December 30, 2012

తెలంగాణపై మేం స్వచ్ఛం!చంద్రబాబు





ఎప్పుడూ వ్యతిరేకించలేదు.. వ్యతిరేకించబోం  2008 లేఖను చూసే టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది
కేసీఆర్ కుంభకర్ణుడు.. డబ్బు కోసం ఏమైనా చేస్తాడు
బతికుండి పోరాడండి
చంపాల్సింది కాంగ్రెస్ పార్టీని!
కాంగ్రెస్ ఓ దివాలాకోరు పార్టీ
'వస్తున్నా.. మీ కోసం' లో చంద్రబాబు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తెలుగుదేశం పార్టీ సానుకూలతను కేసీఆర్ శంకించడంలో అర్థం లేదని, ఈ విషయంలో తమ నిర్ణయం స్వచ్ఛమైనదని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్రలో భాగంగా శనివారం వరంగల్ జిల్లా చిట్యాల మండలం దుబ్యాల, టేకుమల్ల గ్రామాల్లో జరిగిన సభల్లో ఆయన ప్రసంగించారు. తెలంగాణపై సానుకూలతను ప్రకటిస్తూ 2008లో తమ పార్టీ లేఖ ఇచ్చిన తర్వాతే 2009 ఎన్నికల్లో కేసీఆర్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారని గుర్తు చేశారు.

అలాంటిది తమ పార్టీపై అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. "కేసీఆర్ ఓ కుంభకర్ణుడు. ఆరు నెలలు ఫామ్ హౌస్‌లో పడుకుని, ఆరు నెలలు బయట ఉంటారు. డబ్బులొస్తున్నాయంటే ఎవరితోనైనా లాలూచీపడతారు. తెలంగాణపై కేసీఆర్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా మార్చే బాబ్లీతో పాటు మరో 11 ప్రాజెక్టులను మహారాష్ట్రలో కడుతున్నా.. ఏ మాత్రం పట్టించుకోలేదు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు బీడీ కట్టలపైన పుర్రె, శవం గుర్తులను వేయించి బీడీ కార్మికుల పొట్ట కొట్టారు.'' అని మండిపడ్డారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు వద్దు.. బతికుండి పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

"టీడీపీ తెలంగాణకు వ్యతిరేకం కాదు. ఎప్పుడూ వ్యతిరేకించలేదు. భవిష్యత్తులో వ్యతిరేకించబోదు'' అని స్పష్టంగా ప్రకటించారు. కాంగ్రెస్ ఓ దివాలాకోరు పార్టీ అని, ప్రభుత్వ అసమర్థ పాలన వల్లనే రాష్ట్రంలో అవినీతి పెచ్చుపెరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, అప్పుడు నియమితులైన వారు చివరికి ఏపీపీఎస్సీ ఉద్యోగాలను సైతం అమ్ముకున్నారని ఆరోపించారు. మన రాష్ట్రానికి ఉన్నంత అసమర్థ ముఖ్యమంత్రి ఎక్కడా లేరని, అవినీతి మంత్రులను కాపాడడంలోనే ఆయన తీరికలేకుండా ఉన్నారన్నారు.

చంపాల్సింది కాంగ్రెస్ పార్టీని..
పంట గిట్టుబాటు ధర రాక అప్పుల బాధతో రాష్ట్రంలో 22,500 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని చంద్రబాబు చెప్పారు. 'చావాల్సింది మనం కాదు.. చంపాల్సింది కాంగ్రెస్ పార్టీ'నని పేర్కొన్నారు. రాష్ట్రంలో 9 ఏళ్లుగా దొంగలు పడ్డారని, తాము చేసిన అభివృద్ధి ఫలాలను దోచుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రైతులకు 9గంటల పాటు ఉచితంగా కరెంట్ ఇస్తామని, వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని హామీ ఇచ్చారు.

ఆడ పిల్లల అభివృద్ధి కోసం ఉద్యోగాల్లో 33శాతం రిజర్వేషన్ కల్పించింది తామేనని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్‌లో సైబరాబాద్ ఏర్పాటు చేసి ఐటీని అభివృద్ధి చేశామన్నారు. ఎస్సీలలో మాదిగలు పూర్తిగా వెనకబడ్డారని, తమ ప్రభుత్వ హయాంలో ఎస్సీ వర్గీకరణ చేస్తే నాలుగేళ్ల కాలంలో 24,500మందికి ఉద్యోగాలు లభించాయని అన్నారు. 63ఏళ్ల వయస్సులో పాదయాత్ర చేస్తున్నానంటే ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకునేందుకేనని చంద్రబాబు స్పష్టం చేశారు.