December 30, 2012




ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కేసీఆరే అడ్డంకిగా మారాడని సామాజిక తెలంగాణ జేఏసీ రాష్ట్ర చైర్మన్, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ ఆరోపించారు. ఆదివారం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ' వస్తున్నా మీకోసం' పాదయాత్రకు మొగుళ్లపల్లి శివారులో మద్దతు తెలిపిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆనాటి కేంద్రం హోం మంత్రి పి.చిదంబరంతో కేసీఆర్ కుమ్మక్కై తెలంగాణ రాకుండా అడ్డుపడ్డాడని, ఇప్పుడు సుశీల్‌కుమార్‌షిండేతో రహస్య ఒప్పందం కుదుర్చుకుని తెలంగాణకు అడ్డుపడుతున్నాడని ఆరోపించారు.

షిండేతో కేసీఆర్‌కు కుదిరి న రహస్య ఒప్పందం ఏమిటో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపైన టీడీపీ స్పష్టమైన వైఖరి చెప్పిందని, అందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబును అభినందిస్తున్నామన్నారు. టీడీపీని కేసీఆర్ విమర్శించడంలో మతలబు ఏమిటో చెప్పాలన్నారు.


మాదిగను ముఖ్యమంత్రి చేస్తానని బాబు ప్రకటించాలి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మాదిగను ముఖ్యమంత్రిని చేస్తానని చంద్రబాబునాయుడు ప్రకటించాలని ఆయన కోరారు. పాదయాత్రకు సంఘీభావంగా తాము బాబు వెంట సాగుతున్నట్లు తెలిపారు. ప్రొఫెసర్ అన్సూరి, చంద్రానాయక్, ఓయూ జేఏసీ కో-కన్వీనర్ సిహెచ్.వెంకట్‌రెడ్డి, ఫయాజ్, సతీష్‌మాదిగ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణకు కేసీఆరే అడ్డంకి




 తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర రెండో రోజు (ఆదివారం) కూడా ప్రశాంతంగా సాగింది. ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. బాబు పాదయాత్ర ప్రజలకు ఓ భరోసానిస్తున్నది. బాబు ఆత్మీయ స్పర్శతో పల్లెవాసులు పులకించి పోతున్నారు. రెండో రోజు పాదయాత్ర సందర్భంగా కనిపించిన దృశ్యం ఇది. బాబు కోసం దారి పొడవునా గంటల తరబడి ఎదురు చూ స్తున్నారు. ప్రత్యక్షంగా కలిసి సమస్యలను వివరిస్తున్నారు.
 

కష్టాల నివేదన

మాజీ ముఖ్యమంత్రికి తమ కష్టాలు నివేదించుకుంటే తొలిగిపోతాయన్న ఓ చిరు ఆశ ప్రజ ల్లో కనిపిస్తోంది. తమ ఇబ్బందులను ధైర్యంగా చెబుతున్నారు. సుబ్బక్కపల్లిలో పొలాల్లో పని చేస్తున్న మహిళా వ్యవసాయ కూలీలు, కొం దరు రైతులు బాబు రావడాన్ని గమనించి చేస్తు న్న పనిని పక్కన బెట్టి రోడ్డుమీదికి వచ్చారు. వారిని చూసిన బాబు దగ్గరి వెళ్ళారు.

వారితో పాటు బండమీద కూర్చున్నారు. సమస్యలేమిటని అడగడంతోనే ఒక్కొక్కరు మైకు తీసుకొని తమ కష్టాలను ఏకరువు పెట్టారు. కరెంట్ మొ దలుకొని గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవ డం వరకు అన్నీ బాబు దృష్టికి తీసుకువచ్చారు. వారి నివేదనలో స్పష్టత, ఆవేదన చూసి బాబు చలించి పోయారు. 'నేనున్నాను. ధైర్యంగా ఉండండి. త్వరలో మంచి రోజులు వస్తాయి. త్వరలో కష్టాలన్నీ తీరుతాయి' అని ధైర్యం చెప్పారు.

సూటిగా ప్రశ్నలు

ఇదే దృశ్యం నవాబుపేట బహిరంగ సభలో నూ కనిపించింది. చంద్రబాబు ప్రసంగిస్తూ ' మీ సమస్యలేమిటో చెప్పండి' అంటూ మహిళను ప్రోత్సహించారు. జ్యోతి అనే మహిళ నిర్భయంగా తాము ఎదుర్కొంటున్న కష్టాలను వివరించింది. ధరల పెరుగుదల, కరెంట్ కొరత, బ్యాంకులు డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణాల ను వారి భర్తల అప్పుల కింద జమకట్టుకోవ డం, వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వకపోవడంతో అ నేక సమస్యలను బాబు దృష్టికి తీసుకువచ్చిం ది. సావధానంగా ఆలకించిన బాబు వాటికి కారణం రాష్ట్రంలోని అసమర్ధ పాలనే కారణం గా పేర్కొన్నారు.

ప్రధాన సమస్య కరెంట్

గ్రామస్థులు చెబుతున్న ప్రధాన సమస్య కరెంట్ కోత. వ్యవసాయానికి నిరంతరాయం గా రోజుకు 7 గంటలు కరెంట్ ఇస్తున్నట్టు చెబుతున్నా ఎక్కడా అది అమలు కావడం లేదన్న విషయం పాదయాత్రలో స్పష్టం కనిపిస్తోంది. కరెంట్ లేక చేతికొచ్చిన ఎండిపోయిన పంటల ను చూపిస్తూ రైతులు కంటనీరు పెడుతున్న దృ శ్యాలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. పాదయాత్రలో బాబుకు అనేక మంది వినతిపత్రాలను సమర్పిస్తున్నారు. వివిధ సంఘాల వారు సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు.

మధ్యాహ్నం మొదలై..

బాబు ఆదివారం మధ్యాహ్నం 2.22 గంటలకు బస్సు నుంచి బయటకు వచ్చారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి ఫోటోలు దిగారు. 2.35 గంటలకు పాదయాత్ర ప్రారంభం అ యింది. సుబ్బక్కపల్లి నవాబుపేట మధ్య 3 కి. మీ. నడిచారు. ఎగుడుదిగుడు గుట్టల మధ్య ఇ రుకు రోడ్డుపై యాత్ర సాగింది. ఎంఆర్‌పీఎస్ కార్యకర్తల హడావిడి, డప్పుచప్పుళ్ళ మధ్య సందడిగా సాగింది. మార్గంమధ్యలో బాబు ఫొటోగ్రాఫర్లకు పోజులివ్వడమే కాకుండా వారి నుంచి కెమెరా తీసుకుని తాను కొద్దిసేపు ఫొటోగ్రాఫర్ అయ్యారు. పత్తి చేను సందర్శించారు. రైతుతో మాట్లాడారు.

ఇస్సిపేటలో బస

సాయంత్రం మొగుళ్ళపల్లికి చేరుకున్నారు. ఇక్కడా బహిరంగ సభలో మాట్లాడారు. మార్గమధ్యలో వంతెన నిర్మాణం జరుగుతున్న వాగు వద్ద కొద్ది సేపు ఆగారు. టీ తాగారు. మొగుళ్ళపల్లి నుంచి మరో 4.5 కిమీ పాదయాత్ర చేసి ఇస్పిపేటకు చేరుకున్నారు. అక్కడే రాత్రి బస చేశారు.

బాబు ఆత్మీయత..జనం పులకింత




హత్యలు చేసిన వారే ఎమ్మెల్సీలు
రాష్ట్రంలో హత్యా సంస్కృతికి వైఎస్సే బాధ్యుడు
ఆయన కాలంలో జైళ్లలోనే హత్యలు
పాదయాత్రలో చంద్రబాబు
కొండా మురళి దంపతులపై పరోక్షంగా నిప్పులు
కేసీఆర్.. ఓ కుంభకర్ణుడు
కాకతీయకు కాంగ్రెస్ అపచారం
ఉత్సవాలపై నిర్లక్ష్యం సహించబోం
మేమొస్తే ఘనంగా వేడుకలు
"కాంగ్రెస్ మాఫియా పార్టీగా మారిపోయింది. రాష్ట్రానికి కావలసింది మాఫియా లీడర్లు కాదు..ప్రజాసేవకులు ' అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. హత్యలు చేసిన వారే ఎమ్మెల్సీలు అవుతున్నారంటూ కొండా మురళి దంపతులపై ఆయన నిప్పులు చెరిగారు. వరంగల్ జిల్లాలో సుబ్బక్కపల్లె వద్ద ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు పాదయాత్ర ప్రారంభించారు. నవాబుపేట, మొగుళ్లపల్లి మీదుగా 11.6 కిలోమీటర్లు నడిచారు. కాంగ్రెస్ నాయకులపై, వారి పాలన తీరుపై ఈ సందర్భంగా తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో పెద్దఎత్తున మాఫియా సంస్కృతిని పెంచి పోషించారని దుయ్యబట్టారు.

తెలుగుదేశం నేత పరిటాల రవిని పట్టపగలు పార్టీ కార్యాలయంలోనే దారుణంగా కాల్చి చంపారని గుర్తుచేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా జైళ్ళలో కూడా హత్యల పరంపర కొనసాగిందని చెప్పుకొచ్చారు. వరంగల్ జిల్లాలో కూడా మాఫియా నాయకులను ప్రోత్సహించిన పాపం వైఎస్‌దేనని దుయ్యబట్టారు. "హత్యలు చేసిన వారే ఈ జిల్లాలో ఎమ్మెల్సీలయ్యారు. వారి నేర చర్యలను అరికట్టేందుకు నా హయాంలో కఠిన చర్యలకు ప్రయత్నించాను. అయితే, వైఎస్ వాటిని అడ్డుపడ్డారు'' అని విమర్శించారు. జిల్లాలో మైనింగ్,ఇసుక,బొగ్గు మాఫియా విజృంభిస్తోందని తెలిపారు.

కాంగ్రెస్ రాష్ట్ర ఆధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్వయంగా మద్యం మాఫియా నడుపుతున్నారని విమర్శించారు. వీరందరి సహకారంతో వైఎస్ తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించి లక్ష కోట్లు సంపాదించారని చెప్పారు. 'కాంగ్రెస్‌వారు దొంగలు. అడవి పందుల్లా తిన్నంత తిని రాష్ట్రాన్ని భ్రష్ఠుపట్టించారు..' అని చంద్రబాబు ధ్వజమెత్తారు. కిరణ్‌కుమార్‌రెడ్డి కిరికిరి ముఖ్యమంత్రి అని, అన్ని పనులకు కిరికిరి పెట్టడం తప్ప రాష్ట్రాన్ని పట్టించుకోలేదన్నారు. ఆయన పనికిరాని, అసమర్ధ ముఖ్యమంత్రి అని, ప్రతిదానికి అడ్డుపుల్ల వేస్తారని విమర్శించారు.

ఎంతో ఘన చరిత్ర కలిగిన కాకతీయుల ఉత్సవాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సహించరానిదని మండిపడ్డారు. కోటిరూపాయలు అని చెప్పి కేవలం 40లక్షల రూపాయలే ఖర్చు చేశారన్నారు. తాము అధికారంలోకి వస్తే 20 కోట్లు కేటాయించి ఘనంగా వేడుకలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. బ్యాంకులో ఉన్న పుస్తెల తాళ్ళు కూడా ఇవ్వమంటున్నారని ఒక రైతు మహిళ వాపోగా, "నిజానికి మీ బంగారమంతా వైయస్ జగన్ మిత్రుడు గాలి జనార్దన్ రెడ్డి మింగేశాడు. తన కుర్చీలను, మంచాలను బంగారంతో చేయించుకున్నాడు. బంగారం ధర పెరిగిందంటే అది ఆయన చలవే''నని వ్యంగ్యంగా అన్నారు.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై మరోసారి నిప్పులు చెరిగారు. "ఆయనో కుంభకర్ణుడు. ఆరునెలలు ఫాంహౌజ్‌లో పడుకోవడం తప్ప మరేదీ తెలియదు. టీడీపీ తెలంగాణకు సానుకూలమే' అని పునరుద్ఘాటించారు. గ్యాస్ ధర పెరిగిందని మహిళలు ఫిర్యాదు చేయగా, " మా పార్టీని 42 పార్లమెంట్ స్థానాల్లో గెలిపించండి.. కేంద్రాన్ని బెదిరించైనా మీ అవసరాలకు సరిపడే గ్యాస్ ఇప్పిస్తా''అని భరోసా ఇచ్చారు.

కాంగ్రెస్.. ఓ మాఫియా పార్టీ

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మమోహన్ రెడ్డి వెయ్యి లారీల డబ్బును దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం అన్నారు. ఆయన వస్తున్నా మీకోసం పాదయాత్ర వరంగల్ జిల్లాలో కొనసాగుతోంది. బాబు పాదయాత్ర రెండో రోజు జిల్లాలోని సుబ్బక్కపల్లి నుంచి ప్రారంభమైంది. ఈ రోజు యాత్ర పదకొండున్నర కిలోమీటర్లు సాగుతుంది. ఈ సందర్భంగా బాబు మాట్లాడారు. జగన్ వెయ్యి లారీల ప్రజల డబ్బును దోచుకున్నారని తద్వారా ప్రజలకు కన్నీళ్లను మిగిల్చాడని ధ్వజమెత్తారు. అందరి జీవితాలతో ఆటలాడుకుంటున్న కాంగ్రెసు పార్టీని తరిమి కొట్టాలన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఏమీ తెలియదన్నారు. తెలంగాణ కోసమే అంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి కిరికిరి పార్టీ అని ధ్వజమెత్తారు. తన కుటుంబం కోసమే కెసిఆర్ మాటల గారడి అని విమర్శించారు. కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి వైయస్ జగన్ మనిషి అన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అండతో జగన్ లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. అవినితితో దోచుకున్న డబ్బును కాపాడుకోవడం, కేసుల నుండి బయటపడటం తప్ప వైయస్సార్ కాంగ్రెసుకు ప్రజల కష్టాలు తెలియవన్నారు. టిడిపి తెలంగాణకు సానుకూలమే తప్ప ఎప్పుడూ వ్యతిరేకం అనలేదన్నారు. మీకోసం తాను 1400 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశానన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మచ్చుకైనా కనిపించడం లేదన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. బాబుకు జూపల్లి ప్రశ్న ఈ నెల 28న జరిగిన అఖిల పక్ష సమావేశానికి ఆయా పార్టీల నుండి అధ్యక్షులు హాజరైతే తెలుగుదేశం పార్టీ నుండి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. టిడిపి 2008లో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నదే నిజమైతే ఆ తర్వాత వచ్చిన పలు ఎన్నికల్లో టిడిపి అభ్యర్థుల డిపాజిట్లు ఎందుకు గల్లంతయ్యాయని ప్రశ్నించారు.

జగన్ వెయ్యి లారీల ప్రజల డబ్బును దోచుకున్నారని తద్వారా ప్రజలకు కన్నీళ్లను మిగిల్చాడని ధ్వజమెత్తారు.