December 30, 2012

జగన్ వెయ్యి లారీల ప్రజల డబ్బును దోచుకున్నారని తద్వారా ప్రజలకు కన్నీళ్లను మిగిల్చాడని ధ్వజమెత్తారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మమోహన్ రెడ్డి వెయ్యి లారీల డబ్బును దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం అన్నారు. ఆయన వస్తున్నా మీకోసం పాదయాత్ర వరంగల్ జిల్లాలో కొనసాగుతోంది. బాబు పాదయాత్ర రెండో రోజు జిల్లాలోని సుబ్బక్కపల్లి నుంచి ప్రారంభమైంది. ఈ రోజు యాత్ర పదకొండున్నర కిలోమీటర్లు సాగుతుంది. ఈ సందర్భంగా బాబు మాట్లాడారు. జగన్ వెయ్యి లారీల ప్రజల డబ్బును దోచుకున్నారని తద్వారా ప్రజలకు కన్నీళ్లను మిగిల్చాడని ధ్వజమెత్తారు. అందరి జీవితాలతో ఆటలాడుకుంటున్న కాంగ్రెసు పార్టీని తరిమి కొట్టాలన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఏమీ తెలియదన్నారు. తెలంగాణ కోసమే అంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి కిరికిరి పార్టీ అని ధ్వజమెత్తారు. తన కుటుంబం కోసమే కెసిఆర్ మాటల గారడి అని విమర్శించారు. కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి వైయస్ జగన్ మనిషి అన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అండతో జగన్ లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. అవినితితో దోచుకున్న డబ్బును కాపాడుకోవడం, కేసుల నుండి బయటపడటం తప్ప వైయస్సార్ కాంగ్రెసుకు ప్రజల కష్టాలు తెలియవన్నారు. టిడిపి తెలంగాణకు సానుకూలమే తప్ప ఎప్పుడూ వ్యతిరేకం అనలేదన్నారు. మీకోసం తాను 1400 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశానన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మచ్చుకైనా కనిపించడం లేదన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. బాబుకు జూపల్లి ప్రశ్న ఈ నెల 28న జరిగిన అఖిల పక్ష సమావేశానికి ఆయా పార్టీల నుండి అధ్యక్షులు హాజరైతే తెలుగుదేశం పార్టీ నుండి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. టిడిపి 2008లో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నదే నిజమైతే ఆ తర్వాత వచ్చిన పలు ఎన్నికల్లో టిడిపి అభ్యర్థుల డిపాజిట్లు ఎందుకు గల్లంతయ్యాయని ప్రశ్నించారు.