December 30, 2012

మీ ప్రభుత్వమే రావాలి



 
చంద్రబాబునాయుడు పాదయాత్రలో భాగంగా శనివారం దారి వెంట ఉన్న మహిళలు, రైతులతో మాట్లాడారు. ఈ క్రమంలో మొగుళ్లపల్లి మం డలం దుబ్యాల గ్రామశివారులో పత్తి చేనులో పత్తి తీస్తున్న కూలీలు, రైతుల వద్దకు బాబు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న ఎడ్లబండిపై చంద్రబాబు కూర్చుని మహిళలు, రైతులతో మాట్లాడారు. వారి మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది.

బాబు: ఈ పంట ఎవరిది

హన్మంతరావు: నాదే అయ్యా..(చింతల హన్మంతరావు, దుబ్యాల:గ్రామం)

బాబు: పంట ఎలా ఉంది..?

హన్మంతరావు: దిగుబడి లేదు.

బాబు: అంతటా పరిస్థితి ఇలాగే ఉంది. రైతులు కష్టాల్లో ఉన్నారు. పెట్టుబడి పెరిగింది. దిగుబడి తగ్గింది. గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు.

హన్మంతరావు : మీ ప్రభుత్వంలోనే బాగుండేది.

బాబు : మళ్లీ మా ప్రభుత్వం వస్తుంది. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. మహిళలకు రుణాలు అందిస్తాం.

మహిళా కూలీలతో మాట్లాడుతూ..

బాబు: పావుల వడ్డీ రుణాలు ఇస్తున్నారా..?

కవిత: పావులా అన్నారు, కానీ రూపాయిన్నర కడుతున్నాం.

బాబు: రైతులకైనా పావులా వడ్డీ ఇస్తున్నారా..?

కవిత: ఇవ్వడం లేదు.

బాబు : రుణాలు ఇవ్వరు. కరెంట్ ఇవ్వరు. మేం అధికారంలో ఉన్నప్పుడు 9గంటల కరెంట్ ఇచ్చాం. ఇప్పుడు కనీసం 3గంటలు ఇవ్వడం లేదు.

సంగె సునిత : గుడిసె ఇంటికి రెండు బల్బులు ఉంటే రూ.1600 బిల్లు కట్టాం.. కట్టకుంటే కేసు పెడతాం అంటున్నారు.

లక్ష్మి: మాకు రూ.15వేలు బిల్లు వచ్చింది

బాబు : కరెంట్ సక్రమంగా ఇవ్వరు. పొద్దంతా కోతలే. రాత్రి కరెంట్‌కు వేల బిల్లులు వేస్తున్నారు. అంద రినీ కష్టాల్లోకి నెడుతున్నారు. రైతులకు ఎరువుల ధరలు పెంచారు. మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేదు. పెట్టుబడి పెరిగి రైతులు వ్యవసాయం భారంగా మారింది. అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ చేస్తాం. వ్యవసాయం సులభతరం చేస్తాం.

అయిలమ్మ: ఇందిరమ్మ బిల్లు రావడం లేదు.


బాబు: బిల్లులు ఇవ్వకుండా కాంగ్రెస్ నేతలే తింటున్నారు. అధికారంలోకి వస్తే లక్ష రూపాయలు వెచ్చించి ఇల్లు కట్టిస్తాం.ప్రజలు ధైర్యంగా ఉండాలి. భ్రష్టు ప ట్టిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి.సమస్యలు తెలుసుకునేందుకే మీవద్దకు వచ్చా.

చంద్రబాబు నాయుడు తన సంభాషణ మహిళలతో ముగించి పాదయాత్ర ప్రారంభించారు. కొద్దిదూరం వెళ్లగానే దారి వెంట ఉన్న పత్తి రైతు రాజయ్య తన గోడు వెల్లబుచ్చుకున్నాడు. పత్తి దిగుబడి రావడం లేదని, గిట్టుబాటు ధర లేద ని, ఎరువుల ధరలు పెరిగాయని పేర్కొన్నారు. వచ్చేది మన ప్రభుత్వమేనని, రైతులకు వ్యవసాయం అందుబాటులో ఉండేలా, రైతులు అభివృద్ధి చెందేలా తొలి సంతకం రైతుల రుణమాఫీపై పెడతానని, భరోసా ఇచ్చారు.