December 30, 2012

లోకేశ్ సవాలుకు బదులేది?




హరీష్‌రావు, కేటీఆర్‌కు తెలుగు యువత ప్రశ్న

ట్విటర్‌లో లోకేశ్ సవాల్‌కు హరీష్‌రావు, కేటీఆర్ జవాబు చెప్పాలని తెలుగు యువత ప్రశ్నించింది. మీ వ్యాఖ్యలకు కట్టుబడతారా? లేదా అని అడిగితే ఎందుకలా ఉలిక్కిపడుతున్నారని తెలుగు యువత నేతలు మద్దిపట్ల సూర్యప్రకాష్, నిడదవోలు ఉదయభాస్కర్ అడిగారు.

హరీష్‌రావు మాటమీద నిలబడే వ్యక్తే అయితే, ఎన్టీఆర్ భవన్‌లో అటెండర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నగదు బదిలీ పథకం గురించి తొలుత చెప్పింది లోకేష్ అని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ 2008లో ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చిన లేఖలో తెలంగాణ అన్న పదమే లేదంటున్న టీఆర్ఎస్ నేతలు, మరి ఏ లేఖ చూసి 2009 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు.

2008లో ప్రణబ్‌ముఖర్జీకి టీడీపీ ఇచ్చిన లేఖ గురించి కేటీఆర్‌కు తెలియక మాట్లాడుతున్నారన్నారు. ఆ లేఖ ఇచ్చిన తర్వాతే టీడీపీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుందని తెలిపారు. ఉద్యమం ముసుగులో దోచుకోవడం కేసీఆర్‌కు అలవాటేనని, ఆలె నరేంద్రను తన రాజకీయ అవ సరాలకు ఉపయోగించుకుని, ఆనక వెన్నుపోటు పొడిచింది ఎవరో అందరికీ తెలుసునన్నారు. కేసీఆర్ చరిత్ర గురించి కేటీఆర్‌కు తెలియకపోతే, ఉమేష్‌రావును అడిగి తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు.