May 27, 2013

దొంగల రైలు…డ్రైవర్ మారాడు..!



“ఎవరో ఒకరిద్దరు నేతలు పోయినంత మాత్రాన భయపడిపోతామా ? భయపడే సమస్యే లేదు. నాయకులు పార్టీని వీడిపోయినా పార్టీ కార్యకర్తల అండ వుంది. వారి రుణం తీర్చుకుంటాం. యూపీఏ పాలనలో కుంభకోణాలు బయటపడుతూనే ఉన్నాయి. కేంద్రంలో బలహీనమయిన ప్రభుత్వం ఉంది. తెలుగుదేశం పార్టీని నామరూపాలు చేస్తానన్న గాలి జనార్ధన్ రెడ్డి ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయాడు. నిజాయితీగా కార్యకర్తలకు అందుబాటులో ఉన్నందుకు మనల్ని ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఈ దొంగల రైలుకు డ్రైవర్ మాత్రం మారాడని, దొంగ మంత్రులు మాత్రం అలాగే కొనసాగుతున్నారు” అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మహానాడు సంధర్భంగా ఆయన కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత మూలంగా సమస్యలు ఎదురవుతున్నాయని, విద్యుత్ వ్యవస్థను నాశనం చేశారు. గత తొమ్మిదేళ్లలో 22,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. మహిళలకు రక్షణ లేదని, అమ్మహస్తం మొండి హస్తం అయిందని, పరిశ్రమలు మూతపడ్డాయని, 30 లక్షల మంది ఉపాధి కోల్పోయారని విమర్శించారు. అవినీతి మంత్రులందరూ రాజీనామా చేయాలని, తెలుగుదేశం పార్టీ పోరాటం మూలంగానే సోనియాగాంధీ ఆదేశాల మేరకు ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారని అన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులకు ప్రభుత్వం ఎలాంటి సాయం అందించవద్దని చంద్రబాబు డిమాండ్ చేశారు.