August 22, 2013

హరికృష్ణ పదవీ త్యాగం

రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా



 
సమైక్యాంధ్రకు అనుకూలంగా తొలి రాజీనామా ఆమోదం పొందింది! రాష్ట్ర విభజనను నిరసిస్తూ టీడీపీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ ఇచ్చిన రాజీనామా లేఖను చైర్మన్ హమీద్ అన్సారీ అప్పటికప్పుడే ఆమోదించారు! ఇప్పటి వరకు పలువురు రాజీనామా చేశారు. అయితే, అవి స్పీకర్ ఫార్మాట్‌లో లేకపోవడమో లేదా స్పీకర్‌కు ఫ్యాక్స్ చేయడమో చేశారు. కానీ, గురువారం ఉదయం సరిగ్గా 10:15 గంటలకు హరికృష్ణ రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ గదికి వెళ్లారు. రాజీనామా లేఖను ఆయనకు అందజేశారు.

వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు అందులో స్పష్టంచేశారు. 'నా రాజీనామాను వెంటనే ఆమోదించండి' అని పట్టుబట్టారు. దీంతో దిగ్భ్రాంతికి గురైన అన్సారీ- 'మీరు స్వచ్ఛందంగానే రాజీనా మా చేస్తున్నారా!?' అని ప్రశ్నించారు. "ఔను. స్వచ్ఛందంగానే చేశాను. ఇప్పుడే ఆమోదించండి'' అని హరికృష్ణ పట్టుబట్టారు. దీంతో రాజీనామాను ఆమోదిస్తున్నట్లు అన్సారీ అక్కడికక్కడే ప్రకటించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ దీనిపై ప్రకటన చేశారు. "ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడు ఎన్.హరికృష్ణ రాజీనామా లేఖ చైర్మన్‌కు అందింది. ఆయన దాన్ని ఆమోదించారు. గురువారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది'' అని ప్రకటించారు.

కాగా, హరికృష్ణ రాజీనామాతో మిగతా సీమాంధ్ర ఎంపీలపై ఒత్తిడి పెరిగిందని రాజకీయవర్గాలు భావిస్తున్నా యి. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన మిగిలిన ఎంపీలు 15 రోజుల కిందటే సెక్రటరీ జనరల్‌కు తమ రాజీనామా లేఖలను సమర్పించారు. కానీ, హరికృష్ణ ఒకే రోజులో తన రాజీనామాను ఆమోదింపజేసుకోవడం గమనార్హం.


రాజీనామా చేశాక టీడీపీపీ కార్యాలయంలో హరికృష్ణ చాలాసేపు మౌనంగా గడిపారు. అనంతరం తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. "రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్ర విభజనకు కేంద్రం నిర్ణయించింది. తద్వారా తెలుగుజాతి స్ఫూర్తిని చంపేసింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడానికే ఈ నిర్ణయం తీసుకుంది'' అని ధ్వజమెత్తారు. తన తండ్రి ఎన్టీ రామారావు సమైక్యాంధ్ర కోసం గట్టిగా నిలబడ్డారని, ఇప్పుడు ఆయన కలలు చెదిరిపోయాయని, అందుకే ఎంపీగా కొనసాగరాదని అంతరాత్మ ప్రబోధించిందని ఆయన చెప్పారు.


హరికృష్ణ రాజీనామా తర్వాత రాజ్యసభలో కాంగ్రెస్
ఎంపీ పాల్వాయి గోవర్ధన రెడ్డి కాసేపు హంగామా సృష్టించారు. డిప్యూటీ చైర్మన్ హరికృష్ణ రాజీనామా ఆమోదం ప్రకటన చేసిన సమయంలో "ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్'' అంటూ టీడీపీ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్ నినాదాలు చేశారు. దాంతో కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వారివద్దకు దూసుకువెళ్లారు. "చేయండి.. మీరు కూడా రాజీనామా చేయండి'' అని వారిని సవాలు చేశారు. దీంతో వారు కూడా ఆయనవైపు రాగా, మంత్రి వయలార్ రవి ఆయనను వెనక్కు తీసుకువెళ్లారు. అదే సమయంలో సభలోకి ప్రవేశించిన కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి.. పాల్వాయి వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. "వారంతా రాజీనామా చేసి హీరోలయిపోవాలనా మీ ఉద్దేశం? మీరెందుకు వారిని రెచ్చగొడుతున్నారు?'' అని ప్రశ్నించారు.