్లో ఇంటిని నిర్మించి ఇస్తాం. మధ్యతరగతి కుటుంబాలను ఆదుకుంటాం. అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తాం. బ్రహ్మణుల కోసం రూ.500 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తాం. కాపులకు రూ.5000 కోట్లు కేటాయిస్తాం. బీసీలకు వంద సీట్లు ఇస్తాం. దళిత క్రిస్టియన్‌లను ఎస్సీలుగా గుర్తిస్తాం. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం. 500 మంది ప్రజలున్న తండాలను పంచాయతీలుగా గుర్తిస్తాం. మైనార్టీలకు రూ.2500కోట్ల కేటాయింపుతో పాటు 15 సీట్లు ఇస్తాం.

కిరణ్ పనికిమాలిన సీఎం

కిరణ్‌కుమార్‌డ్డి సీల్డ్ కవర్ సీఎం. 70సార్లు ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో ఇంటింటికి తిరుగుతారు. ఏం సాధించారు? తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు. సోనియా చెప్పిందే చేస్తారు. పనికిమాలిన సీఎం. మంత్రుల రాజీనామా కూడా సోనియా చెపితేనే చేయించారు. రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌కు 33 మంది ఎంపీలు, 10 మంది మంత్రులు ఉన్నారు. వీరు రాష్ట్రానికి ఒరగబెట్టిందేమిటి? రాష్ట్రంలో ప్రాణహిత- చేవెళ్ల, పోలవరం ప్రాజెక్టులకు జాతీయ హోదా తీసుకురాలేక పోయారు. ఏపీ అంటే కేంద్రానికి లెక్కలేనితనం. కరువు, వరద ప్రాంతాలకు రూ.56 వేల కోట్ల సహాయం అడిగితే కేవలం రూ.ఆరు వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. కరువు పనుల కోసం 54 లక్షల టన్నుల బియ్యాన్ని పనికి అహార పథకం కింద తీసుకువచ్చి కరువు పనులు చేయించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే.

కాంగ్రెస్ పార్టీ దొంగల రైలు

వైఎస్ అధికార దుర్వినియోగం చేసి లక్ష కోట్లుదోచుకున్నారని ఆయన బతికున్నప్పుడే అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టాం. దీనిని సీబీఐ నిర్ధారించింది. రూ.43 వేల కోట్లు అవినీతి వల్ల నష్టపోయామన్న సీబీఐ దీనికి వైఎస్ కొడుకు జగన్‌ను దోషిగా నిలబెట్టింది. మంత్రులతో కలిసి దోపిడీ చేశారు. 26 జీవోలపై మంత్రులు తెలియకుండానే సంతకాలు పెట్టారా? కాంగ్రెస్ పార్టీ దొంగల రైలు. ఆ రైల్లో డ్రైవర్ ఒక్కరే మారారు. అంతా (మంవూతులు) వాళ్లే. ఒకరు ఏ-4, మరొకరు ఏ-5, ఇంకొకరు ఏ-6. ఇంకో మంత్రికి ఫెమా ఉల్లంఘన కేసులో శిక్ష పడింది. అయినా వీరంతా మంత్రి వర్గంలో ఎలా ఉంటారు? ఈ కళంకిత మంత్రులను పూర్తిగా బర్తరఫ్ చేసే వరకు టీడీపీ పోరాడుతుంది. మా పోరాటం ఫలితంగానే ఇద్దరు మంత్రులు పోయారు.

ధనయజ్ఞంగా జలయజ్ఞం
జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసి, రూ.80 వేల కోట్లు ఖర్చు చేస్తే అందులో రూ.35 వేల కోట్లు దోచుకున్నారని విచారణ సంస్థలు తెలిపాయి. వైఎస్ నుంచి కిరణ్ వరకు అంతా దోచుకుంటున్నారు. ప్రభుత్వ భూములను వారికి కావాలసినవాళ్లకు సెజ్‌ల పేరుతో ఇచ్చేస్తున్నారు. వాన్‌పిక్‌లో 22 వేల ఎకరాల భూమిని ప్రజల నుంచి లాక్కుని కారుచౌకగా ఇచ్చారు.

నా రాజకీయ చరివూతలో మరపురాని ఘట్టం ‘వస్తున్నా... మీ కోసం’
కాంగ్రెస్ దుష్టపాలన వల్ల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. దీంతో నేను హైదరాబాద్‌లో ఉండలేక ‘వస్తున్నా... మీకోసం’ పాదయాత్ర చేశాను. నా రాజకీయ చరివూతలో ఇది మరపురాని ఘట్టం. ప్రజలు, కార్యకర్తలు ఏడు నెలలు కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ప్రజల స్ఫూర్తే నన్ను నడిపించింది. అడపిల్లలకు రక్షణ లేదని, ఇంటి దగ్గర కూడా స్వేచ్ఛగా ఉండ లేకపోతున్నారని అనేక మంది పాదయావూతలో నాకు చెప్పారు. బానిస బతుకులు బతుకుతున్నామని తూర్పుగోదావరి జిల్లాలో ఒక గీత కార్మికుడు వాపోయాడు. ఎంతపని చేసినా కడుపునిండటం లేదని, దొంగలు నిలువు దోపిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి మాటలు చూస్తే వారి పరిస్థితి ఏమిటో అర్థమవుతున్నది. నిజమాబాద్ జిల్లాలో అర్ధరాత్రి మూలుగులు వినిపిస్తుంటే.. మీడియా వాళ్లు చెపితే వెళ్లి చూశాను. తిండి లేక ఓ వృద్ధురాలు దీనావస్థలో కనిపించింది. ఈ పరిస్థితులను చూసి నేను నిద్రలేని రాత్రులు గడిపాను. ఈ సమస్యలు పరిష్కరించే బాధ్యత టీడీపీకి ఉంది.

కాంగ్రెస్ పాలన వల్లే అంధకారం

కాంగ్రెస్ దుష్ట, అసమర్థ, అవినీతి పాలనవల్ల రాష్ట్రం అంధకారంలోకి వెళ్లింది. 2004లో మిగులు బడ్జెట్, మిగులు కరెంటుతో రాష్ట్రాన్ని అప్పగిస్తే నేడు అంధకారంలోకి తోశారు. తొమ్మిదేళ్లలో రూ.25 వేల కోట్ల చార్జీలు పెంచారు. ఇది కాకుండా ఎఫ్‌ఎస్‌ఏ పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఆరు లక్షల పరిక్షిశమలు మూతపడ్డాయి. 20-30 లక్షల మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారు. ఎరువుల ధరలు పెంచడం వల్ల వ్యవసాయ ఖర్చులు 300% పెరిగితే, పంటకు కేవలం 30% మాత్రమే మద్దతు ధరలు పెరిగాయి. ఈ తొమ్మిదేళ్లలో 22,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆదర్శ రైతులంటూ కాంగ్రెస్ వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసింది. టీడీపీ హయాంలో సాగునీటి సంఘాలు పెట్టి నీటి యాజమాన్య పద్ధతులను పాటించాం. ప్రాజెక్టులకు రూ.11 వేల కోట్లు ఖర్చు చేసి 30 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తే, కాంగ్రెస్ జలయజ్ఞం పేరుతో రూ.80 వేల కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేకపోయింది.