December 30, 2012

కాంగ్రెస్.. ఓ మాఫియా పార్టీ




హత్యలు చేసిన వారే ఎమ్మెల్సీలు
రాష్ట్రంలో హత్యా సంస్కృతికి వైఎస్సే బాధ్యుడు
ఆయన కాలంలో జైళ్లలోనే హత్యలు
పాదయాత్రలో చంద్రబాబు
కొండా మురళి దంపతులపై పరోక్షంగా నిప్పులు
కేసీఆర్.. ఓ కుంభకర్ణుడు
కాకతీయకు కాంగ్రెస్ అపచారం
ఉత్సవాలపై నిర్లక్ష్యం సహించబోం
మేమొస్తే ఘనంగా వేడుకలు
"కాంగ్రెస్ మాఫియా పార్టీగా మారిపోయింది. రాష్ట్రానికి కావలసింది మాఫియా లీడర్లు కాదు..ప్రజాసేవకులు ' అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. హత్యలు చేసిన వారే ఎమ్మెల్సీలు అవుతున్నారంటూ కొండా మురళి దంపతులపై ఆయన నిప్పులు చెరిగారు. వరంగల్ జిల్లాలో సుబ్బక్కపల్లె వద్ద ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు పాదయాత్ర ప్రారంభించారు. నవాబుపేట, మొగుళ్లపల్లి మీదుగా 11.6 కిలోమీటర్లు నడిచారు. కాంగ్రెస్ నాయకులపై, వారి పాలన తీరుపై ఈ సందర్భంగా తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో పెద్దఎత్తున మాఫియా సంస్కృతిని పెంచి పోషించారని దుయ్యబట్టారు.

తెలుగుదేశం నేత పరిటాల రవిని పట్టపగలు పార్టీ కార్యాలయంలోనే దారుణంగా కాల్చి చంపారని గుర్తుచేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా జైళ్ళలో కూడా హత్యల పరంపర కొనసాగిందని చెప్పుకొచ్చారు. వరంగల్ జిల్లాలో కూడా మాఫియా నాయకులను ప్రోత్సహించిన పాపం వైఎస్‌దేనని దుయ్యబట్టారు. "హత్యలు చేసిన వారే ఈ జిల్లాలో ఎమ్మెల్సీలయ్యారు. వారి నేర చర్యలను అరికట్టేందుకు నా హయాంలో కఠిన చర్యలకు ప్రయత్నించాను. అయితే, వైఎస్ వాటిని అడ్డుపడ్డారు'' అని విమర్శించారు. జిల్లాలో మైనింగ్,ఇసుక,బొగ్గు మాఫియా విజృంభిస్తోందని తెలిపారు.

కాంగ్రెస్ రాష్ట్ర ఆధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్వయంగా మద్యం మాఫియా నడుపుతున్నారని విమర్శించారు. వీరందరి సహకారంతో వైఎస్ తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించి లక్ష కోట్లు సంపాదించారని చెప్పారు. 'కాంగ్రెస్‌వారు దొంగలు. అడవి పందుల్లా తిన్నంత తిని రాష్ట్రాన్ని భ్రష్ఠుపట్టించారు..' అని చంద్రబాబు ధ్వజమెత్తారు. కిరణ్‌కుమార్‌రెడ్డి కిరికిరి ముఖ్యమంత్రి అని, అన్ని పనులకు కిరికిరి పెట్టడం తప్ప రాష్ట్రాన్ని పట్టించుకోలేదన్నారు. ఆయన పనికిరాని, అసమర్ధ ముఖ్యమంత్రి అని, ప్రతిదానికి అడ్డుపుల్ల వేస్తారని విమర్శించారు.

ఎంతో ఘన చరిత్ర కలిగిన కాకతీయుల ఉత్సవాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సహించరానిదని మండిపడ్డారు. కోటిరూపాయలు అని చెప్పి కేవలం 40లక్షల రూపాయలే ఖర్చు చేశారన్నారు. తాము అధికారంలోకి వస్తే 20 కోట్లు కేటాయించి ఘనంగా వేడుకలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. బ్యాంకులో ఉన్న పుస్తెల తాళ్ళు కూడా ఇవ్వమంటున్నారని ఒక రైతు మహిళ వాపోగా, "నిజానికి మీ బంగారమంతా వైయస్ జగన్ మిత్రుడు గాలి జనార్దన్ రెడ్డి మింగేశాడు. తన కుర్చీలను, మంచాలను బంగారంతో చేయించుకున్నాడు. బంగారం ధర పెరిగిందంటే అది ఆయన చలవే''నని వ్యంగ్యంగా అన్నారు.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై మరోసారి నిప్పులు చెరిగారు. "ఆయనో కుంభకర్ణుడు. ఆరునెలలు ఫాంహౌజ్‌లో పడుకోవడం తప్ప మరేదీ తెలియదు. టీడీపీ తెలంగాణకు సానుకూలమే' అని పునరుద్ఘాటించారు. గ్యాస్ ధర పెరిగిందని మహిళలు ఫిర్యాదు చేయగా, " మా పార్టీని 42 పార్లమెంట్ స్థానాల్లో గెలిపించండి.. కేంద్రాన్ని బెదిరించైనా మీ అవసరాలకు సరిపడే గ్యాస్ ఇప్పిస్తా''అని భరోసా ఇచ్చారు.