December 30, 2012

పల్లె పల్లెనా బాబుకు ఘనస్వాగతం



 
చంద్రబాబు చేపట్టిన 'వస్తున్న మీకోసం' పాదయాత్ర శనివారం సుమారు 14కి.మీ. వరకు సాగింది. అడుగడుగున మహిళలు బోనాలతో స్వాగతం పలుకగా రైతులు, భిన్నవర్గాల ప్రజలు బా బు యాత్రకు సంఘీభావంగా ఆయన వెంట కదిలా రు. బోనాలతో వచ్చిన మహిళలతో కలిసి చంద్రబాబు తన యాత్రను ప్రారంభించారు. వెల్లంపల్లి గ్రామ సమీపంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయానికి వెళ్లి బోనా లు సమర్పించారు. అనంతరం వెల్లంపల్లి గ్రామ కూడలి వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంత రం చంద్రబాబు తన పాదయాత్ర చేసుకుంటూ దుబ్యాల పత్తి చేనులో ఉన్న మహిళలు, రైతులతో మాట్లాడారు. పత్తి గిట్టుబాటు ధర గురించి, రైతు కూలీల గురించి అడిగి తెలుసుకున్నారు.

అనంతరం దుబ్యాల గ్రామంలోని గొల్లకురుమ సంఘం నాయకులు చంద్రబాబునాయుడికి గొర్రెపోతును బహూకరించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన బింగి లచ్చమ్మ అనే వృద్ధురాలు తనకు పింఛ న్ రావడం లేదని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా రూ.2వేల ఆర్థికసహాయం అందించారు. గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామకూడలి వద్ద జరిగిన రోడ్‌షోలో బాబు మాట్లాడారు.

అనంతరం దుబ్యాల నుంచి రాఘవరెడ్డిపేటకు పా దయాత్రను ప్రారంభించారు. ఈ క్రమంలో ఆరెపల్లి క్రాస్ వద్ద మహిళలు, రైతులు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, తెలంగాణ రావాలంటూ జై తెలంగాణ నినాదాలు చేశారు. తెలంగాణపైన తాము స్ప ష్టమైన వైఖరి వెల్లడించామని చంద్రబాబు పేర్కొన్నారు. అనంతరం మధ్యాహ్నం 2.40గంటలకు మధ్యాహ్న భోజనం కోసం వాహనాలను రోడ్డుపై నిలిపివేశారు. సుమారు 5గంటల ప్రాంతంలో తన పాదయాత్ర మళ్లీ ప్రారంభించి, 6గంటలకు రాఘవరెడ్డిపేటకు చేరుకున్నారు. రాఘవరెడ్డిపేటలో జరిగిన రోడ్‌షోలో ఢిల్లీలో గ్యాంగ్‌రేప్‌లో మృతిచెందిన విద్యార్థిని ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధి పనుల గురించి అమలు చేయబోయే పథకాల గురించి మాట్లాడుతూ కేసీఆర్, జగన్‌లపై తీవ్ర విమర్శలు చేశారు.

అనంతరం చిట్యాల మండలం టేకుమట్ల గ్రామశివారులో మహిళలు భారీ ఎత్తున తరలివచ్చారు. బో నాలతో స్వాగతం పలికారు. మహిళల బోనం ఎత్తుకుని చంద్రబాబునాయుడు కదలారు. అనంతరం టేకుమట్లలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. అక్కడి నుంచి డప్పు చప్పుళ్ల మధ్య అకుంషాపురం గ్రామానికి చేరుకోగా పెద్దసంఖ్యలో మహిళలు స్వా గతం పలికారు. 9గంటల సమయంలో చంద్రబాబు రోడ్డుపై కూర్చుని టీ తాగారు. అనంతరం సుబ్బక్కపల్లిలో మాట్లాడి రాత్రి 10.10గంటలకు బస ప్రాంగణానికి చేరుకున్నారు. చంద్రబాబు తన ప్రత్యేక వాహనానికి వెళ్లడంతో మొదటి రోజు పాదయాత్ర ప్రశాంతంగా ముగిసింది.

ప్రతీచోట చంద్రబాబు పాదయాత్రకు మహిళలు ఘనస్వాగతం పలికారు. వెల్లంపల్లి, దుబ్యాల, రాఘవరెడ్డిపేట, టేకుమట్ల గ్రామాలకు పాదయాత్ర ప్రవేశిస్తున్న క్రమంలో మహిళలు పెద్దసంఖ్యలో బోనాలతో, డప్పుచప్పుళ్లతో తరలివచ్చి బాబుకు స్వాగతం పలికారు.