May 27, 2013

ఇది ఖాయం మాదే పీఠం: చంద్రబాబు


కేంద్ర, రాష్ట్రాల్లో పగ్గాలు చేపడతాం కాంగ్రెస్ సర్కారును ప్రజలు ఛీ కొడుతున్నారు
మహానాడు వేదికపై చంద్రబాబు ధీమా

రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోను గెలిచేది, ప్రభుత్వాలు ఏర్పాటు చేయబోయేది తామేనని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 'గాలి మారుతోంది. సైకిల్ దూసుకొస్తోంది. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ ఘనవిజయం సాధించబోతోంది. దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. కేంద్రంలో కూడా బీజేపీ, కాంగ్రెస్ రెండూ రావు. వచ్చేది తృతీయ ఫ్రంట్ ప్రభుత్వమే. అక్కడా టీడీపీదే కీలక పాత్ర. టీడీపీ విజయం ఓ చారిత్రక అవసరం' అని ఆయన పేర్కొన్నారు.

సోమవారం గండిపేటలోని 'తెలుగు విజయం' ఆవరణలో ప్రారంభమైన టీడీపీ మహానాడులో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. రాష్ట్రంలో అనేక వర్గాల ప్రజలు టీడీపీపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారని, వారి సంక్షేమం కోసం తాము చెప్పిన ప్రతి మాటను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరించి చూపిస్తామని, ఆడినమాట తప్పబోమని ప్రకటించారు. తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలన రాష్ట్రానికి దుర్దినమని, ప్రజల పాలిట శాపమని ఆయన వ్యాఖ్యానించారు. 'మేం ఎంతో చేసినా.. కాంగ్రెస్ పార్టీ ఇంకేదో చేస్తుందన్న ఆశతో ప్రజలు దానికి పట్టంగడితే ఇప్పుడు ప్రజలకు నరకం చూపిస్తోంది.

కాంగ్రెస్‌పై ప్రజలు విసిగిపోయారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ నేతలను ఛీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నార'ని అన్నారు. 'హైదరాబాద్‌లో రోడ్ల విస్తరణ, వంతెనల నిర్మాణం ఇతర మౌలిక వసతుల కల్పనంతా టీడీపీ హయాంలోనే జరిగింది. కానీ దీన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ సర్కారు ఇష్టారాజ్యంగా భూములు కట్టబెట్టి అక్రమాలతో దోపిడీకి పాల్పడింది. టీడీపీ వేసిన అభివృద్ధి విత్తనం చెట్టుగా ఎదిగిన తర్వాత ఫలాలను మాత్రం కాంగ్రెస్ నాయకులు దోచుకుతింటున్నార'ని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నేతలు మింగిన సొమ్మును కక్కిస్తామని ఆవేశంగా అన్నారు.

కళంకితుల్ని వదలం
'మేం మిగులు కరెంటు ఇస్తే.. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారు. కరెంటు లేక పరిశ్రమలు కుదేలై లక్షల సంఖ్యలో ఉద్యోగాలు పోతే గుడ్లప్పగించి చూశారు. కేంద్రంలో, రాష్ట్రంలో దద్దమ్మ పాలన సాగుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు నలిగిపోతున్నా పట్టించుకొనే దిక్కు లేదు. ప్రజలకు మంచినీళ్లు ఇచ్చే దిక్కు లేకపోయినా మద్యం మాత్రం ఏరులై పారిస్తున్నార'ని చంద్రబాబు విమర్శించారు.

ముఖ్యమంత్రి ఢిల్లీలో ప్రతి కాంగ్రెస్ నాయకుడికీ వంగి వంగి దండాలు పెట్టి తన పదవి కాపాడుకొంటుంటే ఇక్కడ ఆయన తమ్ముళ్లు చెరోచోట కూర్చుని సెటిల్మెంట్ల రాజ్యం నడిపిస్తున్నారని ఆరోపించారు. 'రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దొంగల రైలు బండి. డ్రైవర్ మారాడు తప్ప ప్రయాణికులుగా ఉన్న మంత్రులు మారలేదు. వైఎస్ హయాంలో జరిగిన అవినీతి అంతా వీరందరికీ తెలిసే జరిగింది. మాకేం పోయిందని ఎవరి చిల్లర వారు దండుకొన్నారు. కేసులు తలకు చుట్టుకొన్న తర్వాత తమకేం తెలియదని గగ్గోలు పెడుతున్నారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే.

శిక్ష అనుభవించక తప్పదు. టీడీపీ పోరాటం వల్లే ఇద్దరు మంత్రులు దిగిపోయారు. కానీ ఇది పాక్షిక విజయం. కళంకిత మంత్రులంతా దిగిపోవాల్సిందే. అప్పటిదాకా వదిలిపెట్టేది లేదు' అని ఆయన ప్రకటించారు. ప్రలోభాలకు గురి చేసి నాయకులను తీసుకెళ్లి చంకలు కొట్టుకొంటున్నారని, ఒక నాయకుడు పోతే 50 మంది నాయకులను తయారుచేసే శక్తి టీడీపీకి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

' నీతితో ఉండే కార్యకర్తలు టీడీపీలో ఉన్నారు. ఆస్తులు పోగొట్టుకొని పార్టీ కోసం పనిచేస్తున్నారు. ప్రాణాలకు తెగించి పార్టీని కాపాడుతున్న కార్యకర్తల పాదాలకు శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాను. మీరు లేకపోతే మేం లేం. అవకాశం వస్తే వారికి ఎంతైనా చేస్తాను. వారి రుణం తీర్చుకొంటాను' అని పేర్కొన్నారు. సొంత ఆలోచనలు లేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టీడీపీని కాపీ కొడుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. వేల కోట్ల ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసి సిగ్గూ ఎగ్గూ లేకుండా నిరసనలు చేస్తారా? అని వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మిపై చంద్రబాబు మండిపడ్డారు. ఏ తప్పు చేయకపోతే ఇప్పటి వరకు జగన్‌కు బెయిలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

24 గంటలు కరెంట్.. ఆడపిల్లకు రూ. 2 లక్షలు


తాము అధికారంలోకి వస్తే గృహసవరాలకు 24గంటల పాటు విద్యుత్ అందిస్తామని, ఆడపిల్ల పెళ్లినాటికి రూ. రెండు లక్షలు అందేలా బాలికా సంరక్షణ పధకాన్ని అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబు గతంలో ఇచ్చిన కీలక వాగ్దానాలను ఈ సందర్భంగా మరోసారి పేర్కొన్నారు. కాగా, మహానాడు తొలి రోజు పలు అంశాలపై చర్చ, ముసాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టారు.

9 ఏళ్లలో విద్యుత్ రంగం చిన్నాభిన్నం, సంక్షోభంలో వ్యవసాయం, నత్తనడకన నీటిపారుదల రంగం, రాష్టంలో అశాంతి, అభద్ర త, అనిశ్చితి, కేంద్ర, రాష్ట్ర అవినీతి, కుంభకోణాలు, కళంకిత మంత్రులు, రోజుకో పథకం- ప్రచార ఆర్భాటం, స్థానిక సంస్థలపై నిర్లక్ష్యం వంటి అంశాలపై పార్టీ నేతలు చర్చ నిర్వహించడంతో పాటు ముసాయిదా తీర్మానాలను ప్రవేశ పెట్టారు. 'వస్తున్నా... మీ కోసం' నినాదంతో చంద్రబాబు సుదీర్ఘంగా చేసిన పాదయాత్రకు సంబంధించిన సంక్షిప్త నివేదికను మహానాడు వేదికపైనుంచి ఆవిష్కరించారు. తీర్మానాల నేప«థ్యంలో జరిగిన చర్చల్లో చంద్రబాబు భాగం పంచుకున్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ 'చాలా కష్టాలు పడ్డా. ఎన్నో సంక్షోభాలు చూశాను. పాదయాత్రకు మరింత కష్టపడాల్సి వచ్చింది. పాదయాత్ర ముగిసి నాలుగు వారాలవుతున్నా పాదాల సమస్య తగ్గలేదు. ఏమైనప్పటికీ అదో మంచి కార్యక్రమం. పాదయాత్ర ఇచ్చినంత సంతృప్తిని మరే కార్యక్రమమూ ఇవ్వలేదు' అని అన్నారు.

వర్షాన్ని వెంట తెచ్చారు!

మహానాడు సభా వేదిక ఉన్న గండిపేట ప్రాంతంలో మధ్యాహ్నం 3.45 నుంచి గంటపాటు వర్షం కురిసింది. అయితే సభాస్థలిపై రేకుల కప్పు ఉండటంతో ఎలాంటి ఆటంకం కలుగలేదు. వర్షంతో పార్టీ శ్రేణుల్లో ఉల్లాసం నిండింది. ఆహ్లాద వాతావరణంలో చంద్రబాబు కూడా తనదైన శైలిలో స్పందిస్తూ 'వర్షం తెచ్చారు. అభినందనలు' అని కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.