August 22, 2013

కాంగ్రెస్, వైసీపీల కుమ్మక్కు రాజకీయాలు : కోడెల


అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు వైసీపీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ తెలుగు ప్రజలతో ఆటలాడుకుంటున్నాయని టిడిపి అధికార ప్రతినిధి, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివ ప్రసాదరావు ఆరోపించారు. గుంటూరులో టిడిపి నేతలు రాజకుమారి, యరపతినేని, డాక్టర్ శనక్కాయల అరుణ చేస్తున్న ఆమరణ దీక్షలకు సంఘీభావంగా గురువారం ఆయన జిల్లా టిడిపి అధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు, పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి రిలే నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ రెండు పార్టీల నాటకాలు ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకున్నారని, త్వరలోనే వారికి తగిన విధంగా బుద్ది చెబుతారని హెచ్చరించారు.

కేవలం టిడిపిని దెబ్బతీయాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన లాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకొని తొమ్మిది కోట్ల తెలుగు ప్రజల గుండెల్లో చిచ్చు రేపిందన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం కోసం తెలుగు ప్రజలను ముక్కలు చేస్తారా అని ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 300 మంది విద్యార్థులు, యువకులు, వృద్ధులు ఆత్మ బలిదానాలు చేశారని, మరో వైపు అటెండర్ నుంచి ఉన్నతాధికారి వరకు, కార్మికుడి నుంచి ఉద్యోగి వరకు అంతా నిరవదిక సమ్మె చేస్తున్నారన్నారు. సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలు, మనోభావాలు తెలుసుకొని అందరితో చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌లో ఉండాలంటే ఉద్యోగాలు మానివేయాల్సిందే అంటూ కొంత మంది రాజకీయ నాయకులు ఉద్యోగులు, సీమాంధ్రులను హెచ్చరించటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. తెలంగాణాలో సైతం మెజార్టీ ప్రజలు సమైక్యాంధ్ర కోరుతున్నారన్నారు. తక్షణం కేంద్ర మంత్రులు, ఎంపీలు డ్రామాలు మాని రాజీనామాలు ఆమోదింప చేసుకొని ప్రజల్లోకి రాకుంటే జీరోలవుతారన్నారు.