August 22, 2013

రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా



 
సమైక్యాంధ్రకు అనుకూలంగా తొలి రాజీనామా ఆమోదం పొందింది! రాష్ట్ర విభజనను నిరసిస్తూ టీడీపీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ ఇచ్చిన రాజీనామా లేఖను చైర్మన్ హమీద్ అన్సారీ అప్పటికప్పుడే ఆమోదించారు! ఇప్పటి వరకు పలువురు రాజీనామా చేశారు. అయితే, అవి స్పీకర్ ఫార్మాట్‌లో లేకపోవడమో లేదా స్పీకర్‌కు ఫ్యాక్స్ చేయడమో చేశారు. కానీ, గురువారం ఉదయం సరిగ్గా 10:15 గంటలకు హరికృష్ణ రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ గదికి వెళ్లారు. రాజీనామా లేఖను ఆయనకు అందజేశారు.

వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు అందులో స్పష్టంచేశారు. 'నా రాజీనామాను వెంటనే ఆమోదించండి' అని పట్టుబట్టారు. దీంతో దిగ్భ్రాంతికి గురైన అన్సారీ- 'మీరు స్వచ్ఛందంగానే రాజీనా మా చేస్తున్నారా!?' అని ప్రశ్నించారు. "ఔను. స్వచ్ఛందంగానే చేశాను. ఇప్పుడే ఆమోదించండి'' అని హరికృష్ణ పట్టుబట్టారు. దీంతో రాజీనామాను ఆమోదిస్తున్నట్లు అన్సారీ అక్కడికక్కడే ప్రకటించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ దీనిపై ప్రకటన చేశారు. "ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడు ఎన్.హరికృష్ణ రాజీనామా లేఖ చైర్మన్‌కు అందింది. ఆయన దాన్ని ఆమోదించారు. గురువారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది'' అని ప్రకటించారు.

కాగా, హరికృష్ణ రాజీనామాతో మిగతా సీమాంధ్ర ఎంపీలపై ఒత్తిడి పెరిగిందని రాజకీయవర్గాలు భావిస్తున్నా యి. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన మిగిలిన ఎంపీలు 15 రోజుల కిందటే సెక్రటరీ జనరల్‌కు తమ రాజీనామా లేఖలను సమర్పించారు. కానీ, హరికృష్ణ ఒకే రోజులో తన రాజీనామాను ఆమోదింపజేసుకోవడం గమనార్హం.


రాజీనామా చేశాక టీడీపీపీ కార్యాలయంలో హరికృష్ణ చాలాసేపు మౌనంగా గడిపారు. అనంతరం తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. "రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్ర విభజనకు కేంద్రం నిర్ణయించింది. తద్వారా తెలుగుజాతి స్ఫూర్తిని చంపేసింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడానికే ఈ నిర్ణయం తీసుకుంది'' అని ధ్వజమెత్తారు. తన తండ్రి ఎన్టీ రామారావు సమైక్యాంధ్ర కోసం గట్టిగా నిలబడ్డారని, ఇప్పుడు ఆయన కలలు చెదిరిపోయాయని, అందుకే ఎంపీగా కొనసాగరాదని అంతరాత్మ ప్రబోధించిందని ఆయన చెప్పారు.


హరికృష్ణ రాజీనామా తర్వాత రాజ్యసభలో కాంగ్రెస్
ఎంపీ పాల్వాయి గోవర్ధన రెడ్డి కాసేపు హంగామా సృష్టించారు. డిప్యూటీ చైర్మన్ హరికృష్ణ రాజీనామా ఆమోదం ప్రకటన చేసిన సమయంలో "ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్'' అంటూ టీడీపీ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్ నినాదాలు చేశారు. దాంతో కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వారివద్దకు దూసుకువెళ్లారు. "చేయండి.. మీరు కూడా రాజీనామా చేయండి'' అని వారిని సవాలు చేశారు. దీంతో వారు కూడా ఆయనవైపు రాగా, మంత్రి వయలార్ రవి ఆయనను వెనక్కు తీసుకువెళ్లారు. అదే సమయంలో సభలోకి ప్రవేశించిన కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి.. పాల్వాయి వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. "వారంతా రాజీనామా చేసి హీరోలయిపోవాలనా మీ ఉద్దేశం? మీరెందుకు వారిని రెచ్చగొడుతున్నారు?'' అని ప్రశ్నించారు.

హరికృష్ణ పదవీ త్యాగం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో వైకాపా పొత్తు పెట్టుకోదని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ బహిరంగ ప్రకటన చేయాలని టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌ డిమాండ్‌ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నాలుగు రోజులుగా అమరణ దీక్షకు కూర్చున్న ఎమ్మెల్యే కరుగొండ్ల రామకృష్ణకు ఆయన సంఘీభావం తెలిపారు. గాంధీ కుటుంబాన్ని సమాధిచేసే రోజులు దగ్గర పడ్డాయన్నారు. సిగ్గు, శరం ఉంటే కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర మంత్రులను గ్రామాల్లోని ప్రజలు బహిష్కరించే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఆయనతోపాటు సూళ్లూరిపేట ఎమ్మెల్యే పరసారత్నం ఎమ్మెల్యే దీక్షకు సంఘీభావం తెలిపారు

కేంద్రమంత్రులు రాజీనామా చేయాలి : పయ్యావుల

ఆయుధాలతో పోరాడిన వాడు ఆయుధాలతోనే పోతాడని… ఓ నానుడి ఉంది. వైఎస్ గానీ, ఆయన కుటుంబం గాని విశ్వసనీయత అనే ఆయుధంతో చంద్రబాబుపై దాడి చేశారు. చేస్తూనే ఉన్నారు. ఇపుడు అదే ఆయుధం వారి మెడకు చుట్టుకుంది. మాట తిప్పం, మడమ తిప్పమని వారు చెప్పేవన్నీ పచ్చి అపద్ధాలని టీడీపీ నేతలు ప్రకటించారు. దీనికి సాక్ష్యంగా.. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలంగాణకు మద్దతుగా చేసిన వ్యాఖ్యలతో కూడిన సీడీని తెలుగుదేశం విడుదల చేసింది. తాము తెలంగాణకు అనుకూలమని విజయమ్మ, జగన్‌లు చాలా స్పష్టంగా చెప్పారన్నారు. ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే ఇదిగో వారు మాట్లాడిన మాటలు ఈ సీడీల్లో ఉన్నాయంటూ వాటిని మీడియాకు పంచారు. వైఎస్ తెలంగాణ ఉద్యమానికి రెండోసారి పునాది వేశారని విజయమ్మ చెప్పిన విషయాలు కూడా ఈ సీడీలో ఉన్నాయన్నారు. ఇంత పచ్చి అపద్ధాల కోరులు తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద బురద జల్లుతున్నారని విమర్శించారు.

జగన్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో గల్లంతయిందని టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆంధ్రాను కూడా దోచుకోవడానికి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుంటున్న జగన్ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ తో కలవడం తథ్యమని, ఇది ప్రజలందరూ చూడబోతున్నారని అన్నారు. సీమాంధ్ర ప్రజలు జగన్ కు ఓటేస్తే ఆత్మహత్య చేసుకున్నట్లే అన్నారు. ఆయన సోనియా ముసుగు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

జగన్ విశ్వసనీయతపై దెబ్బేసిన టీడీపీ


అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు వైసీపీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ తెలుగు ప్రజలతో ఆటలాడుకుంటున్నాయని టిడిపి అధికార ప్రతినిధి, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివ ప్రసాదరావు ఆరోపించారు. గుంటూరులో టిడిపి నేతలు రాజకుమారి, యరపతినేని, డాక్టర్ శనక్కాయల అరుణ చేస్తున్న ఆమరణ దీక్షలకు సంఘీభావంగా గురువారం ఆయన జిల్లా టిడిపి అధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు, పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి రిలే నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ రెండు పార్టీల నాటకాలు ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకున్నారని, త్వరలోనే వారికి తగిన విధంగా బుద్ది చెబుతారని హెచ్చరించారు.

కేవలం టిడిపిని దెబ్బతీయాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన లాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకొని తొమ్మిది కోట్ల తెలుగు ప్రజల గుండెల్లో చిచ్చు రేపిందన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం కోసం తెలుగు ప్రజలను ముక్కలు చేస్తారా అని ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 300 మంది విద్యార్థులు, యువకులు, వృద్ధులు ఆత్మ బలిదానాలు చేశారని, మరో వైపు అటెండర్ నుంచి ఉన్నతాధికారి వరకు, కార్మికుడి నుంచి ఉద్యోగి వరకు అంతా నిరవదిక సమ్మె చేస్తున్నారన్నారు. సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలు, మనోభావాలు తెలుసుకొని అందరితో చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌లో ఉండాలంటే ఉద్యోగాలు మానివేయాల్సిందే అంటూ కొంత మంది రాజకీయ నాయకులు ఉద్యోగులు, సీమాంధ్రులను హెచ్చరించటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. తెలంగాణాలో సైతం మెజార్టీ ప్రజలు సమైక్యాంధ్ర కోరుతున్నారన్నారు. తక్షణం కేంద్ర మంత్రులు, ఎంపీలు డ్రామాలు మాని రాజీనామాలు ఆమోదింప చేసుకొని ప్రజల్లోకి రాకుంటే జీరోలవుతారన్నారు.

కాంగ్రెస్, వైసీపీల కుమ్మక్కు రాజకీయాలు : కోడెల

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు విజయమ్మది దొంగ దీక్షని, కొంగ జపమని తెలుగుదేశం పార్టీ నేత రాజేంద్రప్రసాద్ విమర్శించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీని దెబ్బతీయడమే లక్ష్యంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అడిస్తున్న నాటకంలో భాగమే ఈ దీక్షని మండిపడ్డారు. గతంలో తెలంగాణకు అనుకూలంగా వైసీపీ చేసిన వ్యాఖ్యల సీడీని టీడీపీ విడుదల చేసింది. తెలంగాణకు అనుకూలమని గతంలో దివంగత వైఎస్, విజయమ్మ , జగన్‌లు చెప్పారని, తెలంగాణకు మద్దతుగా వైఎస్ అధిష్టానం వద్దకు పంపిన వారిలో తాను కూడా ఉన్నానని కొండా సురేఖ చెప్పారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కోసమే తెలుగు ప్రజలను బలి చేస్తున్నారని రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. ఈరోజు పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలను సస్పెండ్ చేస్తామని ప్రకటన చేయడాన్ని ఆయన ఖండించారు. ప్రజాస్వామ్యంలో అందరిమాటకు విలువ ఇవ్వాలని అన్నారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో రెండు నెలలపాటు సభలో ఆందోళనలు జరిగాయని, ఎవరినీ సస్పెండ్ చేయలేదని, ఇప్పుడు న్యాయం కావాలని కోరుతూ ఆందోళన చేస్తే సస్పెండ్ చేస్తారా అని ఆయన ధ్వజమెత్తారు.

ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే తెలుగు జాతి గుండె రగులుతోందని, తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలుగువారికి నాయకుడని రాజేంద్రప్రసాద్ అన్నారు. తెలంగాణ ప్రజలకు న్యాయం చేయమన్నాం కానీ, సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేయమనలేదని తెలిపారు. రాజకీయ అనివార్యంతోనే లేఖ ఇవ్వాల్సి వచ్చిందని, ఇంతటి విపత్కార పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాటకు నిలబడిన ఏకైక నాయకుడు చంద్రబాబేనని ఆయన పేర్కొన్నారు.
సీమాంధ్రప్రజలకు న్యాయం చేయాలని కోరడానికే చంద్రబాబు నాయుడు బస్సు యాత్ర చేయనున్నారని రాజేంద్రప్రసాద్ తెలిపారు. వైసీపీలా బాధ్యతా రాహిత్యంగా మాట్లాడలేదని అన్నారు. చంద్రబాబును విమర్శించే స్థాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేదని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.

విజయమ్మది దొంగ దీక్ష, కొంగ జపం : రాజేంద్రప్రసాద్

సీమాంధ్రలో రాజకీయ సమీకరణలు , ఆయా పార్టీల సంప్రదాయ ఓటు బ్యాంకు బలాబలాల్లో శరవేగంగా మార్పులు జరిగిపోతున్నాయి. విభజన నిర్ణయం తర్వాత కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర నేతలు జనంలోకి వెళ్ళే పరిస్థితి లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కూడా విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక పోతే కాంగ్రెస్‌తో రాజకీయ భవిష్యత్తు వుండదనే విధంగా మానసికంగా సిద్ధమయ్యారు. కొందరైతే కాంగ్రెస్ పార్టీని వీడాలనే ఆలోచనలు కూడా చేస్తున్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల చోటుచేసుకున్న ఆగ్రహావేశాలు సీమాంధ్ర కాంగ్రెస్ నేతల భవిష్యత్తును ఆందోళనలో పడవేశాయి. సర్వేల విషయంలో పేరెన్నికగన్న ఒక సంస్థ ఈనెల 10,15 తేదీల మధ్య ఆరు రోజుల పాటు సీమాంధ్రలోని 13 జిల్లాల ప్రజల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ పార్టీ పట్ల పూర్తి వ్యతిరేకతతో వున్నట్టు అక్కడి ప్రజలు కుండబద్దలుకొట్టారు. మరి దశాబ్దాలుగా కాంగ్రెస్‌ను అట్టిపెట్టుకున్న ఓటు బ్యాంకు ఎటువైపు మళ్ళనున్నది అనే అంశంపై జరిగిన అధ్యయనంలో మెజార్టీ ప్రజలు తెలుగుదేశం వైపే మొగ్గుచూపుతున్నట్టుగా తేలింది. కొన్ని జిల్లాల్లో దేశం, వైసీపీల మధ్య ెరాెరీగా పోరు సాగే అవకాశం వున్నట్టు, కొన్ని జిల్లాల్లో దేశం కంటే వైసీపీ ముందంజలో వుండగా, ఎక్కువ జిల్లాల్లో వైసీపీ కంటే తెలుగుదేశాన్ని ఎక్కువమంది ఆదరించేందుకు సిద్ధంగా వున్నట్టుగా అభిప్రాయం వెల్లడయింది. కోస్తా జిల్లాల్లో 2009 ఎన్నికల నాటికి 34.1 శాతం మేర కలిగివున్న దేశం ఓటు బ్యాంకు మారిన పరిస్థితిలో పెరిగింది. 12 శాతం మేర అదనంగా తెలుగుదేశం పార్టీ పట్ల ఓటర్లు ఆకర్షితు లవుతున్నట్టుగా సర్వేలో వెల్లడవుతోంది. 47 శాతం మేర ఓటు బ్యాంకును ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ కొల్లగొట్టే అవకాశం వున్నట్టు తేలింది. రాయలసీమలో 2009 ఎన్నికల సమయంలో 37.99 శాతం ఓటు పొందిన తెలుగుదేశం పార్టీ మరో 6 శాతం ఓటును పెంచుకుంది. అనంతపురం, చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, వెస్ట్‌గోదావరి, కృష్ణా, గుంటూరులలో అత్యధిక శాతం ఓటర్లు టిడిపివైపు మొగ్గు చూపుతున్నట్టు తేలింది. విశాఖ, నెల్లూరు, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లో స్వల్ప ఆధిక్యత టిడిపికి కనబడింది. ఇక వైకాపాకు సంబంధించి తెలంగాణ ప్రాంతంలో దాదాపు తుడిచిపెట్టుకు పోయినట్టు సర్వేలో తేలింది. రాయలసీమలో 49.12 శాతం, కోస్తాంధ్రలో 34.35 శాతం ఓట్లతో తెలుగుదేశం పార్టీ ె తర్వాత రెండో స్థానాన్ని కట్టబెట్టేందుకు సిద్ధంగా వున్నట్టు ప్రజానాడితో స్పష్టమయింది. కడప, కర్నూలు జిల్లాల్లో వైఎస్‌ఆర్ పార్టీకి 60 శాతం మేర అత్యధికులు ఆదరణ చూపుతున్నట్టు తెలిపింది.

పెరుగుతున్న సైకిల్ మైలేజీ

గతంలో వస్తున్నా మీ కోసం యాత్ర చేసిన బాబు మిగిలిన సీమాంధ్ర జిల్లాల్లో ఆత్మగౌరవ యాత్ర పేరుతో కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ యాత్రను 25 నుండి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మొదటగా చేయనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

25 నుండి ఆత్మగౌరవయాత్ర!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇటు సీమాంధ్ర, అటు తెలంగాణ నేతలతో సమా వేశాలు నిర్వహిం చనున్నారు. రెండు ప్రాంతాలకు చెందిన నేతలతో వేర్వేరుగా చర్చించాలని నిర్ణయించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో ఇప్పటికే ఉద్యమాల్లో టిడిపి ముందుం టున్నందున ఇటు తెలంగాణలో కూడా తాము వెనకబ డకుండా ఉండాలని ఆయన ముఖ్య నేతలకు సూచించినట్టు సమాచారం. ఇరు ప్రాంతాల్లోనూ పార్టీ పటిష్టంగా ఉండటం కోసం, భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై నేతలతో చర్చించనున్నారు. కాంగ్రెస్‌ నిర్ణయంతో తాము ఇబ్బంది పడకూడదనే ఈ భేటీలను ఏర్పాటు చేసినట్టు తెలి సిందే. గురువారం నుండే భేటీలను ప్రారంభించే అవకాశం ఉంది.

తెలంగాణ, సీమాంధ్ర నేతలతో త్వరలో చంద్రబాబు భేటీ