May 27, 2013

మహానాడులో బాబు ధీమా అధైర్యం వద్దంటూ శ్రేణులకు ఉద్బోధ

కళంకితుల తొలగింపు ‘దేశం’ విజయమే
కాంగ్రెస్‌ అవినీతి, అసమర్ధపార్టీ
టీఆర్‌ఎస్‌ వసూళ్ల పార్టీ
జగన్‌ది జైలుపార్టీ
ఇందిరమ్మ హస్తం.. మెుండిహస్తం
కార్యకర్తలకు పాదాభివందనాలు
ఎన్నికలకు సన్నద్ధం కండి
కార్యకర్తలకు బాబు దిశానిర్దేశం

అట్టహాసంగా ప్రారంభమైన మహానాడులో చంద్రబాబు ఎంతో ఉద్వేగంగా ప్రసంగించారు. అధికారం మనదేనని కార్యకర్తలకు ఉద్బోధ చేశారు. మహానాడులో యువనాయకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

హైదరాబాద్‌, మేజర్‌ న్యూస్‌: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, ఎవరూ అధైర్యపడాల్సిన పనిలేదని తమ్ముళ్లకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భరోసానిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ గెలుపు చారిత్రక అవసరమని కూడా ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ పోరాటాల ఫలితంగానే కళంకిత మంత్రులు ఇంటికి వెళ్లా రని బాబు గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అవినీతి కుంభకోణాల్లో మునిగి తేలుతోందని, ఆ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఆ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. సోమవారం రాజ ధాని శివారులోని గండిపేట తెలుగు విజయం ప్రాంగణంలో మహానాడు వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. మహానాడు వేదిక నుండి పార్టీ శ్రేణులకు బాబు దిశా నిర్ధేశం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని అధోగతి పాలుచేసిందని ఆయన ధ్వజమెత్తారు. టీడీపీ తొమ్మిదేళ్ల పాలనలో చేపట్టిన అభివృ ద్ధి సంస్కరణల ఫలితాలు పేదవారికి అందకుండా ఆ పార్టీ నేతలే దోచుకుతింటున్నారని విరుచుకుపడ్డారు. తల్లి కాంగ్రెస్‌, పిల్ల కాంగ్రెస్‌ నేతలు అవినీతిలో పోటీపడి రాష్ట్ర సం పదను కొల్లగొట్టారన్నారు. రోజుకో పథకాన్ని ప్రకటిస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని బాబు ఎద్దేవా చేశారు.

అయినా ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని విశ్వసించడం లేద న్నారు. అమ్మహస్తం కాదని అది మొండి హస్తం అని అప హాస్యం చేశారు. అమ్మ హస్తంలో ఇస్తున్న సరుకులు పశు వులు కూడా తినలేనంత నాసిరకంగా ఉన్నాయని విమ ర్శించారు. తెలంగాణ ప్రాంత సమస్యలపై టీఆర్‌ఎస్‌ ఏనా డూ పోరాటం చేసింది లేదన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజా సమస్యలపై తెలుగుదేశం పార్టీ అలుపెరుగని పోరా టం చేసిందని చంద్రబాబు గుర్తు చేశారు. బాబ్లీ ప్రాజెక్టుకు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు టీడీపీ పోరాడిందని, మరి టీఆర్‌ఎస్‌ ఏ కలుగులో దాక్కుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ ఏడారిగా మారుతుందని తెలిసి కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ ఫాంహౌస్‌లో పడుకుందని, తాము పోరాటం చేశామన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతోనూ, పోలీసులతోనూ పోరాటం చేశామని, తమ ఎమ్మెల్యేలు, ఎంపీలు పోలీసులతో దెబ్బలు తిన్నది అందరూ చూశారన్నారు. తెలంగాణ ప్రాంతం ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో బహిరంగ చర్చకు రావాలని తాము విసిరిన సవాల్‌ను టీఆర్‌ఎస్‌ ఎందుకు స్వీకరించడం లేదని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తెలంగాణలోని ఎనిమిది లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించామన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్న పటేల్‌, పట్వారి వ్యవస్థలను రద్దు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు.

అటు వైఎస్‌ఆర్‌ కాంగ్సెస్‌ పార్టీని చంద్రబాబు నాయుడు దుమ్మెత్తి పోశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ బెయిల్‌ కోసం తల్లి కాంగ్రెస్‌, పిల్ల కాంగ్రెస్‌ కుమ్మక్కు రాజకీయాలు నడిపిస్తూ తమ పైనే నిందలు వేసే యత్నం చేస్తున్నారని బాబు విమర్శించారు. జగన్‌ పార్టీ నేతలంతా జైలులోనే ఉండి ఎన్నికల్లో పోటీ చేస్తారా? అని ప్రశ్నించారు. నీతివంతమైన సుస్థిరమైన పాలన తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో పరిపాలన భ్రష్టుపట్టి పోయిందన్నారు. వ్యవసాయం కుదేలైందన్నారు. నిత్యావసర ధరల సంగతి చెప్పనవసరంలేదన్నారు. గ్రామాల్లో కనీసం మంచినీరు దొరకడం లేదన్నారు. మద్యం మాత్రం ఏరులై పారుతోందన్నారు. రక్షిత మంచినీరుదొరకక ఫ్లోరైడ్‌ నీటి కోసం కూడా నాలుగైదు కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకుంటు అవస్థలు పడుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకం ద్వారా ప్రతి గ్రామానికి రక్షిత మంచినీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్‌ జలయజ్ఞం పేరిట 35 వేల కోట్లు దోచుకున్నారన్నారు. కానీ ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందించలేక పోయారన్నారు. అవినీతిలో వైఎస్‌కు, కిరణ్‌కు పెద్ద తేడా లేదని, భూములు, గనులూ దోచుకుని తింటున్నారని విమర్శించారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్‌ లక్ష కోట్ల ధనాన్ని దోచుకుని ఇప్పుడు జైలు ఊచలు లెక్క బెడుతున్నారని మండిపడ్డారు. ఆయన అవినీతికి సహకరించిన మంత్రులు జైలుకు వెళ్లారని, మరి కొందరు అదే దారిలో ఉన్నారని చంద్రబాబు విమర్శించారు. మంత్రులకు తెలియ కుండానే 26 జీవోలు జారీ చేశారా? అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి బలం కార్యకర్తలనేనని, ఎవరో ఒకరిద్దరు నేతలు వెళ్లినంత మాత్రన పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. పార్టీకి అన్ని వేళలా అండదండగా ఉంటున్న కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నానని చంద్రబాబు చేతులెత్తి నమస్కరించడంతో సభా ప్రాంగణం అంతా కరతాళ ధ్వనులతో మారు మోగింది.

బడుగులకు వంద సీట్లిచ్చి ఆచరణలో చూపిస్తాం
బడుగు, బలహీనవర్గాలకు ఇచ్చినమాట ప్రకారం 100 సీట్లు ఇచ్చి ఆచరణలో చేసి చూపిస్తామని చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేసి బడుగుల అభివృద్ధి కోసం కృషి చేస్తామని చంద్రబాబుహామీనిచ్చారు. ఎన్నికల్లో అవకాశం లభించని వారికి రాజ్యసభ, ఎమ్మెల్సీ నామినేటెడ్‌ పోస్టుల్లో ప్రాధాన్యత నిస్తామన్నారు. యువతకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తామని, రాజకీయాల్లోనూ 30 శాతం సీట్లు కేటాయిస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణకు టీడీపీ కట్టుబడి ఉందన్నారు. మహిళలకు ప్రత్యేకంగా భద్రత కల్పిస్తామన్నారు.

దివంగత నేతలకు నివాళి
ఇటీవల కాలంలో మరణించిన తెలుగుదేశం పార్టీ నేతలకు మహానాడు ఘనంగా నివాళ్లు అర్పించింది. రెండు నిమిషాలు మౌనం పాటించింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దివంగత నేతలు ఎర్రంన్నాయుడు, శ్రీపతి రాజేశ్వరరావు, పొగాకు యాదగిరి, అంబటి బ్రాహ్మణయ్య తదితరులకు పేరుపేరునా నివాళ్లు అర్పించారు. మహానాడు అంటేనే శ్రీపతి రాజేశ్వరరావు గుర్తుకు వస్తారని, ఆయన ఎన్టీఆర్‌ ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసేవారని, ఎక్కడా లభించని అరుదైన చిత్రలు ప్రదర్శించి ఎన్టీఆర్‌ పట్ల ఆయనకున్న అభిమానాన్ని చాటుకున్నారని చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు.