December 30, 2012

కెసిఆర్‌ను కుంభకర్ణునితో పోల్చిన బాబు






తెలంగాణపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, మేం ఎప్పుడూ స్వచ్ఛంగా ఉన్నామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు  నారా చంద్రబాబు నాయుడు శనివారం అన్నారు. వరంగల్ జిల్లాలో ఆయన వస్తున్నా మీకోసం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2008లో తాము లేఖ ఇచ్చామనే తెలంగాణ రాష్ట్ర సమితి తమతో పొత్తు పెట్టుకుందన్నారు. తెలంగాణను తాము ఎప్పుడూ వ్యతిరేకంచలేదని, వ్యతిరేకించబోమని చెప్పారు.


తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుంభకర్ణుడు అని, డబ్బు కోసం ఏమైనా చేస్తాడని మండిపడ్డారు. బతికుండి పోరాడాలి కానీ చచ్చి సాధించేదేమీ లేదని చంద్రబాబు పిలుపునిచ్చారు. చంపాల్సింది కాంగ్రెసు పార్టీని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తెలుగుదేశం పార్టీ సానుకూలతను కెసిఆర్ శంకించడంలో అర్థం లేదని, ఈ విషయంలో తమ నిర్ణయం స్వచ్ఛమైందన్నారు.

తమ పార్టీపై అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కెసిఆర్ ఓ కుంభకర్ణుడు అని, ఆరు నెలలు ఫామ్ హౌస్‌లో పడుకుని, ఆరు నెలలు బయట ఉంటారని, డబ్బులొస్తున్నాయంటే ఎవరితోనైనా లాలూచీ పడతారని ధ్వజమెత్తారు. తెలంగాణపై కెసిఆర్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా మార్చే బాబ్లీతో పాటు మరో 11 ప్రాజెక్టులను మహారాష్ట్రలో కడుతున్నా.. ఏ మాత్రం పట్టించుకోలేదు.

కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు బీడీ కట్టలపైన పుర్రె, శవం గుర్తులను వేయించి బీడీ కార్మికుల పొట్ట కొట్టారని మండిపడ్డారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు వద్దు.. బతికుండి పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఓ దివాలాకోరు పార్టీ అని, ప్రభుత్వ అసమర్థ పాలన వల్లనే రాష్ట్రంలో అవినీతి పెచ్చుపెరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, అప్పుడు నియమితులైన వారు చివరికి ఎపిపిఎస్సీ ఉద్యోగాలను సైతం అమ్ముకున్నారని ఆరోపించారు.

మన రాష్ట్రానికి ఉన్నంత అసమర్థ ముఖ్యమంత్రి ఎక్కడా లేరని, అవినీతి మంత్రులను కాపాడడంలోనే ఆయన తీరికలేకుండా ఉన్నారని కిరణ్ కుమార్ రెడ్డిపై మండిపడ్డారు. పంట గిట్టుబాటు ధర రాక అప్పుల బాధతో రాష్ట్రంలో 22,500 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని చంద్రబాబు చెప్పారు. చావాల్సింది మనం కాదు.. చంపాల్సింది కాంగ్రెస్ పార్టీనన్నారు. రాష్ట్రంలో 9 ఏళ్లుగా దొంగలు పడ్డారని, తాము చేసిన అభివృద్ధి ఫలాలను దోచుకుంటున్నారని వ్యాఖ్యానించారు.