June 27, 2013


హైదరాబాద్: కేంద్ర మంత్రి చిరంజీవి వరద బాధితులను పట్టించుకోకుండా జోకర్‌లా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగువారికి సహాయం అందించడంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు.

ముఖ్యమంత్రి వరద బాధితులను పట్టించుకోవడం లేదని, రాష్ట్ర చరిత్రలో కిరణ్ కుమార్ రెడ్డి అంతటి అసమర్థ ముఖ్యమంత్రిని చూడలేదని ఆయన అన్నారు బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్లనే తమ పార్టీ చొరవ చూపిందని ఆయన చెప్పారు. కాంగ్రెసు దొంగల ముఠా పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు.

డెహ్రడూన్‌లో తమ పార్లమెంటు సభ్యుల పట్ల కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడ్డారు. అధికారం పొతుందనే భయంతో కాంగ్రెసు నాయకులు విచక్షణ కోల్పోయారని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయం చేస్తూ బాధితులను నిర్లజ్జగా గాలికి వదిలేశారని ఆయన అన్నారు. కాళ్లుపట్టుకుంటే ముఖ్యమంత్రి పదవి ఉంటుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిగ్విజయ్ సింగ్ చుట్టూ తిరుగుతున్నారని అన్నారు.

మధ్యప్రదేశ్ ఎన్నికలకు నిధుల కోసమే దిగ్విజయ్ సింగ్‌ను రాష్ట్రానికి పంపిస్తున్నారని ఆయన అన్నారు. తమ పార్లమెంటు సభ్యుల పట్ల వ్యవహరించిన తీరుకు కాంగ్రెసు నాయకులపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణపై తమ పార్టీ స్పష్టంగా చెప్పిందని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెసు పార్టీ పంచాయతీ మెంబర్ పదవిని కూడా గెలువలేదని ఆయన అన్నారు.

చిరంజీవి జోకర్‌లా వ్యవహరిస్తున్నారు: రేవంత్ రెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు యాత్రీకులతో కలిసి హైదరాబాద్‌ చేరుకున్నారు. డెహ్రాడూన్‌ నుంచి 110 మంది తెలుగు యాత్రీకులతో టీడీపీ విమానం హైదరాబాద్‌కు చేరుకుంది.

హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబు

ఏపీ భవన్‌లో వరద బాధితులను పరామర్శిస్తున్నట్టు సీఎం కిరణ్‌ నటిస్తున్నారని టీడీపీ నేత తలసాని శ్రీనివాసయాదవ్‌ అన్నారు. ఢిల్లీలో ఆయన మూడు రోజులుగా సోనియా అనుమతి కోసం ప్రదక్షిణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలుగువారి పట్ల కేంద్రానికి ఎంత చిన్న చూపు ఉందో, సీఎంకు కూడా అంతే ఉండడం విచారకరమని ఆయన చెప్పారు.

సీఎం పరామర్శ ఓ నటన : తలసాని