December 30, 2012

స్పష్టం' చేశామనే కేసీఆర్‌కు మాపై అసూయ


ఆయన ఒత్తిడితోనే ప్నొం మాట మార్చారు: టీడీపీ

 అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై టీడీపీ స్పష్టమైన సానుకూల వైఖరిని ప్రదర్శించడంతో.. అన్ని పార్టీలు మెచ్చుకున్న కారణంగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అసూయతో ఉడుకుతున్నారని టీడీపీ వ్యాఖ్యానించింది. అసెంబ్లీ ఆవరణలోని టీడీఎల్పీ కార్యాలయంలో శనివారం ఆ పార్టీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి మాట్లాడారు. అఖిలపక్ష సమావేశంలో ఏం జరిగిందో జేఏసీతోగాని.. ఇతరులతోగాని చర్చించకుండా బయటకు వచ్చీ రావడంతోనే బంద్ పిలుపు ఇవ్వడంలోనే కేసీఆర్ కుటిల తత్వం తెలంగాణ ప్రజలకు తెలిసిపోయిందన్నారు.

డిసెంబర్ పదో తేదీన టీడీపీపై దుష్ప్రచారం మొదలు పెట్టినట్లుగా ఇప్పుడు కూడా పెట్టాలని కేసీఆర్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ తన వైఖరి చెప్పడం వల్లే కాంగ్రెస్‌పై ఒత్తిడి పెరిగి నెల రోజుల్లో తేలుస్తామని చెప్పింది. అది మేం సాధించిన విజయం' అని ఆయన అన్నారు. కోదండరాంను, జేఏసీని తనకు వంత పాడేవారుగా కేసీఆర్ తయారు చేస్తున్నారని, ఇదే పరిస్ధితి కొనసాగితే జేఏసీ కూడా టీఆర్ఎస్ మాదిరిగా తెలంగాణ ప్రజలకు దూరమయ్యే పరిస్ధితి వస్తుందని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ ధృతరాష్ట్ర కౌగిలి నుంచి బయటకు రావాలని కోదండరాంకు పిలుపునిచ్చారు.

తెలంగాణ సాధనపై చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక రాష్ట్ర సాధనకు కట్టుబడి ఉన్నవారందరినీ జేఏసీ కలుపుకొని పోవాలి. కేసీఆర్ ఒత్తిడి వల్లే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట మార్చారని నర్సారెడ్డి అన్నారు. 'టీఆర్ఎస్‌లోకి వచ్చేవాడివి టీడీపీని మెచ్చుకోవడం ఏమిటని కేసీఆర్ ఒత్తిడి చేస్తే ఆయన మాట మార్చినట్లున్నారు' అన్నారు. న్యాయవాదుల జేఏసీ లోకేశ్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంపై విస్మయం వ్యక్తం చేశారు. 'హరీశ్‌రావు అన్నమాటనే లోకేశ్ గుర్తు చేశాడు. కేటీఆర్ వందసార్లు చంద్రబాబును నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. లోకేశ్ స్థాయి గురించి మాట్లాడేవారు కేటీఆర్ స్థాయి గురించి ఎందుకు మాట్లాడరు' అని ప్రశ్నించారు.